విశాఖ వనితకు కొత్త శక్తి

26 Apr, 2019 11:52 IST|Sakshi
తమ వాహనాలపై శక్తి టీం సభ్యులు

రాష్ట్రంలో తొలిసారి నగరంలో శక్తి టీముల ఏర్పాటు

ఈ బృందంలో 35మంది మహిళా కానిస్టేబుళ్లు

గస్తీ కోసం వీరికి 5 కార్లు, 26 స్కూటర్లు

మహిళల రక్షణ, అవగాహనే ఈ బృందాల లక్ష్యం

మహిళలకు మరింత రక్షణ కల్పించడం.. భద్రతపై వారిలో అవగాహన కల్పించడమే లక్ష్యంగా పోలీసు శాఖలో కొత్తగా శక్తి టీములను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో తొలిసారి విశాఖలోనే ఈ బృందాన్ని గురువారం డీజీపీ ఆర్‌.పి.ఠాకూర్‌ ప్రారంభించారు. 35 మంది మహిళా కానిస్టేబుళ్లతో ఏర్పాటైన ఈ బృందానికి జీపీఎస్‌ తదితర అధునాతన సాంకేతిక వ్యవస్థతో కూడిన 5 కార్లు, 26 యాక్టివా స్కూటర్లు సమకూర్చారు. వీటిని 100, 1090 నెంబర్లతో అనుసంధానించారు. మహిళలకు సంబంధించి వీటికి వచ్చే ఫిర్యాదులకు శక్తి టీం సభ్యులు వెనువెంటనే స్పందించి సంఘటన స్థలానికి చేరుకుంటారు.

ద్వారకానగర్‌(విశాఖ దక్షిణ): మహిళలకు మరింత రక్షణకు గాను ‘శక్తి’ టీం మొబైల్‌ క్యాప్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు డీజీపీ ఆర్‌.పి.ఠాకూర్‌ తెలిపారు. ఆర్కేబీచ్‌లో పోలీస్‌ మెస్‌ వద్ద శక్తి టీం మొబైల్‌ క్యాప్స్‌ను సీపీ మహేష్‌చంద్రలడ్డాతో కలిసి ఆయన జెండా ఊపి గురువారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో 18 యూనిట్లతో శక్తి టీంలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విశాఖ నగరంలో 35 మంది మహిళా పోలీసులతో శక్తి టీం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీరికి 5 కార్లు, 26 హోండా యాక్టివ్‌ వాహనాలు అందుబాటులో ఉంటాయన్నారు. మహిళలపై దాడులు, ఈవ్‌ టీజింగ్‌లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాయన్నారు.

ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు సిబ్బంది విధులు నిర్వహిస్తారన్నారు. అలాగే ఈ టీంలు నగరంలో వివిధ విద్యా సంస్థల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తాయన్నారు. ఈ టీంలు పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ (డయల్‌–100, 1090) దగ్గరలో ఉన్న జీపీఎస్‌ వైరల్‌ సెట్‌ ద్వారా అనుసంధానమై ఉంటాయన్నారు. 35 మంది శక్తి టీం సభ్యులు విజయనగరంలోని పీటీసీలో 21 రోజులపాటు శిక్షణ పొందారని తెలిపారు. వీరికి టూ వీలర్, ఫోర్‌ వీలర్‌ వాహనాల డైవింగ్, ఆత్మరక్షణ, మహిళలపై జరిగే నేరాలపై తీసుకొనే చట్టపరమైన చర్యలపై శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. ఈ టీం సభ్యులు నీలం రంగు షర్ట్, ఖాకీ ప్యాంట్‌ యూనిఫారం కలిగి ఉంటారన్నారు. రాత్రి వేళ రెండు టీంలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాబోయే రోజుల్లో శక్తి టీంలు పెంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ రవీంధ్రబాబు, అదామ్‌ నయిన్‌ ఆశ్మీ, ఏడీసీపీలు, సురేష్‌బాబు, రమేష్‌కుమార్, శ్రీనివాస్, ఎ.వి.రమణ, ఏసీపీలు, ఆర్‌.శ్రీనివాస్‌రావు, పూర్ణచంద్రరావు, వై.వి.నాయుడు, మల్లేశ్వరరావు, కె.ప్రభాకర్, దేవప్రసాద్, టేకు మోహన్‌రావు, టాస్క్‌ఫోర్సు ఏసీపీ మహేంద్ర, ప్రవీణ్‌కుమార్, ఎం.ఆర్‌.కె.రాజు, త్రినా«థరావు, సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు