అంబర మంటిన శంబరం

23 Jan, 2019 08:18 IST|Sakshi
సిరిమానువద్దకు పూజారి జన్నిపేకాపు జగదిని తీసుకువస్తున్న ఉత్సవ కమిటీ ప్రతినిధులు

అంగరంగ వైభవంగా పోలమాంబ సిరిమానోత్సవం

భక్త జనంతో పోటెత్తిన శంబర గ్రామం

అమ్మవారిని దర్శించుకున్న  లక్షకు పైగా భక్తులు

ఫలించిన అధికారుల ముందస్తు చర్యలు

భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ఏర్పాట్లు

భక్తజనంతో శంబర గ్రామం పోటెత్తింది. పోలమాంబ దర్శనానికి వివిధ ప్రాంతాలనుంచి వచ్చినవారితో గ్రామం కిటకిటలాడింది. ఉదయం నుంచి ఏ వీధిలో చూసినా జనమే కనిపించారు.తెల్లవారుఝామునుంచి భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. సాయంత్రం ప్రారంభమైన సిరిమానోత్సవం అంబరాన్ని తాకింది. సరిగ్గా మూడున్నర గంటలకు మొదలైన సిరిమానోత్సవం సాయంత్రం వరకు సాగింది. చల్లంగ చూడుతల్లీ...పోలమాంబ... పాహిమాం... పోలమాంబ అంటూ భక్తుల నినాదాలతో గ్రామం మార్మోగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకపోవడంతో అధికారులుఊపిరి పీల్చుకున్నారు.

విజయనగరం, మక్కువ(సాలూరు): శంబర పోలమాంబ సిరిమానోత్సవం భక్తజన సంద్రం నడుమ మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా భక్తుల విశ్వాసం చూరగొన్న పోలమాంబను దర్శించుకుని మొక్కుబడులు చెల్లించేందుకు లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు ఇతర రాష్ట్రాలనుంచి కూడా భక్తులు బస్సులు, ప్రత్యేక వాహనాల ద్వారా తరలివచ్చా రు. అమ్మవారిని దర్శించుకునేందుకు వేకువఝామునుంచే క్యూలైన్లలో బారులు తీరారు. మధ్యాహ్నం 3.25గంటలకు పూజారి జన్ని పేకాపు జగది అలియాస్‌ భాస్కరరావు సిరిమానును అధిరోహించారు. గతేడాది కంటే ఈ ఏడాది 20నిమిషాలు ఆలస్యంగా సిరిమానోత్సవం మొదలైంది.

అంత కుముందు జన్నివారి ఇంటినుంచి ఘటాలను సిరి మాను ఉండే ప్రదేశానికి తీసుకువచ్చారు. ప్రధానాలయం నుంచి అమ్మవారు వచ్చే మార్గంలో నేలపై చీరలు పరచి వాటిపై చిన్నారులను పడుకోబెట్టగా వారిపై అమ్మవారి ఘటాలు దాటుతూ వెళ్లడంతో భక్తులు పులకించిపోయారు. జన్నివారి ఇంటినుంచి ఘటాలను గిరడ వారింటికి, ఆ తరువాత మునసబు, కరణం ఇళ్లకు తీసుకువెళ్లి పూజ లు జరిపించారు. ఆ వెనుక సిరిమాను ఆనవాయి తీ ప్రకారం గిరడ వారింటికి, ఆ తరువాత మునసబు, కరణం ఇళ్లకు వెళ్లి మొక్కులు అందుకున్నా రు. అక్కడి నుంచి పణుకువీధి, గొల్లవీధి, జన్నివీధుల మీదుగా సిరిమాను ఊరేగించి, సాయంత్రం 5.35 గంటలకు ప్రధాన రహదారి వద్దకు చేరుకుంది.

పోటెత్తిన భక్తజనం
ఉత్సవాన్ని తిలకించేందుకు ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు ఒడిశా, చత్తీస్‌గఢ్, రాష్ట్రాల నుంచి కూ డా అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉద యం 10గంటల తరువాత భక్తులు అధిక సంఖ్య లో తరలిరావడంతో గ్రామం కిటకిటలాడింది. గ్రామంలోని రహదారులన్నీ రద్దీగా మారాయి. గతేడాది కంటే ఈసారి భక్తులు పెద్దసంఖ్యలో వచ్చినట్టు అధికారులు గుర్తించారు. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా అధికారులు సమన్వయంతో పనిచేసి క్యూలైన్ల ఏర్పాటు, బస్సుల రాకపోకలు, ట్రాఫిక్‌ మళ్లింపు వంటి చర్యలు పక్కాగా అమలు చేయడంతో భక్తులకు ఎలాటి ఇబ్బందులు కలగలేదు.

పక్కాగా ఏర్పాట్లు
క్యూలైన్లలో ఉండే భక్తులకు దేవాదాయశాఖ సిబ్బంది, సత్యసాయి సేవా సమితి కమిటీ, పోలీస్‌శాఖ వాటర్‌ ప్యాకెట్లు సరఫరా చేయడంతో ఉపశమనం కలిగింది. పార్వతీపురం సబ్‌కలెక్టర్‌ టి.ఎస్‌.చేతన్, ఐటీడీఏ పీఓ లక్ష్మీశ, ఓఎస్‌డీ రామమోహనరావు,  ఏఎస్పీ సుమిత్‌గార్గ్‌ ఎప్పటికప్పుడు జాతరపై సమీక్షలు నిర్వహిస్తూ అధికారులకు తగు సూచనలు చేయడం మంచి ఫలితాలనిచ్చింది. ఈ ఏడాది పెద్ద పెద్ద పెండాల్స్‌తోపాటు పక్కాగా క్యూలైన్లను ఏర్పాటు చేశారు. సమీపంలోనే తలనీలాలు సమర్పించే శిబిరం, దుస్తులు మార్చుకునే గదులు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయడంతో భక్తులు ఇబ్బంది పడలేదు. ప్రత్యేక దర్శనం క్యూలైన్‌ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంతో పాటు, గంటకో మారు వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులకు ప్రత్యేకదర్శనం క్యూలైన్‌ ద్వారా పంపించారు.

పోలీసుల సేవలు భేష్‌
అమ్మవారి జాతరలో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది రాకూడదని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓఎస్‌డీ రామ్మోహన్, ఏఎస్పీ సుమిత్‌ పర్యవేక్షణలో 600 మంది పోలీసులను నియమించారు. రోప్‌ పార్టీ, స్పెషల్‌ పార్టీ, క్రైంపార్టీలు సక్రమంగా విధులు నిర్వర్తించాయి. దొంగతనాల వంటి సంఘటనలు చోటు చేసుకోకుండా రెండు డ్రోన్‌ కెమెరాలు, 25 చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సిరిమాను వద్ద రోప్‌పార్టీ భక్తులను నెట్టడంతో, సిరిమానును, పూజారిని తాకలేకపోయామని భక్తులు వాపోతున్నారు.

సంతృప్తినిచ్చిన ఆర్టీసీ సేవలు
భక్తుల సౌకర్యార్థం ఈ ఏడాది ఆర్టీసీ సంతృప్తికరమైన సేవలు అందించింది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని ఏడు డిపోల నుంచి మంగళవారం 130 బస్సులను జాతర కోసం వేశారు. బొబ్బిలి, పార్వతీపురం నుంచి వచ్చిన ప్రైవేటు వాహనాలను చెముడు గ్రామం మీదుగా మళ్లించడం వల్ల కొంత ట్రాఫిక్‌ను నియంత్రించారు. సాలూరు నుంచి మామిడిపల్లి మీదుగా కేవలం ఆర్టీసీ బస్సులను మాత్రమే విడిచిపెట్టి, ఇతర వాహనాలను కందులపథం మీదుగా పంపించడంతో ట్రాఫిక్‌ సమస్య తగ్గింది.  

