ఆలస్యం ఖరీదు ఓ నిండు ప్రాణం

2 Mar, 2018 11:29 IST|Sakshi
వేణుగోపాలనాయర్‌ మృతదేహం వద్ద భార్య తులసి

స్పందించని 108 వాహనం సిబ్బంది

గుండెపోటుతో స్కూల్‌  ప్రిన్సిపాల్‌ మృతి  

దాచేపల్లి:108 వాహనం సిబ్బంది సకాలంలో స్పందించకపోవటంతో ఓ వ్యక్తి  ప్రాణాలు కోల్పోయాడు. దాచేపల్లిలోని స్కాలర్స్‌ ఇంటర్నేషనల్‌ స్కూలు ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్న  వి. తులసీ భర్త వేణుగోపాల్‌ నాయర్‌(62) గురువారం ఉదయం గుండెనొప్పిగా ఉందని చెప్పారు. 108 వాహనం ద్వారా పిడుగురాళ్లకు తరలించేందుకు కాల్‌ సెంటర్‌కు సమాచారం అందించారు. అక్కడ నుంచి సకాలంలో వాహన సిబ్బందికి సమాచారం అందలేదు. దీంతో కంగారుపడి ఆటోలో గుండెనొప్పితో బాధపడుతున్న వేణుగోపాల్‌నాయర్‌ను ఎక్కించుకుని వాహనం పార్కింగ్‌ చేసిన తహసీల్దార్‌ కార్యాలయం వద్దకు తీసుకెళ్లారు.

వాహనాన్ని తీసుకు రావాలని స్థానికులు, తులసి కోరినా పట్టించుకోలేదు. వాహనం బాగోలేదని, జీతాలు ఇవ్వటం లేదని, డ్రైవర్‌ లేడని సిబ్బంది సాకులు చెప్పారు. తర్వాత వేణుగోపాల్‌ నాయర్‌ను కారులో పిడుగురాళ్లకు తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. 108 వాహనం సకాలంలో వచ్చి ఉంటే తన భర్త బతికేవాడని తులసి వాపోయారు. వాహనం రాకపోకవటం వల్లే వేణుగోపాల్‌ నాయర్‌ మృతి చెందాడని స్థానికులు కూడా ఆరోపించారు. ఆయన భౌతికకాయాన్ని స్కూల్‌ చైర్మన్‌ జి.పి.రెడ్డి, డైరెక్టర్‌ పకీరారెడ్డి, ఇన్‌చార్జి ఎం. మల్లారెడ్డితో పాటుగా ఉపాధ్యాయులు, విద్యార్థులు సందర్శించి నివాళ్లర్పించారు. వేణుగోపాల్‌ నాయర్‌ అంత్యక్రియల కోసం స్వస్థలం కేరళకు అంబులెన్స్‌లో తరలించే ఏర్పాట్లు స్కూల్‌ యజమాన్యం చేసింది.

మరిన్ని వార్తలు