ప్రచారానికి పదును

25 Apr, 2014 00:20 IST|Sakshi
ప్రచారానికి పదును
  •  నియోజకవర్గ, మండల కేంద్రాల్లో కార్యాలయాల ఏర్పాటు
  •  ఎక్కువ ప్రాంతాల్లో పర్యటనకు ఏర్పాట్లు
  •  ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుస్తున్న అభ్యర్థులు
  •  దూసుకుపోతున్న వైఎస్సార్‌సీపీ
  •  విశాఖ రూరల్, న్యూస్‌లైన్: మహా సంగ్రామంలో తొలి అంకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. జిల్లాలో పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు ఖరారయ్యారు. పోటీ విషయంలో స్పష్టత వచ్చింది. ఎన్నికల రిటర్నింగు అధికారులు గుర్తులను కేటాయించారు. ఈమేరకు ఆయా పార్టీల అభ్యర్థులు ప్రచార సమరానికి గురువారం నుంచి పదును పెడుతున్నారు. ఇందుకు అవసరమైన సరంజామాను ఇప్పటికే సమకూర్చుకున్నారు.

    పార్టీల గుర్తులతో కూడిన జెండాలు, ప్రచార కరపత్రాలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే కొందరు ప్రచారాన్ని ముమ్మరం చేయగా మరికొందరు చాపకింద నీరులా సాగిస్తున్నారు. గ్రామాల్లోని కార్యకర్తలను సమన్వయపరిచేందుకు వీలుగా ప్రధాన పార్టీల అభ్యర్థులు నియోజకవర్గ, మండల కేంద్రాల్లో ఎన్నికల కార్యాలయాలను ప్రారంభించారు. ఇంకా పది  రోజులే గడువున్నందున వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో పర్యటించేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు.

    ప్రత్యేక వాహనాల్లో వెళ్లి తక్కువ సమయంలో ఎక్కువ మంది ఓటర్లను నేరుగా కలి సేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇంటింటికి వెళ్లి కలిసే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ బహుముఖపోటీ నెలకొంది. నర్సీపట్నం అసెంబ్లీ సెగ్మెంటులో మినహా మిగిలిన అన్నింటిలోనూ వైఎస్సార్‌సీపీతోపాటు, టీడీపీ, కాంగ్రెస్ ఇతర పార్టీల అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉపసంహరణలు ముగిసే సమయానికి నర్సీపట్నం కాంగ్రెస్ అభ్యర్తి అప్పలనాయుడు తన నామినేషన్‌ను అనూహ్యంగా ఉపసంహరించుకున్నారు.

    కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఊహించని పరిణామం ఎదురైంది. ఈ దశలో మిగతా పార్టీల కంటే  వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు జిల్లాలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఫ్యాన్‌గాలి ఉవ్వెత్తున వీస్తోంది. ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్నారు. టీడీపీ ఇంకా అసమ్మతిసెగలు, నిరసనలు,తిరుగుబాటుదారులతో అవస్థలు పడుతూనే ఉంది.జిల్లా మొత్తానికే ఎన్నికల ప్రచారం జోష్ పెరిగింది.
     

మరిన్ని వార్తలు