గ్రామానికి కలెక్టర్‌ వరాలు
కలెక్టర్‌ హరిజవహర్‌లాల్, సబ్‌కలెక్టర్‌ టి.ఎస్‌.చేతన్, ఐటీడీఏ పీఓ, ఓఎస్‌డీ రామమోహణరావు, ఏఎస్పీ సుమిత్‌గార్గ్, దేవదాయశాఖ డిప్యూటీ కమిషనర్‌ ఎస్‌.వి.ఎస్‌.ఎన్‌.మూర్తి జాతరలో పర్యటించారు. అన్ని కంట్రోల్‌రూమ్‌లను పరిశీలించి, భక్తులకు అందిస్తున్న సేవలు, సదుపాయాలపై ఆరాతీశారు. కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ మీడియాతో మాట్లాడుతూ పారిశుద్ధ్యపనులు ఎప్పటికప్పు డు సక్రమంగా జరిపిస్తున్నారని ప్రశంసించారు. అన్నిశాఖల అధికారులతో మాట్లాడి, అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు మరింత మెరుగైన సేవలందించేలా చర్యలు చేపడుతున్న ట్లు తెలిపారు. అమ్మవారి గురించి డాక్యుమెంటరీ చేస్తున్నట్లు వెల్లడించారు. సిరిమాను తిరిగే వీధుల్లో రహదారి విస్తరణతోపాటు కాలువల ఏర్పాటు కు రూ. 35లక్షలు ఐటీడీఏ నుంచి అందిస్తామని ప్రకటించారు. ఎలక్షన్‌కోడ్‌ రాకముందే పనులు జరిపించాలని మాజీ సర్పంచ్‌ బడ్రాజు త్రినాథకు తెలిపారు. మామిడిపల్లి గ్రామం వద్ద మిగిలిన రెండు కిలోమీటర్ల రహదారి పనులకోసం 80లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. వైద్యశిబిరాల ను డీఎంఅండ్‌హెచ్‌ఓ కె.విజయలక్ష్మి పరిశీలించారు.

ప్రముఖుల తాకిడి
గ్రామానికి చేరుకున్న జిల్లా కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ దంపతులకు అధికారులు  ఘన స్వాగతం పలికారు. పులివేషధారులు వారి ముందు కాసేపు ఆటలాడారు. పోలమాంబ అమ్మవారిని కలెక్టర్‌ దంపతులు దర్శించుకున్నారు. దేవాదాయశాఖాధికారులు అమ్మవారికి ప్రత్యేకపూజలు జరిపిం చారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ శోభాస్వాతిరాణి కుటంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. పార్వతీపురం ఎమ్మెల్యే చిరంజీవులు, ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, సాలూరు మాజీ ఎమ్మెల్యే ఆర్‌పీ భంజ్‌దేవ్, తదితరులు అమ్మవారిని దర్శించుకున్నవారిలో ఉన్నారు.

అధికారుల సేవలు అద్భుతం
సాలూరు రూరల్‌: శంబర పోలమాంబ జాతరలో అధికారులు ప్రశంసనీయమైన సేవలు అందించారు. ఉపవాసంతో వచ్చి అమ్మవారిని దర్శించుకునే భక్తులకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా డీఎమ్‌హెచ్‌ఓ విజయలక్ష్మి, డిప్యూటీ డీఎమ్‌హెచ్‌ఒ రవికుమార్‌రెడ్డి సూచనల మేరకు 84 మంది అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తించారు. జాతరలో 5 మెడికల్‌ క్యాంపులు నిర్వహించారు. సుమారు 550 మంది భక్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందించినట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. 600మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటుచేసినట్టు పార్వతీపురం ఏఎస్సీ సుమిత్‌ గార్గ్‌ తెలిపారు. శంబర నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతం కావడంతో 5 ప్రత్యేక బలగాలు కూంబింగ్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు