పండుగ బాదుడు

8 Jan, 2015 08:59 IST|Sakshi

పండుగ దోపిడీ ప్రారంభమైంది. ప్రత్యేక బస్సుల పేరుతో ఆర్టీసీ బస్సు టికెట్టు 50 శాతం అదనమంటుంటే ప్రైవేటు ట్రావెల్స్ యజమానులు మాత్రం హద్దే లేకుండా రైట్, రైట్ అంటున్నారు. ఇటీవల రాష్ట్ర రవాణాశాఖా మంత్రి శిద్దా రాఘవరావు మాత్రం ఆర్టీసీలో ప్రత్యేక బస్సుల పేరుతో అదనపు చార్జీలు వసూలు చేసేది లేదని ప్రకటించారు. కానీ వారం రోజుల నుంచి ప్రత్యేక బస్సుల టికెట్లు బుకింగ్ అవుతుండడంతో ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా మూడు వేల మందికిపైగా ప్రయాణికులపై అదనపు భారం పడింది. వీరివద్ద నుంచి ఆర్టీసీ అదనంగా వసూలు చేసిన మొత్తం రూ.5 లక్షలపైమాటే.  
 
 రూ.4,95,140 వసూలు చేసినట్లయింది. ఈ నెల 6, 7 తేదీలలో మరింత మంది ప్రయాణికుల నుంచి ఆర్టీసీ 50 శాతం అదనపు మొత్తాన్ని వసూలు చేసింది. ఈ ఏడాది మొత్తం 260 ప్రత్యేక సర్వీసులను నడపాలనుకుంటున్న దృష్ట్యా రూ.20.31 లక్షల భారం ప్రయాణికులు భరించాల్సి వస్తుందన్నమాట. ఈ లెక్క కేవలం ఒంగోలు డిపోకు పరిమితం. మిగిలిన డిపోలు కలుపుకుంటే కోటి రూపాయలు దాటిపోతుంది. సంక్రాంతికి ముందు హైదరాబాదు నుంచి జిల్లాకు ప్రత్యేక బస్సులు నడుస్తాయి. నెల్లూరు జిల్లా నుంచి వచ్చే బస్సులలో కూడా టిక్కెట్లను బుక్ చేసుకుంటుంటారు. ఓ వైపు అదనపు చార్జీలు వసూళ్లు చేసి రిజర్వేషన్ల ప్రాతిపదికన టికెట్లు అమ్మేస్తుంటే  అదనపు వసూళ్లు ఉండవంటూ మంత్రి చెబుతున్న సాంత్వన పలుకులు ఏరకంగా ఆచరణకు వచ్చి ప్రయాణికులకు ఊరటనిస్తాయో అర్థం కావడం లేదు. ఇప్పటికే రిజర్వేషన్లు చేసుకున్నవారికి ఎలా డబ్బులు తిరిగి చెల్లిస్తారని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.  
 
 ప్రైవేటు దోపిడీ ఇలా...
 ప్రైవేటు బస్సుల్లో దోపిడీ భయంకరంగా మారింది. దాదాపు సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రైవేటు బస్సుల్లో ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 100కుపైగా బస్సులు నిండిపోయాయి. ఒక్కో బస్సులో కనీసంగా 30 సీట్లున్నాయనుకుంటే ప్రయాణికుల సంఖ్య 3 వేలు. ఆర్టీసీ సూపర్ లగ్జరీ రేటు రూ.390లుంటే ప్రైవేటు వ్యాపారులు మాత్రం దాదాపు రూ.700 నుంచి టిక్కెట్లు బుక్ చేస్తున్నారు. అంటే కనీసంగా టిక్కెట్‌కు రూ.300 అదనంగా పిండేస్తున్నారు. ఈ లెక్కన మూడువేల టిక్కెట్లకు అదనంగా వసూలైన మొత్తం రూ.9 లక్షలు. అక్కడితో ఆగకుండా వీరి దందా డిమాండ్‌ను బట్టి రెట్టింపయ్యే అవకాశం ఉంది. 

బెంగళూరు వైపు వెళ్లే బస్సులకు ఈ నెల 13, 18 తేదీలలో టిక్కెట్ ధర రూ.2 వేల నుంచి రూ. 2,500 వరకు పలుకుతున్నట్లు సమాచారం. ఆర్టీసీ, ప్రైవేటు ట్రాన్స్‌పోర్టు ఆపరేటర్లిద్దరూ కలిసి సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రయాణికుల మీద వేస్తున్న అదనపు భారం రూ.56.10 లక్షలపైనే ఉండనుంది. గత ఏడాది ప్రైవేటు ఆపరేటర్లపై రవాణాశాఖ అధికారులు ఉక్కుపాదం మోపడంతో ఆర్టీసీ కొంతమేరకు లబ్ధిపొందింది. కానీ ప్రస్తుతం ప్రైవేటు ఆపరేటర్లపట్ల ప్రభుత్వం ప్రేక్షకపాత్ర వహిస్తుండడంతో ఆర్టీసీకి నష్టాలే మిగలనున్నాయి.

మరిన్ని వార్తలు