మానవ మనుగడకు భౌతిక శాస్త్ర పరిశోధనలే కీలకం

10 Aug, 2018 11:36 IST|Sakshi
మాట్లాడుతున్న ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిజిక్స్‌’ సంస్థ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ సుధాకర్‌ పండా 

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిజిక్స్‌ సంస్థ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ సుధాకర్‌ పండా

విజయనగరం అర్బన్‌ : విశ్వమానవ మనుగడకు భౌతిక శాస్త్ర పరిశోధనలే కీలకమని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిజిక్స్‌ సంస్థ (భువనేశ్వర్‌) డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ సుధాకర్‌ పండా అన్నారు. ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ బెంగళూరు సంయుక్త సహకారంలో స్థానిక మహరాజా అటానమస్‌ కళాశాలలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న సదస్సు ప్రారంభోత్సవ సభలో గురువారం ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ గురుత్వాకర్షణ తరంగాల నుంచి అంతరాల పరమాణు కణాల వరకు ప్రతి అంశం మానవ జీవనానికి ముడిపడినవేని చెప్పారు.

భౌతిక శాస్త్ర అంశాలపై పరిశోధనలు విస్తృత స్థాయిలో జరగాలని సూచించారు. విద్యార్ధి దశ నుంచి పరిశోధనా దృక్పథాన్ని కల్పించే బోధనాంశాల శైలి రావాలని అభిప్రాయపడ్డారు. అనంతరం సదస్సు తొలిరోజు కార్యక్రమాలను ప్రారంభించారు. తొలిరోజు వక్తలుగా ప్రొఫెసర్లు అజిత్‌ మోహన్‌ శ్రీవత్స, డాక్టర్‌ సంజీవకుమార్‌ అగర్వాలా, డాక్టర్‌ నిష్నికాంత్‌ కాందాయ పాల్గొన్నారు.

కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జి.ఎ.కల్యాణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాన్సాస్‌ ట్రస్ట్‌ సభ్యులు పూసపాటి అదితిగజపతిరాజు, కరస్పాండెంట్‌ డాక్టర్‌ డి.ఆర్‌.కె.రాజు, ఫిజిక్స్‌ విభాగ అధిపతి డాక్టర్‌ డి.బి.ఆర్‌.కె.మూర్తి, కళాశాల భౌతిక శాస్త్ర అధ్యాపకులు, పరిశోధన విద్యార్థులు, పీజీ, డిగ్రీ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు