తెలుగు తమ్ముళ్ల ‘నామినేషన్’ జపం

27 Mar, 2016 01:27 IST|Sakshi
తెలుగు తమ్ముళ్ల ‘నామినేషన్’ జపం

పుష్కర పనులు దక్కించుకునేందుకు అధికారులపై ఒత్తిడి
టెండ ర్ల ప్రక్రియ వద్దంటూ నిర్మాణ సంస్థలకు మొండిచేయి
నాణ్యత కల్ల.. అభివృద్ధి డొల్ల అని హెచ్చరిస్తున్న నిపుణులు

 
సాక్షి ప్రతినిధి, గుంటూరు : కృష్ణా పుష్కరాల నేపథ్యంలో టీడీపీ నేతలు నామినేషన్ మంత్రం పఠిస్తున్నారు. పుష్కర పనులను ఈ విధానంలోనే కేటాయించాలని అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఈ పనులకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించడమే అందుకు కారణం. ఇప్పటికే వివిధ శాఖలు  రూ.500 కోట్లకుపైగా ప్రతిపాదనలు అందజేశాయి.ఈ నిధులతో రేవుల (ఘాట్లు) మరమ్మతులు, దేవాలయాల జీర్ణోద్ధరణ, రహదారుల విస్తరణ వంటి ఎన్నో పనులు చేపట్టాల్సిఉంది. అధికారులు ప్రస్తుతం వాటికి టెండర్లు ఆహ్వానించే పనిలో నిమగ్నమయ్యారు. అయితే..
 
కొన్ని పనులకు టెండర్లు ఆహ్వానించకుండా నామినేషన్లపైనే అప్పగించాలని టీడీపీ నేతలు అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పైగా వారైతే నాణ్యతా ప్రమాణాలతో సకాలంలో పనులు పూర్తి చేస్తారని, బయటి నిర్మాణ సంస్థలు అలా చేయలేవని చెప్పడం గమనార్హం.

 ఒకే పని.. ‘రెండు, మూడు’గా విభజించి కట్టబెట్టే యత్నం..
 ప్రభుత్వ నిబంధనల ప్రకారం అధికారులకు రూ.10 లక్షల విలువైన పనులను మాత్రమే నామినేషన్ల పద్ధతిపై కేటాయించే అవకాశం ఉంది. అంతకుమించితే ఆ పనులకు టెండ ర్లను ఆహ్వానించాల్సిందే. టీడీపీ నాయకుల ఒత్తిడికి తట్టుకోలేక కొందరు అధికారులు రూ.10 లక్షల కంటే విలువైన పనులనూ రెండు లేదా మూడు పనులుగా విభజించి వాటిని నామినేషన్‌పై కేటాయించాలని యత్నిస్తుట్లు సమాచారం. దీంతో కంట్రాక్టర్లకు మొండిచేయి చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాపకింద నీరులా సాగుతున్న ఈ విధానంతో అనుభవం ఉన్న నిర్మాణ సంస్థలకు పనులు లభించకపోవడమే కాక ఎలాంటి అనుభవం లేని సాధారణ నాయకులకు బాధ్యతలు అప్పగించినట్లవుతుందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

కొత్త నిర్మాణాలపై ఆశలు..
పుష్కర ఘాట్ల మరమ్మతులు, కొత్త ఘాట్ల నిర్మాణాలను సాగునీటిశాఖ ఎక్కువగా చేపట్టనున్నది. ఈ శాఖలో ఎప్పటి నుంచో పనులు చేస్తున్న నిర్మాణ సంస్థలు 50 వరకు ఉన్నాయి. ఈ సంస్థల ప్రతినిధులంతా పుష్కర పనులపైనే ఆశలు పెంచుకున్నారు. మిగిలిన పనుల కంటే పుష్కర పనులను వేగంగా పూర్తిచేయడమే కాకుండా బిల్లుల చెల్లింపు కూడా అంతే వేగంగా జరిగే అవకాశం ఉండటంతో వారంతా వీటి కోసం ఎదురు చూస్తున్నారు. దాదాపు రూ.50 కోట్లకుపైగానే పుష్కర ఘాట్ల మరమ్మతులు, కొత్త నిర్మాణాలు జరిగే అవకాశం ఉందని, అందులో కొన్నింటిని టెండరు విధానంలో దక్కించుకోవచ్చనే ఆశతో ఉన్నారు. రోడ్లు భవనాలశాఖలో రూ.40 కోట్లతో రహదారుల విస్తరణ, మరమ్మతులు చేపట్టనున్నారు. జిల్లా కలెక్టర్‌తో సంప్రదించిన తరువాతనే టెండర్లపై నిర్ణయం తీసుకుంటామని ఆశాఖ అధికారులు చెబుతున్నారు.

 అధికారుల పరిస్థితి.. అడకత్తెరలో పోకచెక్క..
 పుష్కరాల నేపథ్యంలో గుంటూరు నగరంలో రహదారుల విస్తరణ, రోడ్ల మార్జిన్లలోని ఆక్రమణల తొలగింపు, అలంకరణ, పచ్చదనం వంటి పనులను నగరపాలక సంస్థ చేపట్టనుంది. ఈ మేరకు కమిషనర్, ఇతర అధికారులు విస్తరణ చేపట్టాల్సిన రహదారులను గుర్తించి టెండర్లు ఆహ్వానించే పనిలో ఉన్నారు. రోడ్ల మార్జిన్ల ఆక్రమణల తొలగింపులో ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో కొందరు అధికారులకు దిక్కుతోచడం లేదు.

ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల మధ్య సిబ్బంది, అధికారులు అడకత్తెరలో పోకచెక్కవలే నలిగిపోతున్నారు. ఆక్రమణలను తొలగించకపోతే ఉన్నతాధికారుల నుంచి చర్యలు ఉంటాయని, తొలగిస్తే ప్రజాప్రతినిధుల ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుందని ఆందోళన వ్యక్తం అవుతోంది. కొందరు ప్రజాప్రతినిధులు తమకు అనుకూలంగా వ్యవహరించే ఉన్నతాధికారిని ప్రత్యేక అధికారిగా తీసుకువస్తే పరిస్థితులు సానుకూలమవుతాయనే భావనలో ఉన్నారు. అవసరమైతే ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు