అ‘విశ్రాంత’ ఉపాధ్యాయులు

19 Jul, 2019 07:38 IST|Sakshi
విద్యార్థులకు బోధిస్తున్న రిటైర్డ్‌ హెచ్‌ఎం సుబ్బరాయుడు

ఆదర్శనీయులుగా ముగ్గురు ఉపాధ్యాయులు

ఉద్యోగ విరమణ పొందినావిద్యా బోధన 

పని చేసిన పాఠశాలల్లోనే సేవ

‘సాయం చేయడానికి ఉండాల్సింది డబ్బు కాదు.. మంచి మనసు’ ఈ మాటలు అన్నది ఎవరో కాదు ప్రజా సేవకే తన జీవితం అంకితం చేసిన మదర్‌ థెరిస్సా. కొందరు చేసే సేవలను చూసినప్పుడు ఆమె చెప్పిన మాటలు అక్షరాల నిజమనిపిస్తుంది. ఉద్యోగ విరమణ పొందినా ముగ్గురు ఉపాధ్యాయులు తాము పని చేసిన పాఠశాలల్లోనే విద్యా బోధన చేస్తూ.. పలువురికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు.

సాక్షి, రాజంపేట టౌన్‌ : రాజంపేట మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తూ ఉద్యోగ విరమణ పొందిన ఇద్దరు హెచ్‌ఎంలు, ఓ రిటైర్డ్‌ ఉపాధ్యాయురాలు అవిశ్రాంతంగా పని చేస్తున్నారు. తాము పని చేసిన పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా విద్యను బోధిస్తూ సేవాతత్పరతను చాటుతున్నారు. రిటైర్డ్‌ అయ్యే చాలా మంది ఉపాధ్యాయులు శేష జీవితాన్ని తమ  పిల్లలు, కుటుంబ సభ్యులతో ఎలా గడపాలో.. ముందే ప్రణాళికలు రూపొందించుకుంటారు. అయితే మండలంలోని తుమ్మల అగ్రహారానికి చెందిన రిటైర్డ్‌ హెచ్‌ఎం యు.సుబ్బరాయుడు, ఎగువగడ్డకు చెందిన రిటైర్డ్‌ హెచ్‌ఎం వనం ఎల్లయ్య, ఎగువగడ్డ ప్రాంతానికే చెందిన రిటైర్డ్‌ ఉపాధ్యాయురాలు హెప్సీబ ఉద్యోగ విరమణ పొందినా తమ శేష జీవితాన్ని మాత్రం విద్యార్థులతోనే గడపాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివేది పేద విద్యార్థులు కావడంతో.. వారి ఉన్నతి కోసం తోడ్పడుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. 

గురువులకు వందనం 
రిటైర్డ్‌ హెచ్‌ఎం యు.సుబ్బరాయుడు తుమ్మల అగ్రహారంలోని ప్రాథమిక పాఠశాలలో పని చేస్తూ 2017లో ఉద్యోగ విరమణ పొందారు. వనం ఎల్లయ్య ఒకటో వార్డు ప్రాథమిక పాఠశాల, హెప్సీబ మండలంలోని వెంకటరాజంపేట ప్రాథమిక పాఠశాలలో పని చేస్తూ ఈ ఏడాది ఉద్యోగ విరమణ పొందారు. ఇప్పుడు అదే పాఠశాలల్లోని విద్యార్థులకు విద్యను అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. హెప్సీబ రాజంపేట పట్టణం నుంచి వెంకటరాజంపేటకు తన సొంత ఖర్చుతో ఆటోలో వెళ్లి విద్యార్థులకు బోధన చేస్తుండటం విశేషం. వీరికి వందనం అని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు అభినందనలు తెలుపుతున్నారు.

దేవుడిచ్చిన వరం
సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవమైనది. నాకు ఉపాధ్యాయ వృత్తి లభించడం భగవంతుడు ఇచ్చిన వరంగా భావిస్తున్నా. అందువల్లే నేను ఉద్యోగ విరమణ పొందినా భగవంతుడు నాకు కల్పించిన 
ఈ అవకాశాన్ని పేద విద్యార్థుల ఉన్నతికి వినియోగిస్తున్నా.  – యు.సుబ్బరాయుడు,రిటైర్డ్‌ హెచ్‌ఎం, టి.అగ్రహారం

పేద విద్యార్థులతోనే శేష జీవితం
రెండున్నర దశాబ్దాల పాటు పేద విద్యార్థులతో నా జీవితం సాగింది. శేషజీవితం కూడా వారితోనే కొనసాగించాలన్నదే నా కోరిక. అందువల్ల నేను రిటైర్డ్‌ అయినా పేద విద్యార్థులకు ఉచితంగా బోధించాలని నిర్ణయించుకున్నా. పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది.   – వనం ఎల్లయ్య, రిటైర్డ్‌ హెచ్‌ఎం, ఎగువగడ్డ, రాజంపేట

శరీరం సహకరించినంత వరకు..
నేను వెంకటరాజంపేట ప్రాథమిక పాఠశాలలో తొమ్మిదేళ్లు ఉపాధ్యాయురాలిగా పని చేశాను. ఇక్కడి విద్యార్థులు, ప్రజలతో ఆత్మీయ అనుబంధం ఏర్పడింది. నాకు శరీరం సహకరించినంత వరకు ఈ గ్రామంలోని విద్యార్థులకు సేవ చేస్తా.   – హెప్సీబ, రిటైర్డ్‌ ఉపాధ్యాయురాలు, ఎగువగడ్డ 

గొప్ప విషయం
రిటైర్డ్‌ అయిన ఉపాధ్యాయులు ఉచితంగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు విద్యను అందించాలని సంకల్పించడం చాలా గొప్ప విషయం. రిటైర్డ్‌ అయిన ఉపాధ్యాయులు తమకు అందుబాటులో ఉండే పాఠశాలల్లో ఇలా బోధిస్తే విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది.    – మేడా చెంగల్‌రెడ్డి, ఎంఈఓ, రాజంపేట 

మరిన్ని వార్తలు