శేషాద్రుడి అక్రమాలు ఎన్నో..

11 Apr, 2014 02:59 IST|Sakshi

నెల్లూరు(టౌన్), న్యూస్‌లైన్: రాపూరులో హెచ్‌ఎంగా పనిచేస్తూ సస్పెండ్ అయిన శేషాద్రివాసు పనితీరు పరిశీలిస్తే అన్నీ అక్రమాలే కనిపిస్తున్నాయి. అయినా ఆయన్ను విద్యాశాఖ అధికారులు అందలమెక్కించారు. తనను ప్రశ్నించే వారి విషయంలో చిన్నచిన్న సాకులు చూపి సస్పెండ్ చేశారు. యూటీఎఫ్ నేత పరంధామయ్య సస్పెండ్‌ను వెంటనే రద్దు చేయాలని అపాయింటింగ్ అథారిటీ ఉన్న డీఈఓకు కలెక్టర్ గత నెల 28న ఆర్డర్ వేశారు. అయినప్పటికీ విద్యాశాఖ పట్టించుకోలేదు.


 శేషాద్రివాసు గురించి మరిన్ని వివరాలు
  సమాచార హక్కు చట్టం కింద ‘న్యూస్‌లైన్’ మరిన్ని వివరాలు సేకరించింది. కనుపర్తిపాడులో లెక్కలు మాస్టార్‌గా పనిచేస్తున్నప్పుడు ఈ హెచ్‌ఎం దీర్ఘకాలిక సెలవు పెట్టాడు. రిలీవ్ అయ్యేటప్పుడు, తిరిగి జాయిన్ అయ్యేటప్పుడు అక్కడి హెచ్‌ఎం ప్రొసీడింగ్స్ ఉండాలి. ప్రతి చిన్న విషయాన్ని ఎస్‌ఆర్‌లో (సర్వీసు రిజిస్టర్‌లో) నమోదు చేయాలి. కాని అలా జరగలేదు. సెలవులను దేని కింద ట్రీట్ చేశారో చూపకుండా జీతం పొందాడు.


  ఇదే స్కూల్లో ఉన్నప్పుడు ఓడీ(ఆన్‌డ్యూటీ) కింద పలుమార్లు వెళ్లాడు. కాని ఓడీకి కూడా జాయినింగ్, రిలీవింగ్ సర్టిఫికెట్స్ లేవు. దీర్ఘకాలిక సెలవులు పెట్టినందు వల్ల ఇంక్రిమెంట్ వెనక్కి వెళ్లాలి. కాని ప్రతి సంవత్సరం ఒకే టైమ్‌లో ఇంక్రిమెంట్ ఆగకుండా పొందడం విశేషం. ఎస్‌ఆర్‌లో ఆర్జిత సెలవుల అకౌంట్‌లో ఈఎల్ లీవులు అధికంగా, లోపల ఎస్‌ఆర్ ఎంట్రీలు తక్కువగా ఉండటం గమనార్హం,

  సీఎల్స్‌ను (సెలవులు) ఓడీగా దిద్దుకున్నారు.
  ఇదే పాఠశాలలో మొదట సీఎల్‌గా ఉన్న వాటిని రిజిస్టర్‌లో ఓడీగా దిద్దుకున్నారు. ఇలా జరగాలన్నా అక్కడి హెచ్‌ఎం ఇన్షియల్ ఉండాలి. కాని అలా లేదు. ఉదాహరణకు 2008, ఫిబ్రవరి 7, 8 తేదీల్లో ఇలా దిద్దారు. ఇలా దిద్దిన అనేక ఓడీల రిజిస్టర్‌లను సమాచార హక్కు చట్టం ద్వారా ‘న్యూస్‌లైన్’ సేకరించింది. కలెక్టర్  బహిరంగ విచారణ చేస్తే అనేక విషయాలు వెలుగులోకి వస్తాయి.


 రాపూరులో.. : రాపూరులో కూడా రికార్డులను తారు మారు చేశారనే అనుమానంతో రవికుమార్ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద వివరాలు కోరారు. ఏడు నెలలైనా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఇక్కడ తనకు అనుకూలంగా ఉన్న ఓ టీచర్‌ను వెంకటగిరిలో డిపార్ట్ మెంట్ ఆఫీసర్‌గా నియమించాడు. ఎంతో సీనియారిటీ ఉన్న వారిని కాదని నియమించడంలో ఈ హెచ్‌ఎం పాత్ర ఉందనే ఆరోపణలున్నాయి.


  అనంతసాగరంలో ఈ హెచ్‌ఎం ఎంఈఓగా పని చేస్తూ వేధిస్తుండటంతో ఓ ఉపాధ్యాయడు ఈయన్ను కొట్టాడు. (మధ్యలో ఎంఈఓ నుంచి మళ్లీ  హెచ్‌ఎంగా డిమోట్ అయ్యారు) మచ్చుకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.
  సస్పెన్షన్ విషయమై గూడూరు డిప్యూటీ ఈఓ వెంకటేశ్వరరావును ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా ఆర్జేడీ ఉత్తర్వుల మేరకు హెచ్‌ఎం సస్పెండ్ అయ్యాడన్నారు. రాపూరుకు ప్రత్యామ్నాయ హెచ్‌ఎంను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులను డీఈఓ కార్యాలయానికి కూడా పంపినట్టు తెలిపారు. అయితే కోర్టు శేషాద్రివాసు సస్పెన్షన్‌ను రద్దు చేసిందని, అందుకే పరీక్షల విధుల్లోకి తీసుకున్నానని డీఈఓ చెప్పడం గమనార్హం.


 పరంధామయ్య సస్పెన్షన్‌ను రద్దు చేయాలని కలెక్టర్ ఆదేశం
 గత నెల 28న కలెక్టర్ యూటీఎఫ్ నేత పరంధామయ్య సస్పెండ్‌ను రద్దు చేయాలని కోరుతూ అపాయింటింగ్ అథారిటీ అయిన డీఈఓకు ఆర్డర్ వేశారు. కాని డీఈఓ లెక్కచేయలేదు. సకాలంలో సిలబస్ పూర్తి చేయలేదనే ప్రధాన ఆరోపణతో పరంధామయ్యను డీఈఓ సస్పెండ్ చేశారు. అంతేకాక సస్పెండ్ చేసిన రోజే ఆగమేఘాలపై  కథ నడిచింది. మరి ఆర్జేడీ శేషాద్రివాసును సస్పెండ్ చేసినప్పుడు ఇంతే వేగంగా ఎందుకు ఉత్తర్వులు డీఈఓ కార్యాలయం ఇవ్వలేదో వారికే తెలియాలి.

 

కొంత జాప్యం జరిగినందుకు ఆర్జేడీ పార్వతి  గూడూరు డిప్యూటీ ఈఓ వెంకటేశ్వరరావుకు మెమో కూడా ఇచ్చింది. పరంధామయ్య సస్పెండ్‌ను రద్దు చేయాలని కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్‌ను ఏం చేశారని ‘న్యూస్‌లైన్’ డీఈఓ రామలింగాన్ని వివరణ కోరగా ఇదొక్కటే కాదని, ఇలాంటికొంతమందికి సంబంధించిన ఫైళ్లు ఉన్నాయని చెప్పారు. అన్నీ కలెక్టర్ వద్దకు పంపిస్తానని డీఈఓ తెలిపారు.

మరిన్ని వార్తలు