పొగచూరిన బతుకులు!

22 Jan, 2018 16:40 IST|Sakshi
బీడీలు చుడుతున్న మహిళలు

బీడీ కార్మికులు  రోజంతా కష్టపడినా గిట్టని కూలి 

ఆర్థిక ఇబ్బందులతో సతమతం 

ఆదుకోని ప్రభుత్వం 

నంద్యాలటౌన్‌: బీడీ కార్మికుల బతుకులు రోజురోజుకు దీన స్థితికి చేరుకుంటున్నాయి. నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునే వరకు కుటుంబమంతా కష్టపడి బీడీలు చుట్టినా తగినంత కూలి రావడం లేదు. దీంతో కటుంబపోషణ, పిల్లల చదువులు భారంగా మారుతున్నాయి. ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి సహాయం, సంక్షేమ పథకాలు అందకపోడవడంతో ఆర్థిక ఇబ్బందులతో తమతమవుతున్నారు. పట్టణంలో బీడీలు తయారు చేసే  మూడు కుటీర పరిశ్రమలు ఉన్నాయి. బీడీ తయారీకి కావాల్సిన ఆకు, పొగాకు, లేబుళ్లను, బస్తాల రూపంలో కార్మికులకు అందజేస్తారు. ఈ ముడిసరుకులను తీసుకొని కార్మికులు తమ ఇళ్ల వద్దనే  బీడీలు  తయారు చేస్తారు.  నంద్యాల పట్టణంలోని గాంధీచౌక్, శ్రీనివాససెంటర్, ఖలీల్‌థియేటర్, ముల్లాన్‌పేట, వీసీకాలనీ తదితర ప్రాంతాల్లోని దాదాపు 500 మంది బీడీలు చుట్టుతూ  జీవనం సాగిస్తున్నారు.  

కష్టానికి దక్కని ప్రతిఫలం... 
ఏజెన్సీలు కార్మికులకు వెయ్యి బీడీలు తయారు చేస్తే రూ.100 నుంచి రూ.150 వరకు కూలీ చెల్లిస్తున్నారు. దీంతో ఓ కుటుంబం మొత్తం రోజంతా కష్టపడినా రోజుకు వెయ్యి బీడీల కన్నా ఎక్కువ చుట్టలేమని కార్మికులు చెబుతున్నారు. దీంతో చాలీచాలని కూలిలతో కుటుంబాలను పోషించుకోలేకపోతున్నా మని వాపోతున్నారు.  పిల్లల చదువులు కూడా భారంగా మారడంతో మధ్యలోనే ఆపివేసి పనులకు పంపాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పట్టించుకోని పాలకులు
బీడీ కార్మికుల సంక్షేమాన్ని ప్రభుత్వం, నాయకులు ఎవరూ పట్టించుకోవడం లేదని ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. కార్మికులకు ఆరోగ్య పథకాలు, రుణాల మంజూ రు, పక్కా గృహాలు, తదితర పథకాలతో ఆదుకునే దిశగా ప్రభుత్వం కృషి చేయాలని కోరుతున్నారు. 

కూలీ గిట్టుబాటు కావడం లేదు
కుటుంబ పోషణ కోసం బీడీలు చుడుతున్నా. ఈ పని తప్ప వేరే పని తెలియదు. రోజుకు 500 నుంచి 700 వరకు బీడీలు చుడుతాను.  రోజుకు రూ.100 కూడా గిట్టడం లేదు.  కుటుంబ పోషణ భారంగా మారుతుంది.  
నూర్జహాన్, నంద్యాల

ప్రభుత్వం ఆదుకోవాలి
బీడీ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవడం లేదు. ప్రభుత్వం ఎలాంటి రుణాలు, సంక్షేమ పథకాలు అందజేయడం లేదు. ఇతర వృత్తుల కార్మికులకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వం బీడీ కార్మికుల పట్ల   నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.
– ఫాతిమాబీ, కార్మికురాలు, నంద్యాల 

 

మరిన్ని వార్తలు