పోలవరం ముంపుపై రీ సర్వే!

13 May, 2018 01:59 IST|Sakshi

తెలంగాణ, ఒడిశా ఒత్తిళ్ల నేపథ్యంలో కేంద్రం యోచన

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ చేపట్టిన పోలవరం ప్రాజెక్టుతో సరిహద్దు రాష్ట్రాల్లో ఏర్పడుతున్న ముంపుపై కేంద్రం కొత్తగా సర్వే చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తమ రాష్ట్రాల్లో ముంపుపై అధ్యయనం చేయాలంటూ తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌గఢ్‌లు ఓ వైపు కేంద్రం వద్ద, మరోవైపు సుప్రీంకోర్టులో కొట్లాడుతున్న దృష్ట్యా ముంపుపై రీసర్వే చేసే యోచనలో ఉన్నట్లు కేంద్ర వర్గాల ద్వారా తెలుస్తోంది.

పోలవరం ప్రాజెక్టుకు 36 లక్షల క్యూసెక్కుల గరిష్ట వరద ప్రవాహం ఆధారంగా 2005లో పలు రకాల క్లియరెన్స్‌లు రాగా, తదనంతరం గరిష్ట వరద ప్రవాహ అంచనాను 50లక్షల క్యూసెక్కులకు పెంచడంతో సర్వే అనివార్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బచావత్‌ ట్రిబ్యునల్‌ 1980లో ఇచ్చిన అవార్డును ఉల్లంఘిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు స్వరూపాన్ని మార్చేసిందని, దీంతో తాము ముంపునకు గురవుతున్నామని ఒడిశా ప్రభుత్వం ఎప్పటినుంచో వాదిస్తోంది. దీనిపై సుప్రీంకోర్టు, నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది.

ఇదే అంశమై రేలా అనే స్వచ్చంధ సంస్థ తెలంగాణ ముంపు ప్రాంతాలపై సైతం పిటిషన్‌లు వేయగా, దీనిపైనా తెలంగాణ తన అభిప్రాయాన్ని లిఖిత పూర్వకంగా అటు సుప్రీంకు, ఇటు ఎన్జీటీకి సమర్పించింది. ఇందులో ప్రాజెక్టు నిర్మాణంతో ఏర్పడుతున్న ముంపుపై పర్యావరణ నిర్వహణ ప్రణాళిక రూపొందించాలని, తాజాఅంచనాలు తయారు చేసిన తర్వాతే పనులు మొదలుపెట్టాలని కేంద్ర పర్యావరణ శాఖ 2011 ఫిబ్రవరిలో ఏపీ ప్రభుత్వానికి రాసిన లేఖలో సూచించినా, ఏపీ ప్రభుత్వం తదుపరి అధ్యయనం చేయకపోవడం తమపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని తెలంగాణ తెలిపింది.

అయితే ఈ వినతులపై అటు కేంద్రం కానీ, ఇటు ఏపీ కానీ ఎలాంటి నిర్ణయం చేయలేదు. దీనిపై ఇటీవల సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. దీంతో బ్యాక్‌వాటర్‌ స్టడీస్‌ చేయాలని, తద్వారా ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లో ముంపును అధ్యయనం చేయాలని కేంద్రం యోచిస్తున్నట్లుగా నీటి పారుదల వర్గాల ద్వారా తెలుస్తోంది.

మరిన్ని వార్తలు