తమ్ముళ్ల జేబులు నింపేందుకే రూ.4 కోట్ల పనులు

26 Oct, 2014 02:41 IST|Sakshi
తమ్ముళ్ల జేబులు నింపేందుకే రూ.4 కోట్ల పనులు

కొడవలూరు: తెలుగుతమ్ముళ్ల జేబుల్లోకి అప్పనంగా రూ.4 కోట్ల నిధులను పంపేందుకు రంగం సిద్ధమైంది. ఆయకట్టుదారుల పేరుతో కాలువల పూడికతీత పనులను తమ్ముళ్లకు కట్టబెట్టేందుకు అధికార పార్టీ నేతలు సన్నద్ధమయ్యారు. తొలుత కాలువల పూడికతీత బాధ్యతలను టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు అప్పగించాలని నిర్ణయించారు. నేతల ఒత్తిళ్లతో ఆయకట్టుదారులకే ఆ పనులు అప్పగించాలనే వాదాన్ని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు తెరమీదకు తెచ్చారు.   

సోమశిల జలాలను శనివారం విడుదల చేశారు. అయినా ఇప్పటి దాకా కాలువల పూడికతీత పనులు ప్రారంభం కాలేదు. ప్రధాన సాగునీటి కాలువల పూడికతీత పూర్తి స్థాయిలో జరగాలంటే కనీసం మూడు వారాల వ్యవధి అవసరమని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. పనుల బాధ్యతలను ఎవరికి అప్పగించాలన్న విషయమై అధికార నేతలు తర్జనభర్జన పడడం వల్లే పూడిక తీతలో తీవ్రజాప్యం చోటుచేసుకుందన్న విమర్శలున్నాయి. ఐఏబీ సమావేశంలో ఈ నెల 25 నుంచి సోమశిల జలాలను విడుదల చేస్తామని ప్రకటించారు. 4,16,640 ఎకరాలకు సాగు నీరందించాలని నిర్ణయించారు.

ఆయకట్టుకు సాగునీరు సవ్యంగా అందాలంటే కాలువలు బాగుండాలి. అయితే ప్రధాన కాలువలన్నీ తూటాకు, జమ్ముతో నిండి ఉన్నాయి. వీటిని పూర్తి స్థాయిలో తొలగించని పక్షంలో చివరి ఆయకట్టుదారులకు సాగు నీరందవు. ఈ సమస్యను అధికార పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవడంతో తక్షణం కాలువల మరమ్మతులకు రూ.4 కోట్లు విడుదల చేసేందుకు ఆయన అంగీకరించారు.అయితే పూడికతీత పనులు ప్రారంభం కాకపోవడంతో రబీ సాగుకు సిద్ధమవుతున్న రైతుల్లో ఆందోళన నెలకొంది. కాలువల దుస్థితిని చూసి రైతులు నారు పోసుకునేందుకు వెనుకాడుతున్నారు.

 తమ్ముళ్ల కోసమే.. :  కాలువల పూడికతీతకు ముఖ్యమంత్రి రూ.4 కోట్ల నిధులు ఇచ్చారని,వెంటనే టెండర్లు పిలిచి పనులు చేపడుతామని జన్మభూమి సభల్లో ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి చెబుతూ వచ్చారు. నియోజకవర్గం డెల్టా ప్రాంతం కావడంతో రైతులు కూడా ఆనందించారు. అయితే జన్మభూమి చివరి రోజుల్లో కాలువల పూడికతీతపై రైతులు ఎమ్మెల్యేను ప్రశ్నించారు. కాలువల కింద ఆయకట్టున్న రైతులకే పూడికతీత పనులు అప్పగించేలా అధికారులను ఒప్పించామని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని ఎమ్మెల్యే సమాధానమిచ్చారు.

నీటి విడుదల ప్రారంభమైనా హామీలే తప్ప పనులు మాత్రం ఇప్పటికీ ప్రారంభం కాలేదు. నీటి విడుదల జరిగాక పూడికతీత పనుల్లో నాణ్యత పాటించే అవకాశాలు లేవనే వాదన ఉంది. ఇప్పటికే పూడికతీత పనులు పూర్తి కావాల్సి ఉంది. ఆయకట్టు రైతులకే పూడికతీత పనులు అప్పగిస్తే వారు బాధ్యతతో వ్యవహరించే అవకాశం ఉంది.  ఇక్కడ అధికార పెద్దల ఆలోచన మరోలా ఉందన్న ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. తెలుగు తమ్ముళ్లకు పూడిక పనులు అప్పగించి వారు నాలుగు రూకలసంపాదించుకునేందుకే అధికారులపై ఒత్తిడి తెచ్చి టెండర్లు లేకుండా చేశారనే వాదన బలంగా వినిపిస్తోంది.
 
 ఇదీ ఆయకట్టు: సోమశిల జలాశయం నుంచి అధికారికంగా 4,16,640 ఎకరాలకు అందాల్సి ఉంది. ఇందులో పెన్నా డెల్టా కింద 2.47 లక్షల ఎకరాలుంది. కనుపూరు కాలువ కింద 33 వేల ఎకరాలు, కావలి కాలువ కింద 72,489 ఎకరాలు, ఉత్తర కాలువ కింద 34,257 ఎకరాలు, దక్షిణ కాలువ కింద 29,894 ఎకరాల ఆయకట్టు ఉంది. పెన్నా డెల్టా పరిధిలోని ఆయకట్టుకు సంగం డెల్టా కింద ఏటీఎస్ కాలువ ద్వారా 26,826 ఎకరాలకు, దక్షిణ కాలువ ద్వారా 25 వేలు, తూర్పు కాలువ ద్వారా 25,491 ఎకరాలకు సాగు నీరందుతుంది. నెల్లూరు డెల్టా కింద జాఫర్ సాహె బ్ కాలువ ద్వారా 33 వేల ఎకరాలు, సర్వేపల్లి కాలువ ద్వారా 30 వేలు, నెల్లూరు చెరువు ద్వారా 12 వేలు, సర్వేపల్లి రిజర్వాయర్ ద్వారా 14 వేల ఎకరాలకు నీరందాల్సి ఉంది.

మరిన్ని వార్తలు