నగర పంచాయతీకే ఎసరు..!

17 Jun, 2019 10:18 IST|Sakshi
రాజాం నగరపంచాయతీ

5 పంచాయతీలకు ప్రత్యేకాధికారులు

వాస్తవంగా 3 పంచాయతీలకే అవసరం

గత టీడీపీ పాలనలో కార్యకర్తల అత్యుత్సాహం

సాక్షి, రాజాం (శ్రీకాకుళం): గత టీడీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి తూట్లు పొడిచింది. ఎన్నికలకు పోతే తమ ఉనికిని కోల్పోతామని భయంతో అధికారాన్ని దుర్వినియోగం చేసింది. ఏకంగా రాజాం నగర పంచాయతీ వ్యవస్థను రద్దు చేసేందుకు కుయుక్తులు పన్నింది. ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఆగమేఘాల మీద ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల దీనికి సంబంధించి ఫైల్‌ రావడంతో నగర పంచాయతీ అధికారులు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఇది అధికారికంగా అమలులోకి వస్తే తమ అధికారాలు కోల్పోతామని తలలు పట్టుకుంటున్నారు. 

కేవలం మూడు పంచాయతీలే కాగా..
2005లో రాజాం నగర పంచాయతీ ఏర్పడింది. ఇందులో కొత్తవలస, పొనుగుటివలస, కొండంపేట, సారధి, విలీనమయ్యాయి. అప్పట్లో ఐదు పంచాయతీలకు చెందిన కార్యదర్శులు, పాలకుల నుంచి ఆమోదం తీసుకోవాల్సి ఉండగా, అధికారులు అవేమీ పట్టించుకోకుండా ఎన్నికలకు సిద్ధపడ్డారు. దీన్ని సవాల్‌ చేస్తూ సారధి మినహా మిగిలిన మూడు పంచాయతీలకు చెందిన అప్పటి సర్పంచ్‌లు కోర్టును ఆశ్రయించారు. తమకు పంచాయతీలను పాలించే హక్కు ఐదేళ్లు పూర్తి కాకముందే విలీనం చేయొద్దని కేసు వేశారు.

రెండేళ్ల క్రితం ఈ కేసు కొలిక్కి రావడంతోపాటు అబ్జెక్షన్‌ పెట్టిన పంచాయతీల్లో ప్రస్తుతం ప్రత్యేకాధికారులను నియమించి నో అబ్జెక్షన్‌ ధ్రువీకరణ పత్రాలు తీసుకుని ఎన్నికలకు సిద్ధమవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ సమయంలోనే రాజాంకు చెందిన ఒకరిద్దరు టీడీపీ కార్యకర్తలు తమ పరపతిని ఉపయోగించి అప్పటి కలెక్టర్‌ ద్వారా నగర పంచాయతీగా ఉన్న ఐదు పంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమించాలని ఒత్తిళ్లు చేశారు. రెణ్నెల్ల క్రితం ఈ ఫైల్‌ను టీడీపీ పాలకులు హడావుడిగా ఆమోదించడంతో ప్రస్తుతం రాజాం నగర పంచాయతీకి చేరుకుంది. నగర పంచాయతీలో విలీనమైన ఐదు పంచాయతీలకు ప్రస్తుతం ప్రత్యేక అధికారులు నియమించాల్సి ఉందని ఇందులో సారాంశం.

అసలుకే ఎసరు..
ఐదు పంచాయతీలో రాజాం పంచాయతీ ఒకటి ఉంది. ఇప్పుడు ప్రత్యేకాధికారులను నియమిస్తే రాజాం నగర పంచాయతీ కార్యాలయ అధికారులు తమ అధికారాలను కోల్పోతారు. దీంతో కొత్త చిక్కులు రావడమే కాకుండా నగర పంచాయతీ మొత్తం ఉనికిని కోల్పోయే పరిస్థితి ఉంది. అప్పట్లో ఎన్నికల నిర్వహణ ఇష్టం లేక టీడీపీ కార్యకర్తలు ఇలా చేసి ఉంటారని ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ప్రత్యేకాధికారుల నియామకానికి సంబంధించిన కొత్త చిక్కులను పరిష్కరించలేక నగరపంచాయతీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

ఎన్నికలు సమీపించిన తరుణంలో..
14 ఏళ్లుగా రాజాం నగర పంచాయతీకి ఎన్నికలు నిర్వహించలేదు. టీడీపీ హయాంలో రాజాంకు ఎన్నికలు నిర్వహిస్తామని హామీ ఇచ్చినప్పటికీ రాజాంలో టీడీపీపై వ్యతిరేకత ఉండటంతో ఆ ఎన్నికలను వాయిదా వేసేశారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం జగన్‌మోహన్‌రెడ్డి దృష్టిసారించారు. ఈ నేపథ్యంలో ఇటీవల రాజాం నగర పంచాయతీకి సంబంధించి ఓటర్లు, జనాభా, వార్డులు వివరాలు కూడా అధికారులు సిద్ధం చేసి ఎన్నికల అధికారులకు అందించారు. రేపో మాపో నోటిఫికేషన్‌ రానున్న సమయంలో కొత్తగా ప్రత్యేకాధికారులు నియామకం స్టంటు తెరపై హల్‌చల్‌ చేస్తోంది. దీంతో ఏమిచేయాలో తోచని స్థితి ఇక్కడ నెలకుంది.

రాజాం గురించి ఇలా..
రాజాం నగర పంచాయతీ ఏర్పడిన సంవత్సరం : 2005
విలీనం చెందిన పంచాయతీలు     : 05
అభ్యంతరం చెప్పిన పంచాయతీలు : 03 
మొత్తం వార్డులు    : 20 
మొత్తం జనాభా    : 42,127 మంది
మొత్తం ఓటర్లు     : 24,850

ఇబ్బందే..
రాజాం నగర పంచాయతీ ఏర్పడి 14 ఏళ్లు కావస్తున్నా ఇంతవరకూ ఎన్నికలు జరగలేదు. ఇప్పుడు జరుగుతాయని ఎదురు చూస్తున్నాం. ఈ సమయంలో ఇటువంటి అడ్డంకులు రావడం అనుమానాలకు తావిస్తోంది.
– కోరాడ రామినాయుడు, బుచ్చింపేట, రాజాం

మంత్రి దృష్టికి తీసుకెళ్తున్నాం..
రాజాం నగర పంచాయతీ ఎన్నికలు అంటే ఇష్టంలేని వారు ఇలా చేసినట్లు అనిపిస్తుంది. వాస్తవంగా మూడు పంచాయతీలకు మాత్రమే ప్రత్యేకాధికారులను నియమించి తీర్మానాలు తీసుకోవాలి. అలా కాకుండా ఐదు పంచాయతీలకు ప్రత్యేకాధికారులు అంటూ వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో ఈ పొరపాటు జరిగింది. ఈ కొత్త చిక్కులను పట్టణాభివృద్ధి శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తున్నాం. 
– వీ సత్యనారాయణ, కమిషనర్, రాజాం నగర పంచాయతీ

మరిన్ని వార్తలు