కోట్లు దండుకునేందుకే ‘పోలవరం’ ప్రాజెక్ట్‌

3 Feb, 2018 11:23 IST|Sakshi

నెల్లూరు(వీఆర్సీ సెంటర్‌): పోలవరం ప్రాజెక్ట్‌ పేరుతో నాయకులు కోట్లాది రూపాయలను దండుకుంటున్నారని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్‌ ఆరోపించారు. ఇందిరాభవన్‌లో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేసిన సొంటి రామ్మూర్తి అనే ఐఏఎస్‌ అధికారి రూ.200 కోట్లతో ప్రాజెక్ట్‌ పూర్తవుతుందని ప్రణాళికను రూపొందించగా, అది రూ.10 వేల కోట్లకు, ప్రస్తుతం రూ.56 వేల కోట్లకు పెరిగిపోయిందని విమర్శించారు. ఇప్పటి వరకు ప్రాజెక్ట్‌కు రూ.ఆరు వేల కోట్లు కూడా ఖర్చు కాలేదన్నారు.

 చంద్రబాబు విదేశాలకు వెళ్లి ముడుపులు తీసుకుంటున్నారని, అవినీతితో రాష్ట్రం భ్రష్టు పట్టిపోయిందని మండిపడ్డారు. దావోస్‌ పర్యటనలో చంద్రబాబుకు ప్రధాని అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదని విమర్శించారు. అంకెల గారడీ తప్ప కేంద్ర బడ్జెట్‌లో ఏమీ లేదని, అంధ్రప్రదేశ్‌కు మొండిచేయి చూపారని విమర్శించారు. రైతులకు బడ్జెట్‌లో పెద్దపీట వేశామని బీజేపీ నాయకులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, రైతులకు అప్పులివ్వడం.. తిరిగి వసూలు చేయడం గొప్ప విషయమేమీ కాదన్నారు.  ఆత్మ గౌరవం పేరుతో ఎన్టీఆర్‌ స్థాపించిన టీడీపీ పరువు మంటగలిసిందన్నారు. చంద్రబాబు రూ.లక్ష కోట్లను రాష్ట్రానికి తీసుకొచ్చారంటున్నారని,

 వాటి వివరాలను బహిరంగపర్చాలని డిమాండ్‌ చేశారు. దుగరాజపట్నం పోర్టు కోసం గత యూపీఏ ప్రభుత్వ హయాంలో 100 మంది సంతకాలు చేసి మంజూరు చేయిస్తే, రాష్ట్ర ప్రభుత్వం పదెకరాలనూ ఇవ్వక ఆగిపోయిందన్నారు. నాయకులు భవానీ నాగేంద్రప్రసాద్, చంద్రశేఖర్, వెంకటయ్య, రామచంద్రయ్య, పరిమల వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. కాగా చింతామోహన్‌కు పోటీగా జిల్లా బీసీ సెల్‌ అధ్యక్షుడు గాలాజు శివాచారి మరో ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు