కానుక.. కినుక..

24 Dec, 2018 09:12 IST|Sakshi
వేములూరులో చంద్రన్న కానుక అందజేస్తున్న దృశ్యం

చంద్రన్న కానుకలకు పోర్టబులిటీ రద్దు

అయోమయంలో లబ్ధిదారులు సాధారణ సరుకులకు వర్తింపు

పశ్చిమగోదావరి  , కొవ్వూరు రూరల్‌: పోర్టబులిటీ ద్వారా రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్‌ సరుకులు పొందే అవకాశం కల్పించిన ప్రభుత్వం, ఈ పద్ధతిని చంద్రన్న కానుకలకు మాత్రం రద్దు చేసింది. దీంతో లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తాజాగా ఏ రేషన్‌ షాపు పరిధిలో ఉన్న కార్డుదారులు అక్కడే చంద్రన్న కానుకలు పొందాలని పేర్కొనడంతో చాలా మంది లబ్దిదారులు అయోమయంలో పడ్డారు. ఇదేమి అన్యాయం అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే షాపుల పరిధిలో ఈ పాస్‌ యంత్రంలో పోర్టబులిటీ సౌకర్యాన్ని తొలగించడంతో షాపుల నిర్వాహకులు సైతం ఏమీ చేయలేమని చేతులెత్తేడంతో సొంత గ్రామాల్లో కానుక సరుకులు తీసుకోవడానికి కొంతమంది పయనమవుతున్నారు. ఉపాధి, ఉద్యోగం, ఇతర పరిస్థితుల దృష్ట్యా మండలం, పట్టణ పరిధి నుంచి వలస వెళ్లి రేషన్‌ లబ్ధిదారులు పోర్టబులిటీ సౌకర్యాన్ని వినయోగించుకుని రేషన్‌ సరుకులు, కానుక సరుకులు పొందేవారు. జిల్లాలో 2020 రేషన్‌ షాపుల పరిధిలో 12,39,721 రేషన్‌ కార్డులకు గాను 3,06,853 మంది పోర్టబులిటీ ద్వారా సరుకులు పొందినట్టు ఆన్‌లైన్‌లో నమోదై ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చంద్రన్న కానుక సరకులకు పోర్టబులిటీ నిలిపివేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటివరకూ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 16,44,002 కార్డులకు చంద్రన్న కానుకలు ఇవ్వగా, జిల్లాలో 1,77, 205 కార్డులకు పంపిణీ చేసి ఆదివారం రాత్రికి సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 11.46 శాతం, జిల్లాలో 14.26 శాతం పంపిణీ చేసినట్టు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి.

కొత్త షాపుల నేపథ్యంలో ఇబ్బందులు
జిల్లావ్యాప్తంగా ఇటీవల కొత్త షాపులు ఇవ్వడంతో ఇబ్బందులు మరీ ఎక్కువయ్యాయని లబ్ధిదారులు చెబుతున్నారు. ఒకే గ్రామంలో రెండు మూడు షాపులు ఉన్నా ఆ ఇబ్బందులు తప్పడం లేదు. పోర్టబులిటీ అవకాశం ఉంటే దగ్గరలో ఉన్న షాపుల్లో సరుకులు పొందేవారు. అయితే ఇప్పుడు పోర్టబులిటీ లేకపోవడంతో, ఏ షాపు పరిధిలో తన కార్డు ఉంటుందో అక్కడికి వెళ్లి కార్డుదారుడు రేషన్‌ సరుకులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల అనుమతులు ఇచ్చిన కొత్త షాపులకు పాత షాపుల నుంచి బైపరిగేషన్‌ చేసి కార్డులు బదిలీ చేయడంతో కార్డు ఎక్కడ ఉందో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడింది. పోర్టబులిటీ లేకపోవడంతో డీలర్లతో పాటు, కార్డుదారులు అవస్థలు పడుతున్నారు. అయితే ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా డీలర్ల డిమాండ్ల సాధన కోసం సమ్మె చేసిన నేపథ్యంలో, జనంలో డీలర్లను చులకన చేయడానికే ఈ విధమైన చర్యలకు ప్రభుత్వం ఆదేశాలతో అధికారులు చేపట్టినట్టు పలువురు డీలర్లు ఆరోపిస్తున్నారు. ఈ చర్యల వల్ల పోర్టబులిటీ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్న రాష్ట్రవ్యాప్తంగా 12,39,721, జిల్లాలో 3,06,853 మందిని చంద్రన్న కానుకలకు దూరం చేయాలని ప్రభుత్వ పన్నాగమని పేదలు ఆరోపిస్తున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా