వాత పెట్టినా.. పాత బుద్ధే..

29 Jul, 2019 10:24 IST|Sakshi
రేవులో ఇసుక తీసుకువచ్చే నావలు 

 ఆగని టీడీపీ నేతల ఇసుక మేత

పర్మిట్ల ముసుగులో దర్జాగా దోపిడీ

‘వాత పెట్టినా పాత బుద్ధి మారని చందం’గా టీడీపీ నేతల దందా కొనసాగుతోంది. టీడీపీ సర్కారు హయాంలో జిల్లాలో ఇసుక మాఫియా చెలరేగిపోయి.. కోట్ల రూపాయలు కొల్లగొట్టిన తీరును గమనించిన ప్రజలు.. సార్వత్రిక ఎన్నికల్లో గట్టి గుణపాఠం చెప్పారు. అయినప్పటికీ అవకాశం దొరికితే అదే పంథాను అవలంబిస్తామంటున్నారు ‘పచ్చ’నేతలు. ఇందుకు తాజాగా సాగిస్తున్న ఇసుక అక్రమ రవాణాయే ఉదాహరణగా నిలుస్తోంది.

సాక్షి, రాజమహేంద్రవరం : ఇసుక దోపిడీని అరికట్టాలనే ఉద్దేశంతో ఈ విధానంలో సమూల మార్పులు తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. దీనిపై త్వరలో విధానపరమైన నిర్ణయం తీసుకోనున్నారు. ఈలోగా సామాన్య, మధ్యతరగతి ప్రజలు నిర్మించుకునే ఇళ్లకు, ప్రభుత్వ పరంగా సాగే నిర్మాణాలకు ఇసుక కొరత రాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి జిల్లాలోనూ పరిమిత సంఖ్యలో ర్యాంపులకు అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగా మన జిల్లాలోని రాజమహేంద్రవరంలో 2, తాళ్లరేవు మండలం పిల్లంకలో 1 చొప్పున ఇసుక ర్యాంపులకు అనుమతి ఇచ్చా రు. పిల్లంక ఇసుక ర్యాంపును తన గుప్పెట్లో పెట్టుకున్న ఓ బడా కాంట్రాక్టర్‌.. ఇదే అదునుగా టన్నుల కొద్దీ ఇసుకను అడ్డగోలుగా దోచుకుపోతున్నాడు. టీడీపీ ప్రభుత్వంలో హోం మంత్రిగా పని చేసిన నిమ్మకాయల చినరాజప్పకు బినామీగా వ్యవహరించిన సదరు కాంట్రాక్టర్‌ గుత్తాధిపత్యమే పిల్లంక రేవులో ఇంకా నడుస్తోంది. వాస్తవానికి పిల్లంక ర్యాంపును గోవలంక బోట్స్‌మెన్‌ సొసైటీ మత్స్యకారులకు అప్పగించారు. గోదావరిలో ఇసుక తీసేందుకు, లారీల్లో ఎగుమతికి అయ్యే ఖర్చుల వరకూ తీసుకునేందుకు మాత్రమే అనుమతి ఇచ్చారు. కానీ మాజీ మంత్రి బినామీ ఈ ర్యాంపు నుంచి నిత్యం 25 పడవల ద్వారా ఇసుకను తరలిస్తూ దోపిడీకి పాల్పడుతున్నాడు.

పర్మిట్‌ ఒకచోటకు.. తరలింపు మరోచోటకు..
కాకినాడ పోర్టు సమీపాన దేవీ ఇంజినీరింగ్‌ వర్క్స్‌ అవసరాల కోసమంటూ 5 వేల క్యూబిక్‌ మీటర్ల ఇసుకకు ఈ నెల 17న కాకినాడ రెవెన్యూ డివిజనల్‌ అధికారులు పర్మిట్‌ ఇచ్చారు. దీనిని అవకాశంగా తీసుకున్న సదరు బినామీ.. నిర్దేశించిన ప్రాంతానికి మొక్కుబడిగా ఇసుక తరలించి, మూడు వంతులు పైగా ఇసుకను బయటి మార్కెట్‌లో అమ్మేస్తున్నాడు. ఇలా నిత్యం రూ.లక్షల విలువైన ఇసుకను అక్రమంగా కొల్లగొడుతున్నారు. ఈవిధంగా గడచిన ఆరేడు రోజులుగా రూ.అర కోటి విలువైన ఇసుక దోపిడీ జరిగినట్టు తెలుస్తోంది. మరోపక్క తాము పర్మిట్‌ తెచ్చుకున్నా ఇసుక దొరకడం లేదని ప్రభుత్వ కాంట్రాక్టులు చేస్తున్న వారు లబోదిబోమంటున్నారు. ఇసుక కోసం వచ్చి, గంటల తరబడి వేచిచూసి చూసి, ఖాళీ లారీలతో తిరిగి వెళ్లిపోవాల్సి వస్తోందని చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు ప్రేక్షక పాత్రకే పరిమితమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి ఇసుక దోపిడీపై పలువురు ఇటీవల అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా రాజమహేంద్రవరం రీచ్‌లలో ఇసుకకు అధికంగా డబ్బులు అడుగుతున్నారని, దీనిపై ప్రజలు గొడవ చేశారు.

ఇసుక దోపిడీపై విచారణ జరిపిస్తాం
పిల్లంక రీచ్‌లో ప్రజలకు ఇసుక ఇవ్వడం లేదనే ఫిర్యాదు వచ్చింది. దీనిపై విచారణ జరిపిస్తాం. ఈ రీచ్‌ను గోవలంక బోట్స్‌మెన్‌ సొసైటీ నిర్వహిస్తోంది. సొసైటీ సభ్యులే పడవల్లో ఇసుకను తీసుకొచ్చి అమ్ముకుంటారు. తహసీల్దార్‌ పర్యవేక్షణలో వీఆర్వోను ఏర్పాటు చేసి ఇసుక ఇస్తున్నాం.
– బి.రాజకుమారి, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌–2

మరిన్ని వార్తలు