మత్స్యకారులను కాపాడిన ‘కోస్ట్ గార్డ్’ | Sakshi
Sakshi News home page

మత్స్యకారులను కాపాడిన ‘కోస్ట్ గార్డ్’

Published Thu, Jan 8 2015 8:45 AM

7 fishermen protected by costguard

విశాఖపట్నం: సముద్రంలో చిక్కుకున్న ఏడుగురు మత్స్యకారులను నేవీ కోస్ట్‌గార్డ్ బుధవారం రక్షించింది. కమాం డెంట్ ఎస్.జాకీర్‌హుస్సెన్ తెలిపిన వివరాల ప్రకారం.. కింగ్‌ఫిషర్-3 బోటులో ఏడుగురు మత్స్యకారులు 12 రోజుల క్రితం సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. జనవరి మూడోతేదీ నుంచి వారికి తీరంతో కమ్యూనికేషన్ తెగిపోయింది. విషయం తెలుసుకున్న మత్స్యశాఖ విశాఖ జిల్లా జాయింట్ డెరైక్టర్ పి.కోటేశ్వరరావు మంగళవారం కోస్ట్‌గార్డ్‌కు సమాచారం అందించారు. కోస్ట్‌గార్డ్ షిప్ ఐసీజీఎస్ రాజ్‌ధవాజ్ వెంటనే రంగంలోకి దిగి అన్వేషణ ప్రారంభించింది.

ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ కోస్ట్‌గార్డ్ సిబ్బంది సాహసోపేతంగా వెదికి విశాఖకు తూర్పున 30 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న బోటును రాత్రి 2.35 గంటలకు గుర్తించారు. ఇంజన్ లోపంతో సముద్రంలో నిలిచిపోయిన ఆ బోటును, మత్స్యకారుల్ని బుధవారం ఉదయం 11 గంటలకు విశాఖ తీరానికి క్షేమంగా తీసుకొచ్చారు. యజమానికి బోటును అప్పగించారు. మత్స్యకారులకు సహాయం అందించడం కోసం కోస్ట్‌గార్డ్ 24గంటలూ అందుబాటులో ఉంటుందని కమాండెంట్ తెలిపారు. ఆపద వచ్చినపుడు టోల్‌ఫ్రీ నెంబర్ 1554ను సంప్రదించవచ్చని ఆయన సూచించారు.


 

Advertisement
Advertisement