రేపే గ్రామ సచివాలయ పరీక్ష

31 Aug, 2019 08:43 IST|Sakshi

సాక్షి, ఒంగోలు సిటీ :  సచివాలయం పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ప్రశ్నపత్రాలు జిల్లాకు చేరాయి. కలెక్టరేట్‌లోని స్ట్రాంగ్‌రూంలో భద్రపరిచారు. జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగాల పరీక్షల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కలెక్టర్‌ పోలా భాస్కర్‌ అధ్యక్షతన కమిటీ ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. సమర్థమంతంగా పరీక్షలను జరపడానికి భారీగా సిబ్బందిని నియమించారు. జిల్లాలోని 1038 పంచాయతీల్లో 864 గ్రామ సచివాలయాలు గుర్తించారు. వార్డు సచివాలయాలు ఒంగోలు కార్పొరేషన్‌ 70, చీరాల మున్సిపాలిటీ 24, కందుకూరు మున్సిపాలిటీ 16, మార్కాపురం మున్సిపాలిటీ 20, అద్దంకి నగర పంచాయతీ 10, గిద్దలూరు నగర పంచాయతీ 10, చీమకుర్తి నగర పంచాయతీ 8, కనిగిరి నగర పంచాయతీ 12 సచివాలయాలు ఉన్నాయి. 

పరీక్షల షెడ్యూలు ఇదే..
సెప్టెంబర్‌ ఒకటో తేదీ నుంచి 8వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. 2, 5 తేదీలు మినహా మిగిలిన తేదీల్లో నిర్వహించే పరీక్షల షెడ్యూలును ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
⇔ 1వ తేదీ ఉదయం పంచాయతీ సెక్రటరీ గ్రేడ్‌–5, మహిళా పోలీసు, సంక్షేమ విద్యా కార్యదర్శి( గ్రామీణ), వార్డు పరిపాలనా కార్యదర్శి.
⇔ 1 మధ్యాహ్నం పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌–6, డిజిటల్‌ అసిస్టెంట్‌
⇔ 2వ తేదీ సెలవు
⇔ 3వ తేదీ ఉదయం వీఆర్వో, సర్వే అసిస్టెంట్‌
⇔ 3న మధ్యాహ్నం ఎఎన్‌ఎం/వార్డు హెల్త్‌ అసిస్టెంట్‌
⇔ 4 ఉదయం విలేజి అగ్రికల్చర్‌ సెక్రటరి
⇔ 4వ తేదీ మధ్యాహ్నం విలేజీ హార్టికల్చర్‌ సెక్రటరి
⇔ 6వ తేదీ ఉదయం విలేజి ఫిషరీస్‌ అసిస్టెంట్‌
⇔ 6వ తేది మధ్యాహ్నం పశుసంవర్ధక  అసిస్టెంట్‌
⇔ 7వ తేదీ ఉదయం ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ (గ్రేడ్‌–2), వార్డు ఎమినిటీస్‌ సెక్రటరి
⇔ 7వ తేదీ మధ్యాహ్నం విలేజి సెరీకల్చర్‌ అసిస్టెంట్‌
⇔ 8 ఉదయం వార్డు ప్లానింగ్‌ అండ్‌ రెగ్యులేషన్‌ సెక్రటరి, వార్డు వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెక్రటరి
⇔ 8న మధ్యాహ్నం వార్డు ఎడ్యుకేషన్‌ అండ్‌ డేటా ప్రాసెసింగ్‌ సెక్రటరి, వార్డు శానిటేషన్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ కార్యదర్శి (గ్రేడు–2)
⇔ గ్రామ,వార్డు సచివాలయంలోని 14 రకాల రాత పరీక్షలు నిర్వహిస్తున్నారు. పది రాత పరీక్షలకు తెలుగు, ఇంగ్లిషు ప్రశ్నపత్రాలు ఉంటాయి.

