రైతుల కోసం ఎందాకైనా...

2 Oct, 2018 13:01 IST|Sakshi
రైతుల నుంచి భూములు తీసుకుని పైప్‌లైన్‌ వేసిన అధికారులు

పురుషోత్తపట్నం బాధితులకు అండగా పోరాటం

న్యాయమైన పరిహారం కోరుతూ ఆమరణ దీక్షకు సిద్ధమైన రాజా

రఘుదేవపురం కోటలో నేటి నుంచి శ్రీకారం

సాక్షి ప్రతినిధి, తూర్పుగోదావరి, కాకినాడ : ప్రాజెక్టుల కోసమని రైతుల నుంచి భూములను సేకరిస్తుంది..పరిహారం ఇచ్చేసరికి చుక్కలు చూపిస్తోంది. న్యాయబద్ధంగా వ్యవహరించి సంతృప్తి పరచాల్సిన ప్రభుత్వం తమకేమీ పట్టనట్టుగా  వ్యవహరిస్తూ బాధిత రైతులను గాలికొదిలేసింది. నిర్లక్ష్యం ఆవరించి నిద్రావస్థలో ఉన్న ప్రభుత్వాన్ని మేల్కొల్పడానికి వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఉద్యమానికి సిద్ధమయ్యారు. రైతుల తరపున పోరాటంలో భాగంగా ఆమరణ నిరాహార దీక్షకు ఉపక్రమిస్తున్నారు. రైతుల కోసం ప్రాణ త్యాగమైనా చేస్తానంటూ మంగళవారం చేపట్టనున్న దీక్షతో శ్రీకారం చుట్టనున్నారు.

సమస్య ఇదీ...
మండలంలోని పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని రూ.1,638 కోట్ల నిధులతో నెలకొల్పారు. పురుషోత్తపట్నంలో హెడ్‌వర్క్‌ నుంచి పది కిలో మీటర్లు పొడవున పైప్‌లైన్‌ వెళ్లి దేవీపట్నం మండలం గండికోట వద్ద పోలవరం ప్రాజెక్ట్‌ ఎడమ కాలువలోకి గోదావరి జలాలను వదిలారు. 55 కిలోమీటర్ల ఎల్‌ఎమ్‌సీ ద్వారా వెళ్లిన నీటిని ఏలేరు రిజర్వాయర్‌లో ఎత్తిపోస్తారు. అక్కడ నుంచి విశాఖ జిల్లాకు, తాగునీరు. సాగునీరుతోపాటుగా, స్టీల్‌ప్లాంట్‌కు నీటిని సరఫరా చేస్తామన్న ఉద్దేశంతో ప్రాజెక్టు రూపకల్పన చేశారు. దీనివల్ల ఉపయోగం ఎంతుందో తెలియదు గాని రైతులకు మాత్రం అన్యాయం జరిగింది. ఈ పథకంలో మండలంలో పురుషోత్తపట్నం, వంగలపూడి, చినకొండేపూడి, నాగంపల్లి రెవెన్యూలో 334 మంది రైతులకు సంబంధించి 206 ఎకరాలు భూసేకరణ ద్వారా సేకరించారు. నాగంపల్లి రెవెన్యూలో ఉన్న భూములకు ఎకరానికి రూ.24 లక్షలు, మిగిలిన భూములకు ఎకరానికి రూ.28 లక్షలు పరిహారంగా ఇస్తామని ప్రకటించారు.

244 మంది రైతులు ముందుగానే 138 ఎకరాలు అందించారు. వీరికి రూ.24 లక్షలు,  రూ.28 లక్షలు ఎకరానికి పరిహారంగా అందించారు. 89 మంది రైతులకు సంబంధించి 70 ఎకరాల భూములకు 2013 భూసేకరణ చట్టం కింద పరిహారం అందించాలని డిమాండ్‌ చేస్తున్నారు. చట్టాన్ని  పరిగణనలోకి తీసుకుని పరిహారాన్ని లెక్కిస్తే రైతులకు మేలు జరుగుతుంది. ఒక రైతుకు చెందిన భూములు ఒకటికి రెండు మూడు ప్రాజెక్టుల్లో పోతే పరిహారం నాలుగు రెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇక్కడదేమీ చేయకుండా తోచిన విధంగా పరిహారం ఇస్తున్నారు. ఇక,  రూ. ఐదున్నర లక్షలు ఆర్‌ఎన్‌ఆర్‌ ప్యాకేజీ, కుటుంబంలో 18 సంవత్సరాలు వయస్సు నిండిన వారిలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాల్సి ఉంది. రైతు కూలీలకు కూడా ఇదే విధంగా ఆర్‌ఎన్‌ఆర్‌ ప్యాకేజీ లేదా నెలకు రూ. రెండు వేలు చొప్పున 20 సంవత్సరాలపాటు ఆ కుటుంబానికి అందజేయాలి. కానీ టీడీపీ ప్రభుత్వం దీన్ని కూడా పట్టించుకోవడం లేదు. ఈ డిమాండ్లతో  55 మంది రైతులు కోర్టును అశ్రయించారు. ఎకరాకు రూ. నాలుగు లక్షలు పెంచి పరిహారం అడుగుతుంటే మీనమేషాలు లెక్కిస్తున్న ప్రభుత్వం కోర్టులకు వెళ్లి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టడానికే సిద్ధ పడుతుందే తప్ప రైతులకు న్యాయం చేసేందుకు ఆసక్తి చూపడం లేదు.

రైతులకు బాసటగా రాజా ఆమరణ నిరాహార దీక్ష
ఏళ్ల తరబడి పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా రైతుల తరపున పోరాటానికి దిగారు. ఏళ్లు గడుస్తున్నా పరిహారం అందక రైతులు ఇబ్బంది పడుతున్నారని, వారికి న్యాయం జరిగే వరకూ ఉద్యమిస్తూనే ఉంటానంటూ సంకల్పించారు. అందులో భాగంగా నేటి నుంచి ఆమరణ దీక్షకు ఉపక్రమిస్తున్నారు. రఘుదేవపురం కోట దుర్గ గుడి ఎదురుగా ఉన్న స్థలంలో  దీక్ష చేపట్టనున్నారు.

ప్రాణ త్యాగానికైనా సిద్ధం...
పురుషోత్తపట్నం ప్రాజెక్టుకు సంబంధించి భూసే కరణ జరిపి రెండు సంవత్సరాలు పూర్తికావొస్తు న్నా ఇంతవరకు ఆయా రైతులకు నష్టపరిహారా న్ని అందించకపోవడం ప్రభుత్వ దుర్మార్గపు ఆలోచన విధానానికి తార్కాణం. 2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు ఇవ్వాల్సిన పరిహా రాన్ని పక్కన పెట్టేసి ఇష్టానుసారంగా పంíపిణీ చేసేందుకు ప్రయత్నిస్తోంది.  ఇదే విషయాన్ని గతంలో చాలాసార్లు వ్యతిరేకించాం. పరిహారం పంపిణీ విషయంలో ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ వర్తించే రైతులు, రైతు కూలీలకు ఈ రోజుకు కూడా న్యాయం చేయకపోవడం బాధాకరం. వీరి న్యాయబద్ధమైన డిమాండ్ల సాధన కోసం ఆమరణ దీక్ష చేస్తున్నాను. ఎంతవరకైనా పోరాడుతాను. ప్రాణ త్యాగానికైనా సిద్ధపడతాను.– జక్కంపూడి రాజా, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు 

మరిన్ని వార్తలు