రెవెన్యూ అధికారుల లీలలు

3 Sep, 2013 00:30 IST|Sakshi

 మెద క్ రూరల్, న్యూస్‌లైన్: రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం ఘర్షణలకు దారి తీస్తోంది. ఒకే భూమిని ఇద్దరు వ్యక్తులకు పట్టాలు చేసి ఇవ్వడంతో ఆ భూమిలో ఒకరు నాటువేస్తే...మరొకరు గడ్డిమందుకొట్టి పంటను ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని హవేళిఘణపూర్‌కి చెందిన మంగళి రాజయ్యకు లింగ్సానిపల్లి ఊరచెర్వు వెనకాల 98 సర్వే నంబర్లో 7 గుంటల భూమి ఉండేది. రాజయ్య తన భూమిని 1984లో హవేళిఘణపూర్ గిరిజన తండాకు చెందిన ధారావత్ పుల్యకు విక్రయించాడు. దీంతో పుల్య 2012 వరకు విక్రయ పత్రం ఆధారంగానే భూమిని సాగు చేసుకున్నాడు. 2012లో కొనుగోలు దారుడైన  ధారావత్ పుల్యకు మెదక్ రెవెన్యూ అధికారులకు పట్టా చేసి ఇచ్చారు. అదే సంవత్సరం హవేళిఘపూర్‌కు చెందిన  మంగళి సాయిలుకు కూడా అదే భూమిని అధికారులు 2012లోనే పట్టాచేసి ఇచ్చారు. ఒకే సర్వే నంబర్‌పై ఇరువురికి పట్టా ఇవ్వటంతో ఇరువురు లబ్ధిదారులు గొడవలు పడుతున్నారు. 1984 నుండి ఆ భూమి కొనుగోలు దారుడు దారావత్ పూల్య సాగుచేసుకుని జీవనం సాగిస్తున్నాడనీ గ్రామస్తులు చెబుతున్నారు. అయితే, మంగళి సాయిలు మాత్రం ఈ భూమి తమ పాలి వాళ్లదనీ, వారికి తనే వారసున్నని పేర్కొంటున్నాడు. ఈ ఘర్షణల నేపథ్యంలోనే ఈఏడాది కూడా ధారావత్ పుల్య సదరు భూమిలో నాటు వేయగా. మంగళి సాయిలు గడ్డిమందును స్ప్రే చేశాడు. దీంతో  పంటంతా  ఎండిపోయింది. దీంతో పుల్య పోలీసులకు ఫిర్యాదు చేయగా మెదక్ రూరల్ ఎస్‌ఐ వేణుకుమార్ మంగలి సాయిలుపై కేసు నమోదు చేశారు.
 
 సాయిలుకు సంబంధం లేదు
 2012 సంవత్సరంలో ఒకే భూమిని అప్పటి ఎమ్మార్వో ఇరువురికీ పట్టాచేశారు. దీనిపై విచారణ జరపగా మంగళి రాజయ్య వద్ద భూమి కొనుగోలు చేసినట్లు పుల్య వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయి. సాయిలుకు ఆ భూమికి సంబంధం లేదు. ఈ విషయంపై నెలరోజుల క్రితమే  విచారణ జరిపి ఆర్డీఓకు నివేదించాను. ఆదేశాలు వెలువడగానే తగు చర్యలు తీసుకుంటాను.
 -పుష్పలత, తహశీల్దార్, మెదక్
 
 

మరిన్ని వార్తలు