కక్ష సాధింపు!

31 Aug, 2018 12:34 IST|Sakshi
రైతును చుట్టుముట్టి అరెస్టు చేస్తున్న పోలీసులు

రాజధాని గ్రామమైన ఉండవల్లి రైతులపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు తెగబడుతోంది. పూలింగ్‌ ప్రక్రియను మొదటి నుంచి ఈ గ్రామానికి చెందిన రైతులు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ప్రభుత్వం మాత్రం పట్టించుకోకుండా ఏకపక్ష ధోరణితో ముందుకు వెళ్లింది. ప్రభుత్వ నిరంకుశత్వంపై రైతులంతా కలిసి ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఉండవల్లిలో భూములను సేకరించవద్దని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆర్డర్‌ను సైతం పక్కన పెట్టిన ప్రభుత్వం.. తన ఆగడాలను రెట్టింపు చేసింది. రైతుల అనుమతి లేకుండానే గ్రామ పొలాల్లో నుంచి విద్యుత్‌ తీగలు లాగిస్తోంది.

సాక్షి, అమరావతిబ్యూరో : ఉండవల్లి గ్రామంలోని రైతుల పొలాల్లో నుంచి హైటెన్షన్‌ విద్యుత్‌ తీగలు లాగేందుకు గురువారం అధికారులు సిద్ధమయ్యారు. తమ అనుమతి లేకుండానే తీగలు ఎలా లాగుతారని ప్రశ్నించిన రైతులపై ప్రభుత్వం అణచివేత చర్యలకు పాల్పడింది. తీగలు లాగడాన్ని అడ్డుకున్న రైతులను పోలీసులు ఈడ్చిపారేసి మంగళగిరి పోలీసుస్టేషన్‌కు తరలించారు. అమరావతికి కొండవీటి వాగు నుంచి ముంపు బెడద తప్పించడానికి ప్రకాశం బ్యారేజి సీతానగరం వద్ద రూ.237 కోట్లతో ఎత్తిపోతల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 16 మోటార్లను ఏర్పాటు చేసి వరద సమయంలో కొండవీటి వాగు నీటిని కృష్ణా నదిలోకి ఎత్తిపోయనున్నారు. ఇందుకోసం అవసరమైన సబ్‌స్టేషన్‌ను కొండవీటివాగు హెడ్‌ స్లూయిస్‌ వద్ద ప్రభుత్వం చేపట్టింది. దీనికి మంగళగిరి మండలం నులకపేట 130 కేవీ సబ్‌స్టేషన్‌ నుంచి గుంటూరు చానల్‌ మీదుగా హైటెన్షన్‌ విద్యుత్‌ తీగలు లాగుతున్నారు. వాగు వద్దకు వచ్చే సరికి తీగలు రైతుల పొలాల్లో నుంచి వెలుతున్నాయి. సుమారు 9 ఎకరాల్లో నుంచి తీగలను వేశారు. రైతులు ఎదురుతిరిగినా పోలీసుల సాయంతో వారిని అరెస్ట్‌ చేయించి మరీ తీగలు లాగారు.

విడతల వారీగా రైతులు కాపలా....
నెలన్నర రోజుల కిందట ప్రభుత్వం ఇలాగే నియంతృత్వంగా వ్యవహరించడంతో రైతులంతా కలిసి ఎదురుతిరగడంతో అప్పట్లో అధికారులు వెనుతిరిగారు. అప్పటి నుంచి రైతులు విడతల వారీగా రేయింబవళ్లు తమ పొలాల్లో కాపలా ఉంటూ వచ్చారు. ఎప్పుడు ఎవరూ వచ్చి తీగలు లాగుతారోనని భయం భయంగా గడిపారు. గురువారం ఉదయం అధికారులు చడీచప్పుడుకాకుండా వచ్చి పోలీసుల సాయంతో రైతులను అరెస్ట్‌ చేయించి తమ పనికానిచ్చేశారు.

కోట్లలో నష్టపోనున్న బాధిత రైతులు...
ఉండవల్లి రైతులు మొదటి నుంచి ల్యాండ్‌ పూలింగ్‌ ప్రక్రియను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. మూడు పంటలు పండే భూములను వదులుకునేది లేదని తేల్చి చెబుతూ వచ్చారు. ప్రభుత్వ నియంతృత్వ విధానాలను అడ్డుకుని, వాటిని కోర్టులో సవాల్‌ చేస్తూ వచ్చారు. ప్రస్తుతం తీగలు లాగిన పొలాలు మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం రెసిడెన్షియల్‌ ప్రాంతంలో ఉన్నాయి. ఈ ప్రాంతం గుండా తీగలు లాగడం వల్ల భూముల ధరలు భారీగా పడిపోవడంతో పాటు వీటిని కొనేందుకు ఎవరూ ముందుకురారని బాధిత రైతులు వాపోతున్నారు. భవిష్యత్తులో ఈ భూమిని డెవలప్‌ చేసుకోవాలన్నా, భవంతులు కట్టుకోవాలన్నా హై టెన్షన్‌ వైర్లు ఉండడం వల్ల నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వదని... ఇక జీవితాంతం ఈ భూమిని వదిలేసుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఎకరా భూమి రూ.10 కోట్ల మేర పలుకుతోందని రైతులు చెబుతున్నారు.

సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు విషయంలోనూఎదురు దెబ్బ
కనకదుర్గా వారధి నుంచి తుళ్లూరు మండలంలోని బోరుపాలెం వరకు 21 కిలోమీటర్ల నిర్మించనున్న సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుకు ఉండవల్లి రైతులు తమ భూములను ఇవ్వలేదు. దీంతో ప్రభుత్వం ఆ భూములను సేకరించాలని నిర్ణయించి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భూ సేకరణ కోసం ప్రభుత్వం నిబంధనలు ఉల్లఘిస్తోందని, తప్పులతడకగా సర్వే చేసిందని సాక్ష్యాధారాలతో సహా రైతులంతా హైకోర్టును ఆశ్రయించడంతో రోడ్డు కోసం సేకరించాలనుకున్న 153 ఎకరాలపై తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించింది.

మరిన్ని వార్తలు