పితానికి ఝలక్

16 Mar, 2014 02:19 IST|Sakshi
ఆచంట, న్యూస్‌లైన్ : ఆచంట నియోజకవర్గంలో తాను చెప్పిందే వేదం.. చేసిందే నిర్ణయం అన్నట్టుగా వ్యవహరించిన తాజా మాజీ మంత్రి పితాని సత్యనారాయణకు నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు షాక్ ఇచ్చాయి. ఎన్నికల్లో  సమైక్యాంధ్ర పార్టీ తరఫున ఆచంట నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న పితాని సత్యనారాయణను చిత్తుగా ఓడించాలని కాంగ్రెస్ నాయ కులు, కార్యకర్తలు తీర్మానించారు. శనివారం ఆచంటలోని రామేశ్వరస్వామి సత్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయ కులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ చెల్లెం ఆనంద్‌ప్రకాష్ మాట్లాడుతూ సమైక్యాంధ్ర అభ్యర్థుల ఓటమే ధ్యేయంగా తామంతా పనిచేస్తామని ప్రకటించారు. కష్టపడి పనిచేసిన నాయకులను, ద్వితీయ శ్రేణి నాయకులను పితాని సత్యనారాయణ అణగదొక్కారని, వలసదారులను ప్రోత్సహించారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో పితానికి తగిన గుణపాఠం చెప్పడానికి అంతా సంసిద్ధంగా ఉన్నారన్నారు.  
 
 డీసీసీ కార్యదర్శి కానుమిల్లి జోగిరాజు మాట్లాడుతూ ఆచంటలో ప్రధాన సమస్యలైన డ్రెయినేజీ, రహదారుల విస్తరణ, 30 పడకల ఆసుపత్రి వంటి అతి ముఖ్య మైన పనులను పూర్తి చేయడంలో పితాని విఫలమయ్యారని ధ్వజమె త్తారు. ఏఎంసీ ఉపాధ్యక్షుడు చేకూరి సూరిబాబు మాట్లాడుతూ ఆచంట నియోజకవర్గానికి ఎంపీ కోటాలో 2 వేల గ్యాస్ కనెక్షన్‌లు మంజూరైతే వాటిని పేదలకు అందకుండా  పితాని అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆచంట అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్‌ను చెల్లెం ఆనందప్రకాష్‌కు ఇవ్వాలని కోరుతూ సమావేశం తీర్మానించింది. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు కానుమిల్లి మోహన్‌రావు, నెక్కంటి సతీష్, పోడూరి సాయిబాబా, డీటీడీసీ బాబు, కానుమిల్లి జోగిరాజు, పెదపాటి పెద్దిరాజు, పిల్లి వీరన్న తదితరులు మాట్లాడారు.
 
మరిన్ని వార్తలు