తిరుగుబావుటా..

15 Dec, 2014 02:00 IST|Sakshi
తిరుగుబావుటా..

 విజయనగరం క్రైం: కేంద్రమంత్రి, టీడీపీలో సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతిరాజు సమక్షంలో విజయనగరం మున్సిపల్ చైర్మన్‌పై కౌన్సిలర్లు, పార్టీ నాయకులు తిరుగుబావుటా ఎగురవేశారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు ఆధ్యక్షతన విజయనగరం మున్సిపాలిటీకి సంబంధించిన  సీనియర్‌నాయకులు,  కౌన్సిలర్లు, వార్డు  అధ్యక్షులతో  ఆదివారం  సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణను లక్ష్యంగాచేసుకుని కౌన్సిలర్లు, పార్టీ నాయకులు విమర్శలు గుప్పించారు. మున్సిపాలిటీ జరిగే ఓ ఒక్కకార్యక్రమాన్నీ చైర్మన్ తెలియపరచడంలేదని.. కనీసం సమాచారం లేకుండా పనులు చేస్తున్నారని కొందరు కౌన్సిలర్లు, పార్టీనాయకులు ఫిర్యాదు చేశారు. మున్సిపాలిటీలో కొన్ని పనులు సభ్యుల అనుమతిలేకుండా జరిపిస్తున్నారని, అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారిని వెనుకేసుకు వస్తున్నారని అశోక్‌దృష్టికి తీసుకు వెళ్లారు.
 
 పింఛన్ ఎంపికల్లో ఎక్కువగా అక్రమాలు జరిగాయని, అర్హులకు అన్యాయం జరిగిందని, ఈవిషయాన్ని చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని మరి కొందరు ఆవేదన వెళ్లగక్కారు. పింఛన్లలో  తప్పుడుగా నమోదు చేసిన డేటా ఎంట్రీ ఆపరేటర్ల విషయంలో చైర్మన్ ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని,ఎన్నిసార్లు  చెప్పినా పట్టించుకోవడం లేదని కౌన్సిలర్లు, పార్టీ నాయకులు ధ్వజమెత్తారు.  మున్సిపాలిటీలో ఎటువంటిఅభివృద్ధి పనులూ చేయకపోవడం వల్ల వార్డుల్లో తిరగలేక పోతున్నామని, కౌన్సి లర్ల ఇంటిపైకి ప్రజలు వస్తున్నారని      అశోక్‌దృష్టికి తీసుకువెళ్లారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలకు సమా చారం లేకుండా చేస్తున్నారని చెప్పారు. వార్డు అధ్యక్షులకు తెలియకుండా పట్టణంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అలాంటపుడు  అధ్యక్షులుగా ఎందుకు  నియమించారని అశోక్ దృష్టికి తీసుకువెళ్లారు.  
 
 సమస్యలన్నీ సావధానంగా విన్న కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు  పట్టణంలో జరిగే కార్యక్రమాలు కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, వార్డు అధ్యక్షులకు సమాచారం ఇవ్వాలని చైర్మన్‌కు చురకలు అంటించినట్లు సమాచారం. ఇకముందు జరిగే ప్రతి కార్యక్రమాన్ని  పట్టణ పార్టీ అధ్యక్షుడు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులకు తెలిపి..వారందరితో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని చైర్మన్‌కు అశోక్ సూచించినట్లు తెలుస్తోంది. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ శోభాస్వాతిరాణి, విజయనగరం ఎమ్మెల్యే మీసాల గీత, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ .రాజు, తెలుగుయువత జిల్లా అధ్యక్షుడు కర్రోతు వెంకటనరసింగరావు, పట్టణ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ ,పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మ న్యాల కృష్ణ,  కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, వార్డు అధ్యక్షులు పాల్గొన్నారు.
 
 ఒకరిపై మరొకరు  విమర్శలు చేసుకున్న వారికిఅశోక్‌క్లాస్..?
 అశోక్‌బంగ్లాలో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్న వారికి  కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు  ప్రత్యేక క్లాసు ఇవ్వనున్నట్లు  పార్టీ వర్గాల సమాచారం. సమావేశంలో అందరిమధ్య క్లాసు ఇస్తే బాగోదన్న ఉద్దేశంతో వారికి అశోక్ ప్రత్యేక క్లాస్ ఇవ్వనున్నట్లు సమాచారం.
 

>
మరిన్ని వార్తలు