నీ ఇష్టం.. ఎలాగైనా పరీక్ష రాసుకో

12 Apr, 2018 03:55 IST|Sakshi
విశాఖలోని ఎన్‌ఐవోఎస్‌ పరీక్ష కేంద్రం

     నేషనల్‌ ఓపెన్‌ స్కూల్‌ పరీక్షల్లో అడ్డగోలు వ్యవహారాలు

     రూ 40 వేలిస్తే ఎన్‌ఐవోఎస్‌ బంపర్‌ ఆఫర్‌

     నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు కళాశాలల్లో పరీక్షల నిర్వహణ

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: వివిధ కారణాలతో పదో తరగతి, ఇంటర్మీడియెట్‌లను అర్ధాంతరంగా ఆపేసిన విద్యార్థులకు ఒకే సిట్టింగ్‌లో ఆయా పరీక్షలు రాసే అవకాశం కల్పిస్తోంది.. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్‌ (ఎన్‌ఐవోఎస్‌). కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోని సంస్థ కావడంతో ఎన్‌ఐవోఎస్‌ నిర్వహించే పరీక్షలకు విద్యార్థులు పోటెత్తుతున్నారు. ఇదే అదనుగా ఎన్‌ఐవోఎస్‌లో పనిచేసే కొందరు అక్రమాలకు తెరలేపారు. పరీక్ష కేంద్రాల నిర్వాహకులతో కుమ్మక్కై ఇష్టారాజ్యంగా పరీక్షలను నిర్వహిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. బుధవారం నుంచి విశాఖలోని ఆరు కేంద్రాల్లో ఎన్‌ఐవోఎస్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. సాక్షి ప్రతినిధి.. ద్వారకానగర్‌ సమీపంలోని శ్రీ కాశ్యప్‌ కళాశాలకు వెళ్లగా పరీక్షలు ఇష్టారాజ్యంగా జరుగుతున్న సంగతి వెలుగుచూసింది.

ప్రైవేటు కళాశాలల్లో పరీక్షలు
వాస్తవానికి.. ఎన్‌ఐవోఎస్‌ పరీక్షలను కేంద్రీయ విద్యాలయాలు, జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో నిర్వహించాలి. కానీ విశాఖ ఎన్‌ఐవోఎస్‌ కేంద్రం నిర్వాహకులు మూడు ప్రైవేటు విద్యా సంస్థల్లో పరీక్షల నిర్వహణకు అనుమతిచ్చారు. ఈ ఏడాది విశాఖ ద్వారకానగర్‌ సమీపంలోని శ్రీ కాశ్యప్‌ జూనియర్‌ కళాశాల, ఫోర్త్‌ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ సమీపంలోని మినర్వా స్కూల్, సబ్బవరం బీఎంకే కాలేజీల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. 

అక్కడంతా గప్‌చుప్‌
ఈ నెల 4 నుంచి సీనియర్‌ సెకండరీ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం ఫిజిక్స్, హిస్టరీ పరీక్షలు నిర్వహించారు. వాస్తవానికి పరీక్షా సమయం మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు. అయితే శ్రీ కాశ్యప్‌ కాలేజీలో ఉదయం పదిన్నర గంటల నుంచే ‘మూకుమ్మడి’ పరీక్షలు నిర్వహించేశారు. మూడంతస్తుల చిన్న బిల్డింగ్‌లో కళాశాల నిర్వహిస్తున్న నిర్వాహకులు.. ఇతరులెవరూ లోనికి రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు.

సమాచారం సేకరించేందుకు వెళ్లిన సాక్షి ప్రతినిధిని కనీసం కళాశాలలోకి కూడా ప్రవేశించకుండా అడ్డుకున్నారు. ఎలాగోలా లోనికి వెళ్లి కళాశాల డైరెక్టర్‌ నారాయణమూర్తిని కలసి పరీక్షల తీరును ప్రస్తావించగా.. స్క్వాడ్‌ రాకుంటే విద్యార్థుల ఇష్టమే.. తనిఖీలకు ఎవరూ రాకుండా ఉంటే మనం ఏదైనా చేయొచ్చు అని చెప్పుకొచ్చారు. అప్పటికే అక్కడికి చేరుకున్న విద్యార్థులతో మాట్లాడగా.. ‘పరీక్ష ఏముందండి.. ఎన్‌ఐవోఎస్‌ అడ్మిషన్‌ ఫీజు రూ.2500, పరీక్ష ఫీజు రూ.3500.. ఈ సెంటర్‌లో ఎగ్జామ్‌ రాసేందుకు రూ.30 వేలు నుంచి రూ.40 వేలు ఇస్తే ఇంటర్మీడియేట్‌ సర్టిఫికెట్‌ వచ్చేస్తుంది’ అని చెప్పడం గమనార్హం. 

మరిన్ని వార్తలు