జగన్ సారథ్యంలోనే సమైక్యాంధ్ర సాధ్యం

11 Oct, 2013 03:54 IST|Sakshi

 సిద్దవటం/అట్లూరు, న్యూస్‌లైన్:
 వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలోనే సమైక్యాంధ్ర సాధ్యమని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ కె.సురేష్‌బాబు అన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా సిద్దవటం రెవెన్యూ కార్యాలయం ఎదుట పార్టీ అనుబంధం రైతు విభాగం కన్వీనర్ పల్లె సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు ‘రైతు దీక్ష’ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా 72 రోజులుగా సీమాంధ్రలో ఉవ్వెత్తున ఉద్యమం ఎగసిపడుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఎందుకు దీక్ష చేస్తున్నారో తెలియడం లేదన్నారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిపై చంద్రబాబు అవాకులు, చవాకులు పేల్చడం ఆయన సంస్కృతి ఏమిటో తెలియజేస్తోందన్నారు. అందరి భవిష్యత్తు భాగ్యనగరంతో ముడిపడి ఉందని పేర్కొన్నారు. తమ పార్టీ పిలుపు మేరకు సమైక్యాంధ్ర సాధన కోసం జరిగే పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
 
 వైఎస్ రాజశేఖరరెడ్డి బతికి ఉన్నట్లైతే విభజన అంశమే ఉండేది కాదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ కె.సురేష్‌బాబు అన్నారు. వైఎస్ లేకపోవడంతో రాష్ట్రాన్ని రెండుగా చీల్చారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా అట్లూరులోని కడప-బద్వేలు ప్రాధాన రహదారిపై గురువారం నిర్వహించిన ‘రోడ్డు దిగ్బంధం’లో ఆయన మాట్లాడారు. అత్యధిక ఎంపీ స్థానాలను గెలుపొంది కేంద్రంలో యూపీఏ ప్రభుత్వన్ని వైఎస్ రాజశేఖరరెడ్డి నిలబెడితే ఆయన మరణానంతరం ఇప్పుడు ఆ పార్టీ రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు సిద్ధపడటం దురదృష్టకరమన్నారు. మండల జేఏసీ కన్వీనర్ కోనయ్య, సభ్యులు నిత్యపూజయ్య, అయ్యవారయ్య పాల్గొన్నారు.
 
 కడప కార్పొరేషన్‌లో..
 సమైక్య రాష్ట్రం కోసం పోరాడే పార్టీలకే ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మికులు మద్దతు పలకాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ కె.సురేష్‌బాబు పిలుపునిచ్చారు. సమైక్యాంధ్రకు మద్దతుగా కడప కలెక్టరేట్ ఎదుట రైతులు చేపట్టిన రిలే దీక్షలను గురువారం ఆయన ప్రారంభించారు. రాజీడ్రామాలు కట్టిపెట్టి సమైక్య రాష్ట్రం కోసం కేంద్ర మంత్రులు, ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేసి ఉద్యమంలో కీలకపాత్ర పోషించాలని డిమాండ్ చేశారు. అన్ని రాజకీయ పార్టీలు సమైక్యాంధ్ర ఏజెండాగా ఉద్యమిస్తేనే విభజన ప్రక్రియ ఆగిపోతుందన్నారు.
 
 కాశినాయనలో
 కాశినాయన మండలంలో నిర్వహించిన రైతు సదస్సులోను సురేష్‌బాబు పాల్గొన్నారు. చంద్రబాబు దీక్షను డ్రామాగా కొట్టిపారేశారు. వైఎస్‌ఆర్ సీపీ నాయకులు నల్లేరు విశ్వనాథరెడ్డి, పంగా గురివిరెడ్డి, కరెంట్ రమణారెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పెద్దరామయ్య, బసిరెడ్డిరామిరెడ్డి, నాగారెడ్డి రామసుబ్బారెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు