తగ్గిన చికెన్, చేపల విక్రయాలు

24 Nov, 2013 02:07 IST|Sakshi

=కార్తీక మాసం ఎఫెక్ట్
= చేపల ఎగుమతులు 30 శాతం తగ్గుముఖం
= చిక్కిన చికెన్ ధర

 
సాక్షి, మచిలీపట్నం : జిల్లాలో కోడిమాంసం, చేపల విక్రయాలు భారీగా తగ్గిపోయాయి. హిందువులు పరమ పవిత్రంగా భావించే కార్తీక మాసం ప్రభావం వీటి విక్రయాలపై పడింది. సాధారణంగా ఈ మాసంలో హిందువుల్లో చాలామంది శాకాహారమే తీసుకుంటారు. అయ్యప్ప, భవానీ దీక్షాధారణలు ఈ మాసంలో ఎక్కువగా ప్రారంభమవటం కూడా దీనికి మరో కారణం. ఎగుమతులు తగ్గిపోవటంతో పాటు స్థానికంగాను వినియోగం పడిపోవడంతో మార్కెట్‌లో వాటి ధరలు చిక్కిపోతున్నాయి. జిల్లాలో చేపలు, కోడి మాంసం విక్రయాలు దాదాపు 30 నుంచి 50 శాతం వరకు తగ్గిపోయినట్లు అంచనా వేస్తున్నారు.

తగ్గిన చేపల ఎగుమతులు...

కృష్ణాజిల్లాలో సుమారు లక్ష ఎకరాల్లో చేపలు, 40 వేల ఎకరాల్లో రొయ్యలు సాగవుతున్నట్లు అనధికారిక అంచనా. పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 1.70 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. ఈ రెండు జిల్లాల నుంచి రోజువారీగా 150 లారీల వరకు చేపలు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంటాయి. చేపలు ఎగుమతి అయ్యే పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, అస్సాం తదితర రాష్ట్రాల్లో దసరా నవరాత్రులు, దీపావళి సమయంలో ఆల్‌ఖతా (జమా, ఖర్చుల చిట్టాలు పూర్తిచేసే) పద్ధతిని పాటిస్తారు.

కార్తీక మాసాన్ని కూడా ఆయా రాష్ట్రాల్లో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. దీంతో దసరా సమయంలో దేవీ నవరాత్రులకు ఐదురోజుల ముందునుంచే కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి చేపల ఎగుమతులు తగ్గిపోతాయి. దీపావళి సమయంలో నిర్వహించే ఆల్‌ఖతా సందర్భంలోనూ ఆయా రాష్ట్రాల్లో దిగుమతులను నిలిపివేస్తారు. ఇదేవిధంగా కార్తీకమాసం మొదలయ్యే ఐదురోజుల ముందునుంచి చేపల విక్రయాలు ఆయా రాష్ట్రాల్లో తగ్గిపోతాయి. దీంతో ఈ మూడు సందర్భాల్లోనూ కృష్టా, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి చేపల ఎగుమతులపై ప్రభావం పడుతోంది.

దీంతో కొద్దిరోజులుగా ఈ రెండు జిల్లాల నుంచి రోజుకు 100 నుంచి 120 వరకు మాత్రమే చేపలలోడు లారీలు వెళుతున్నట్లు చేపల రైతుల సంఘ జిల్లా అధ్యక్షుడు ముదునూరి సీతారామరాజు ‘సాక్షి’కి చెప్పారు. రొయ్యలు ఇతర దేశాలకు ఎగుమతి అవుతుండటంతో వాటిపై స్థానిక మార్కెట్‌లో మినహా ఈ ప్రభావం పెద్దగా కనిపించటం లేదు.

 చేప ధరకు దెబ్బ...

 ఎగుమతులు తగ్గిపోవడంతో చేపల ధరపై ప్రభావం పడుతోందని రైతులు చెబుతున్నారు. డిమాండ్ లేదని, ఎగుమతులు తగ్గిపోయాయని రకరకాల కారణాలు చెప్పి వ్యాపారులు వీటి ధరను తగ్గిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండగ సీజన్లలో చేపల విక్రయాలు తగ్గిపోవటం వల్ల కూడా వీటి ధరపై ప్రభావం పడుతోంది. ఇటీవల బొచ్చె రకం చేప కేజీ ధర రైతు వద్ద రూ.120 వరకు పలకగా, తాజాగా అది రూ.90 నుంచి 110 వరకు మాత్రమే పలుకుతోంది. స్థానిక మార్కెట్‌లోనూ వీటికి సరైన ధర దక్కటం లేదు. డిమాండ్ లేకపోవటంతో చెరువుల్లోనే చేపలను ఉంచి అవసరమైన మేరకే స్థానిక మార్కెట్‌కు తీసుకురావటం ద్వారా రైతులు ధర దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

 చిక్కిన చికెన్ ధర...

 జిల్లాలో చికెన్ ధర అమాంతరం పడిపోయింది. జిల్లాలో మామూలు రోజుల్లో సుమారు 50 వేల కిలోలు, అదే ఆదివారం రోజున లక్ష కిలోలు చొప్పున చికెన్ విక్రయాలు జరుగుతుంటాయి. కార్తీక మాసం కావటంతో ప్రస్తుతం జిల్లాలో చికెన్ విక్రయాలు దాదాపు 45 శాతం పడిపోయాయి. దీంతో రిటైల్ మార్కెట్‌లో కిలో రూ.190 వరకు పలికిన చికెన్ ధర కార్తీకమాసంలో రూ.130కు పడిపోయింది. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో రూ.100కు కూడా చికెన్ అమ్మకాలు నిర్వహించారు. మటన్ ధరలో మాత్రం ఎలాంటి మార్పూ లేకపోవటం గమనార్హం.
 

మరిన్ని వార్తలు