విద్యుత్‌ రంగంలో ‘కొత్త’ వెలుగులు

1 Jan, 2020 04:47 IST|Sakshi

‘సాక్షి’తో ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లి  

వినియోగదారులు మెచ్చేలా, వారికి నచ్చేలా సేవలందిస్తాం  

చౌక విద్యుత్‌ కొనుగోలుకే అధిక ప్రాధాన్యం  

2020 మార్చి నాటికి వంద శాతం ఫీడర్లలో నాణ్యమైన విద్యుత్‌

సాక్షి, అమరావతి:  ప్రభుత్వ ఆశయాల సాధనలో భాగంగా 2020 సంవత్సరంలో విద్యుత్‌ రంగంలో సరికొత్త వెలుగులు నింపుతామని ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులపల్లి చెప్పారు. ప్రజలు మెచ్చేలా, వారికి నచ్చేలా సేవలందిస్తామని అన్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని శ్రీకాంత్‌ ‘సాక్షి’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. వచ్చే ఏడాది లక్ష్యాలను పంచుకున్నారు.  

కరెంటు సరఫరాలో అంతరాయాలకు చెక్‌ 
‘‘వినియోగదారులపై చార్జీల భారం మోపకూడదన్నదే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పం. దీన్ని దృష్టిలో ఉంచుకుని విద్యుత్‌ పంపిణీ సంస్థలు(డిస్కంలు) అత్యంత చౌకగా లభించే విద్యుత్‌ కొనుగోలుకే ప్రాధాన్యం ఇస్తాయి. ఈ దిశగా రూపొందించిన ప్రణాళికలు 2020లో మంచి ఫలితాలివ్వబోతున్నాయి. మార్కెట్‌లో చౌకగా లభించే విద్యుత్‌ తీసుకుంటూనే, థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు పెంచుతున్నాం. బహిరంగ మార్కెట్‌లో విద్యుత్‌ ధర పెరిగితే, థర్మల్‌ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాం. తద్వారా డిస్కంలపై ఆర్థిక భారం పడే ప్రసక్తే ఉండదు. విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలకు సాధ్యమైనంత వరకూ చెక్‌ పెట్టాలని నిర్ణయించాం. ఈ మేరకు క్షేత్రస్థాయిలో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేశాం. ఇది 2020లో ఫలితాలు ఇవ్వనుంది.

గ్రామస్థాయి నుంచి గ్రీవెన్స్‌ సెల్స్‌ పటిష్టం 
పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్‌ పథకాన్ని మరింత బలోపేతం చేస్తున్నాం. 2020 మార్చి నాటికి వంద శాతం ఫీడర్లలో నాణ్యమైన విద్యుత్‌ అందిస్తాం. వ్యవసాయ అవసరాల కోసమే 10,000 మెగావాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. 2020లో ఇది కార్యరూపం దాల్చే వీలుంది. విద్యుత్‌ శాఖలో అవినీతిని అరికడతాం. అవినీతికి దూరంగా ఉండాలని ఇప్పటికే క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాం. 2020 జనవరి నుంచే గ్రామస్థాయి నుంచి గ్రీవెన్స్‌ సెల్స్‌ను పటిష్టం చేస్తాం. ప్రతి ఫిర్యాదును నిశితంగా పరిశీలిస్తాం. అవినీతికి పాల్పడిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటాం. విద్యుత్‌ రంగాన్ని పూర్తిగా ప్రజల చెంతకు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందులో భాగంగా ఉన్నతాధికారులు సైతం ప్రజల్లోకి వెళ్లి, వారి సమస్యలు తెలుసుకుంటారు. ప్రజలకు సేవలందించేందుకే విద్యుత్‌ సిబ్బంది సర్వసన్నద్ధంగా ఉన్నారనే విషయాన్ని 2020లో కార్యాచరణ ద్వారా నిరూపిస్తాం’’ అని శ్రీకాంత్‌ నాగులపల్లి పేర్కొన్నారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా