సీమాంధ్రకు తీరని అన్యాయం

1 Aug, 2013 03:06 IST|Sakshi
సీమాంధ్రకు తీరని అన్యాయం
కాంగ్రెస్ పార్టీ తన స్వార్థ రాజకీయాల కోసం కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు తీరని అన్యాయం చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి  రాంబాబు మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ కేవలం ఓట్లు, సీట్ల ప్రాతిపదికన రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు సిద్ధమైందని... అందుకు తగిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని వ్యాఖ్యానించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం అంబటి రాంబాబు విలేకరులతో మాట్లాడారు. ‘‘1953లో మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయినప్పుడు రాజధానిని పొగొట్టుకున్నాం. తర్వాత భాషాప్రయుక్త రాష్ట్రాలని తెరపైకి తేవడంతో కర్నూలును వదిలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా హైదరాబాద్‌ను ఏర్పాటు చేసేందుకు అంగీకరించాం. 1956 నుంచి ఇప్పటిదాకా హైదరాబాద్‌ను మా గడ్డగా భావించాం. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. అలాంటిది రాష్ట్రాన్ని విభజించి, హైదరాబాద్‌ను దూరం చేయడం ఎంత వరకు సమంజసం. సీమాంధ్రకు రాజధాని లేకుండా గందరగోళ పరిస్థితి సృష్టించారు’’ అని ఆయన పేర్కొన్నారు. ‘‘సీమాంధ్ర రాష్ట్రానికి రాజధాని లేదు! నీళ్లు లేవు. సాగర్ ఆయకట్టుకు నీళ్లు వస్తాయనే గ్యారంటీ లేదు. ఎక్కడ ఉండాలో దిక్కుతోచని పరిస్థితి ఉంది. విభజన చేసే ముందు వీటికి సమాధానమివ్వాలి’’ అని అంబటి కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌కు ప్రజల మనోభావాలతో సంబంధం లేదనేందుకు ఎన్నో ఉదాహరణలున్నాయని పేర్కొన్నారు. ఆ పార్టీకి తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉన్నట్లయితే 2009 డిసెంబర్ 9న ప్రకటన చేసి, ఇన్నాళ్లు ఎందుకు ఆగారని ప్రశ్నించారు. నాలుగేళ్లుగా రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చి, అన్ని రంగాల్లో దివాలా తీయించి.. ఎన్నికల ముందు సీట్లు, ఓట్ల లెక్కలు వేసుకోవడం దౌర్భాగ్యకరమని అంబటి మండిపడ్డారు.
 రాష్ట్రం చేసిన పాపం ఏమిటి?
 33 మంది ఎంపీలను అందించి, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటానికి కృషి చేయడమే ఆంధ్ర ప్రజలు చేసుకున్న పాపమా? అని అంబటి ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వంలో 33 బంగారు గుడ్లు పెట్టిన బాతును కాంగ్రెస్ అధిష్టానం అర్ధాంతరంగా కోసుకొని తింటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమాంధ్రకు తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆ పార్టీ నేతలు ఉద్యమం ఎలా చేస్తారని సూటిగా ప్రశ్నించారు. చిత్తశుద్ధి కలిగిన నాయకులైతే ఆ పార్టీకి, పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీమాంధ్ర నేతలు మంత్రి పదవులకు కక్కుర్తి పడినందువల్లే ఈ దుస్థితి నెలకొందని మండిపడ్డారు. ఆ పార్టీ తీరని ద్రోహాన్ని తలపెడుతుంటే ఆ పార్టీ నేతలు ప్రజలను మభ్యపెట్టడానికి డ్రామాలు చేస్తున్నారని అంబటి ధ్వజమెత్తారు. ‘‘ఒకాయన బ్రహ్మాస్త్రం సంధిస్తానంటారు. మరొకరు న్యాయస్థానాలకు వెళతామంటారు. ఏమిటీ పిచ్చిమాటలు..’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్‌కు రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలని పిలుపునిచ్చారు. 
 చంద్రబాబు కాంగ్రెస్‌లో ఉన్నారా? టీడీపీలో ఉన్నారా?
 రాష్ట్రానికి సంబంధించి సీడబ్ల్యూసీ చేసిన ప్రకటనకు కొనసాగింపుగానే టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడారని అంబటి రాంబాబు పేర్కొన్నారు. కొత్త రాష్ట్ర రాజధానికి నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు అవసరమవుతాయని, వాటిని కేంద్రమే భరించాలని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రాన్ని విభజించాలని లేఖ రాసిన సందర్భంలో చంద్రబాబు ఈ విషయాలను ఎందుకు ప్రస్తావించలేకపోయారని ప్రశ్నించారు. చంద్రబాబు ఏ ముఖం పెట్టుకొని ప్యాకేజీ గురించి మాట్లాడారని దుయ్యబట్టారు. చంద్రబాబు కాంగ్రెస్‌పార్టీలో ఉన్నారో టీడీపీలో ఉన్నారో చెప్పాలని ఎద్దేవా చేశారు. తెలుగు ప్రజల ఐక్యత కోసం ఎన్టీఆర్ ప్రయత్నిస్తే.. ఆయన వారసుడనని చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రం ఇంత ఘోరంగా తయారవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ, బాబేనని విమర్శించారు. 
 ఆ నేతలు ఏమయ్యారు?
 కేంద్రం డిసెంబర్ 9న ప్రకటన చేసిన తర్వాత మూకుమ్మడిగా రాజీనామాలు చేసేందుకు స్పీకర్ కార్యాలయం ముందు క్యూ కట్టిన కాంగ్రెస్, టీడీపీ నేతలు ఇప్పుడేమయ్యారని అంబటి ప్రశ్నించారు. జేడీ శీలం, కావూరి సాంబశివరావుకు మంత్రి పదవులు, రాయపాటికి పోలవరం ప్రాజెక్టు పనులు, లగడపాటిపై ఉన్న కేసులు ఎత్తేసే సరికి.. రాష్ట్రం ఏమైనా ఫరవాలేదనే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కొందరు నేతల నోళ్లు మూయించి, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అక్రమ కేసుల ద్వారా జైల్లో నిర్భందించి, రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందని దానికి ఆ పార్టీ తగిన మూల్యం చెల్లించక తప్పదని అంబటి హెచ్చరించారు. తెలంగాణకు తమ పార్టీ వ్యతిరేకం కాదని, అన్ని ప్రాంతాలకు న్యాయం జరగాలన్నదే మా కోరిక అని విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు బదులిచ్చారు. స్పష్టతలేనటువంటి విభజనను తాము వ్యతిరేకిస్తామని చెప్పారు.
మరిన్ని వార్తలు