డీఈఓ జగదీష్‌కు పోలీసు రక్షణ

20 Feb, 2014 01:02 IST|Sakshi


 
 మిర్యాలగూడ,
 జిల్లా విద్యాశాఖాధికారి ఆచార్య ఎన్.జగదీష్‌కు పోలీసు రక్షణ ఏర్పాటు చేయనున్నారు. వివిధ కారణాల రీత్యా తనకు కొందరి వల్ల ముప్పు ఉందని, రక్షణ కల్పించాలని డీఈఓ పోలీసుశాఖకు లేఖ రాశారని సమాచారం.
 
 వాస్తవ పరిస్థితులపై వివరాలు సేకరించిన పోలీసు శాఖ ఆయనకు గన్‌మెన్ల రక్షణ ఇవ్వడానికి అంగీకరించింది. డీఈఓ జగదీష్ జిల్లాలో పలువురు ఉపాధ్యాయులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సిఫారసు చేశారు. ఆయన  జిల్లాలో బాధ్యతలు చేపట్టాక విద్యాశాఖలో పాత రికార్డులను తిరగేస్తూ ఉపాధ్యాయులపై చర్యలు తీసుకున్నారు.
  తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో మెడికల్ బిల్లులు కాజేశారని 121 మంది ఉపాధ్యాయులపై క్రిమినల్ కేసులకు ఫిర్యాదు చేశారు. 63 మంది ఉపాధ్యాయులు తప్పుడు పత్రాలతో ఉద్యోగాలు పొందారని, 33 మంది ఉపాధ్యాయులు నకిలీ క్యాస్ట్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారని, 8 మంది నకిలీ సర్టిఫికెట్లతో డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు సంపాదించారని, అక్రమాలకు పాల్పడ్డారని ముగ్గురు డీఈఓ కార్యాలయ ఉద్యోగులపై, మొత్తంగా 300 మందికిపైగా క్రిమినల్ కేసులు పెట్టించారు. డీఈఓ కార్యాలయంలో ఫైళ్లు దగ్ధం కావడం కూడా ఓ పెద్ద వివాదంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో తనకు ఏమైనా హాని జరగవచ్చని భావించిన డీఈఓ పోలీసు శాఖ రక్షణ కోరినట్లు సమాచారం.
 
 గన్‌మెన్‌ను ఏర్పాటు చేస్తామన్నారు
 - జగదీష్, డీఈఓ, నల్లగొండ
 పోలీసు ప్రొటెక్షన్ ఇస్తామని, గన్‌మెన్ ఏర్పాటు చేస్తామని జిల్లా ఎస్పీ ప్రభాకర్‌రావు ధ్రువీకరించారని డీఈఓ జగదీష్ వివరించారు. 24 గంటల సెక్యూరిటీని ఏర్పాటు చేస్తామని ఎస్పీ చెప్పారని,  తాను కూడా అందుకు అంగీకరించానన్నారు. మరో పది రోజుల్లో గన్‌మెన్‌ను ఇచ్చే అవకాశం ఉందని తెలిపారు.
 

మరిన్ని వార్తలు