1,33,503 మంది
సచివాలయం పోస్టులకు జిల్లాలో మొత్తం 1,33,503 మంది పరీక్షకు హాజరుకానున్నారు. తొలిరోజు 99,804 మంది పరీక్షలు రాయనున్నారు. జిల్లాలోని వివిధ కేంద్రాల నుంచి దరఖాస్తు చేసిన వారికి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాటు చేశారు. 
► అన్ని పరీక్షలకు 370 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. తొలిరోజు ఉదయం జరిగే పరీక్షకు 236 కేంద్రాలు, మధ్యాహ్నం పరీక్షకు 35 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 99,804 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తారు.
► 3న ఉదయం 29 కేంద్రాలు, మధ్యాహ్నం 6 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 14,746 మంది పరీక్ష రాస్తారు.
► 4వ తేదీన ఉదయం 6 కేంద్రాలు, మధ్యాహ్నం ఒకటి కేంద్రం ఏర్పాటు చేశారు. 2470 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తారు.
► 6న ఉదయం 4 కేంద్రాలు, మధ్యాహ్నం ఒకటి కేంద్రం ఏర్పాటు చేశారు. 1672 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తారు.
► 7 ఉదయం 19 కేంద్రాలు, మధ్యాహ్నం ఒకటి కేంద్రం ఏర్పాటు చేశారు. 7396 మంది పరీక్ష రాస్తారు.
► 8వ తేదీన ఉయదం 5 కేంద్రాలు, మధ్యాహ్నం 27 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 11,980 మంది అభ్యర్థులు పరీక్ష రాసే విధంగా సౌకర్యాన్ని కల్పించారు.
► మొత్తం 1692 మంది దివ్యాంగులు పరీక్ష రాయడానికి దరఖాస్తు చేసుకున్నారు.

స్ట్రాంగ్‌రూం కలెక్టరేట్‌లో..
ప్రశ్నపత్రాలను భద్రపరచడానికి కలెక్టరేట్‌లోని సీపీవో హాలును స్ట్రాంగ్‌రూంగా వినియోగిస్తున్నారు. ఇక్కడ భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నెల 31వ తేదీన ఆయా కేంద్రాల చీఫ్‌ సూపరింటెండెంట్లు పంచాయతీ సెక్రటరీ పరీక్ష పత్రాలను చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. విధుల్లో ఉన్న వారికి వివిధ కేటగిరీల వారికి ఎనిమిది రకాల గుర్తింపు కార్డులను జారీ చేశారు. 

కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా స్థాయి కమిటీ
సచివాలయం పరీక్షల ప్రక్రియ పూర్తయ్యే వరకు కలెక్టర్‌ పోలా భాస్కర్‌ అధ్యక్షతన జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటయ్యింది. కమిటీ ఉపాధ్యక్షులుగా ఎస్పీ సిద్దార్థ కౌశల్, జేసీ సగిలి షన్మోహన్‌ ఉంటారు. మెంబర్‌ కన్వీనర్‌గా జెడ్పీ సీఈవో(జెడ్పీ ఉప సీఈవో)సభ్యులుగా జేసీ–2, వ్యవసాయశాఖ జేడీ, పశుసంవర్థకశాఖ జేడీ, ఉద్యాన, మత్స్య, పట్టుపరిశ్రమ డీడీలు, సర్వే ల్యాండ్‌ రికార్ఢ్స్‌ ఏడీ, పీఆర్‌ ఎస్‌ఈ, సాంఘికసంక్షేమ శాఖ డీడీ, అదనపు ఎస్పీ (అడ్మిన్‌), జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా విద్యాశాఖాధికారి, స్త్రీశిశుసంక్షేమ శాఖ పీడీలు కమిటీలో ఉన్నారు.

