అంత చదువు చదివి..

10 Jan, 2019 09:11 IST|Sakshi
ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో భోజన శాల వద్ద వివరాలు సేకరిస్తున్న అధికారులు

పర్యాటకుల సేవలో పోలవరం ప్రాజెక్టు ఇంజినీర్లు

అసలు విధులకు దూరమై 8 నెలలు

ప్రభుత్వ తీరుపై సర్వత్రా విమర్శలు

పేరుకు పోలవరం ప్రాజెక్టులో ఏఈఈలు, టెక్నికల్‌ ఉద్యోగులు. వీరిలో ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది కూడా ఉన్నారు. వీరంతా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వాములై వేగంగా పూర్తి చేసేందుకు విధులు నిర్వహించాల్సి ఉంది. అయితే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం తమ ప్రచారానికి వీరిని వినియోగిస్తుంది. ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన వారికి భోజనాలు వడ్డించడం తదితర విధులకు వీరిని పరిమితం చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే టీడీపీ ప్రచారకర్తలుగా వీరిని వాడుకుంటున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో నోరు మెదపలేని పరిస్థితి. వ్యతిరేకిస్తే తమ ఉద్యోగ భద్రతకు ఎక్కడ ముప్పు వాటిల్లుతుందోనని వారంతా భయపడుతున్నారు.

పోలవరం రూరల్‌ :పోలవరం ప్రాజెక్టు సందర్శకుల పేరుతో బస్సుల్లో ప్రభుత్వం ప్రజలను తరలిస్తోంది. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు నిత్యం రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి నిత్యం 100 బస్సుల్లో 5 వేల నుంచి 6 వేల మంది ప్రజలు పోలవరం సందర్శనకు వస్తున్నారు. వీరు రాగానే భోజన శాల వద్ద ఏఈఈలు ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది వారి వివరాలు సేకరిస్తారు. ఏ జిల్లా, ఏ మండలం నుంచి ఎంత మంది వచ్చారు. బస్సు నెంబర్‌తో సహా, ఫోన్‌ నెంబర్లు సేకరిస్తారు. ఈ వివరాలు ప్రకారం వచ్చిన వారికి టిఫిన్‌ రూ.75, భోజనం రూ.125 చొప్పున బిల్లు చేస్తారు. భోజన శాల వద్ద కొంతమంది సిబ్బంది వీరికి ఏర్పాట్లు చేస్తారు. స్పిల్‌వే, వ్యూ పాయింట్, ప్రాజెక్టు నమూనా ప్రదేశాల్లో ఒక్కొక్క చోట నలుగురు ఏఈఈలు వంతున 16 మంది విధులు నిర్వహిస్తారు.

దర్శకులు అక్కడికి చేరుకోగానే ప్రాజెక్టు పనులు జరుగుతున్న వివరాలను తెలియజేస్తారు. ప్రాజెక్టులో వీరే చేసే అసలు విధులకు వెళ్లి 8 నెలలు కావస్తోంది. సుమారు 30 మంది ఏఈఈలు, 30 మంది ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది అసలు విధులకు దూరమవుతున్నారు. డివిజన్‌–2 టన్నెల్స్, డివిజన్‌–4 గేట్లు తయారీ, డివిజన్‌–8 ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అమలులో పనిచేసే సిబ్బంది పర్యాటకుల సేవ చేస్తున్నారు. ఇలా ప్రభుత్వం ప్రాజెక్టు పూర్తి కాకుండానే ప్రాజెక్టు సందర్శన అంటూ ఆర్భాటం చేస్తోంది. గత ఏడాది ఏప్రిల్‌ 24 నుంచి ప్రారంభమైన ఈ సందర్శన కార్యక్రమంలో సుమారు ఇప్పటి వరకు 4 లక్షల మంది వచ్చారంటూ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటోంది. ఈ పేరిట ప్రజాథనం వృథా చేయడమే కాకుండా పోలవరం ప్రాజెక్టులో పాలు పంచుకోవాల్సిన ఏఈఈలు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని టూరిస్టు గైడ్‌లుగా మార్చి అవమాన పరుస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి.

బాధాకరం
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో గిన్నిస్‌ రికార్డు వచ్చిదంటూ సంబరాలు చేస్తున్నారు. రెండో పక్క ప్రాజెక్టు నిర్మాణంలో కీలకపాత్ర వహించే ఇంజినీర్లను సందర్శకుల సేవకు పరిమితం చేయడం బాధాకరం. నిర్మాణంలో చురుకుగా ఉండాల్సిన ఇంజినీర్ల పనులకు ఆటంకం కలిగించడం సరైంది కాదు.  –ఎ.రవి, సీపీఎం జిల్లా కార్యవర్గ భ్యులు

సమంజసం కాదు
యువ ఇంజినీర్లను పనిలో ఉత్సాహ పరచవలసింది పోయి, వారిని సందర్శకుల సేవలకు ఉపయోగించడం సమంజసం కాదు. ఇంజినీర్లను, సిబ్బందిని వివిధ పనులకు వినియోగిస్తూ వారిని అసలు పనులకు దూరం చేస్తున్నారు.  – దత్తి రాంబాబు, పోలవరం

మరిన్ని వార్తలు