వామ్మో... ఇంత బిల్లా..!

19 Feb, 2019 10:54 IST|Sakshi
పాత మీటర్‌లో రూ.372 విద్యుత్‌ బిల్లు వచ్చిన స్లిప్‌ మార్చిన కొత్త మీటరులో ఏకంగా రూ.4763 చెల్లించాలంటు వచ్చిన బిల్లు

కమ్మలపాకకు నెలవారీ విద్యుత్‌ బిల్లు రూ.4763  

లబోదిబోమంటున్న వినియోగదారుడు

విజయనగరం, శృంగవరపుకోట రూరల్‌: మండలంలోని చామలాపల్లి గ్రామానికి చెందిన బి. సన్యాసి కమ్మలపాకలో నివశిస్తున్నాడు. ఇతనికి ఈ నెల విద్యుత్‌ బిల్లు 4763 రూపాయలుగా వచ్చింది. దీంతో ఇంత బిల్లు వచ్చిందేమిటని బాధితుడు లబోదిబోమంటున్నాడు. చివరకు బిల్లు పట్టుకుని ఎస్‌.కోటలోని ఏపీఈపీడీసీఎల్‌ అధికారులను ఆశ్రయిస్తే..ముందు బిల్లు కట్టమని ఉచిత సలహా పారేశారు. ఇదే విషయమై బాధితుడు సన్యాసి, మాజీ సర్పంచ్‌ అప్పల నరసింహశర్మ సోమవారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ, విద్యుత్‌ సర్వీస్‌ నంబర్‌ 119కి ప్రతి నెలా రూ.60 లేదా 70 రూపాయల బిల్లు వచ్చేదన్నారు. ఇటీవల ఒక్కసారి రూ. 372 బిల్లు వచ్చిందని చెప్పారు. ఈ విషయాన్ని విద్యుత్‌ శాఖ సిబ్బందికి తెలియజేస్తే వారి సూచనల మేరకు బిల్లు చెల్లించానని.. అనంతరం వారు వచ్చి ఆ మీటర్‌ తొలగించి అదే నంబర్‌పై కొత్త మీటర్‌ బిగించారని తెలిపారు. అయితే ఒక ఫ్యాన్, రెండు లైట్లు, ఒక టీవీ ఉన్న ఇంటికి ఈ నెల ఏకంగా  4763 రూపాయల బిల్లు వచ్చిందని వాపోయారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నాడు.

 ఏఈ ఏమన్నారంటే..
 విద్యుత్‌శాఖ కార్యాలయానికి వచ్చి గతంలో మాదిరే మినిమం బిల్లు రూ.70 చెల్లించాలి. ప్రస్తుతం అధికంగా బిల్లు వచ్చిన కొత్త మీటర్‌ను పరీక్షించిన అనంతరం మీటర్‌లో లోపం ఉన్నట్లైతే మరో కొత్త విద్యుత్‌ మీటర్‌ను ఏర్పాటు చేస్తాం. మీటరులో తలెత్తే జంపింగ్‌ లోపం వల్ల అప్పుడప్పుడు ఇలా జరిగే అవకాశం ఉంది. వినియోగదారుడు ఆందోళన చెందాల్సిన పనిలేదు. తప్పును సరిచేసి వినియోగించిన విద్యుత్‌కు సరిపడా నెలవారీ బిల్లు వచ్చేలా చూస్తాం. ..సీహెచ్‌ దేముడు, ఏఈ, శృంగవరపుకోట

మరిన్ని వార్తలు