హాల్‌ టికెట్లు జారీ
హాల్‌ టికెట్లను ఈ నెల 22 నుంచి ఆన్‌లైన్‌లో ఉంచారు. హాల్‌ టికెట్లను డౌన్‌లోడు చేసుకోవచ్చని వెబ్‌ సైట్‌ జారీ చేశారు. మారుమూల గ్రామాల వారికి ఇంటర్నెట్‌ సదుపాయం సరిగా లేనందున వారి సౌకర్యం కోసం అభ్యర్థుల హాల్‌ టికెట్లను మండల కంప్యూటర్‌ సెంటర్‌ (ఎంసీసీ) నుంచి డౌన్‌లోడు చేసుకొనే వెసులుబాటు కల్పించారు. అభ్యర్థులు వారి వ్యక్తిగత గుర్తింపు కార్డు తీసుకెళ్లి మండల కంప్యూటర్‌ సెంటర్‌ నుంచి ఉపాధిహామీ ఆపరేటర్‌ నుంచి ఎటువంటి రుసుం లేకుండా హాల్‌ టికెట్లను డౌన్‌లోడు చేసుకొనే వెసులుబాటు కల్పించారు.

పర్యవేక్షణాధికారుల నియామకం
పరీక్షల నిర్వహణ పకబ్బందీగా పర్యవేక్షించేందుకు 23 మంది జిల్లా అధికారులను పర్యవేక్షణాధికారులుగా నియమించారు. ప్రతి రూట్‌లో ఐదు పరీక్ష కేంద్రాలు  ఉండేలా చర్యలు తీసుకున్నారు. రూట్‌ అధికారులుగా ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మండల విద్యాశాఖాధికారులను నియమించారు.  ఒక రోజు ముందుగానే ప్రశ్నపత్రాలను ఓఎంఆర్‌ షీట్లను తరలించి కేంద్రానికి దగ్గరలోని పోలీసు స్టేషన్‌లోని స్ట్రాంగ్‌ రూంలో భద్రపరచాలి. 

సహాయక కేంద్రాలు
జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయం పరీక్షలకు సంబంధించి ఎలాంటి సమాచారం కావాలన్నా కలెక్టరేట్‌లో సహాయత కేంద్రం ఏర్పాటు చేశారు. 08592– 222210, 08592–281400ను సంప్రదించి ఎలాంటి సమాచారాన్నైనా పొందే వీలుంది. ఎవరైనా స్పందించకపోతే డీఆర్వో సెల్‌ నెంబర్‌ 8886616004ను సంప్రదించి ఫిర్యాదు చేయవచ్చు.

బందోబస్తుకు మహిళా సిబ్బంది
సచివాలయ పరీక్ష కేంద్రాల వద్ద మహిళా సిబ్బందితో బందోబస్తు నియమించారు. జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ బందోబస్తుకు చర్యలు తీసుకున్నారు. మొత్తం మహిళా సిబ్బంది 262 మంది కావాల్సి ఉండగా వీరిలో 137 మంది మహిళా సిబ్బంది అందుబాటులో ఉన్నారు. మిగిలిన 125 మందిని అంగన్‌వాడీ ఇతర సంస్థల నుంచి తీసుకున్నారు. ఒంగోలు 115, చీరాల 33, కందుకూరు 29, దర్శి 41, మార్కాపురం సబ్‌ డివిజన్‌ నుంచి 44 మహిళా సిబ్బందిని  బందోబస్తుకు నియమించారు.

పరీక్షల నిర్వహణకు యంత్రాంగం
పరీక్షల నిర్వహణకు యంత్రాంగాన్ని నియమించారు. మొత్తం కేంద్రాలకు ఇన్విజిలేటర్లుగా 4,500 మందిని నియమించారు. సూపర్‌వైజర్లుగా వెయ్యి, ప్రత్యేకాధికారులు, చీఫ్‌ సూపరింటెండెంట్లు 800 మంది, ప్రశ్నాపత్రాలను భద్రపరిచే స్ట్రాంగ్‌రూంల వద్ద వంద మంది, రూట్‌ ఆఫీసర్లుగా వంద మంది, అంగన్‌వాడీ వర్కర్లు, హోంగార్డులు 500 మందిని నియమించారు. పరీక్షల నిర్వహణకు సుమారు 500 వాహనాలను వినియోగిస్తున్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా