వైవీయూ హాస్టల్‌లో షార్ట్‌సర్క్యూట్

26 Aug, 2014 02:28 IST|Sakshi
వైవీయూ హాస్టల్‌లో షార్ట్‌సర్క్యూట్

వైవీయూ : యోగివేమన విశ్వవిద్యాలయం(వైవీయూ)లో ఆదివారం అర్ధరాత్రి విద్యార్థినుల వసతి గృహంలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ జరిగింది. దీంతో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వైవీయూ చిత్రావతి బ్లాక్‌లో పీజీ విద్యార్థినుల వసతిగృహం ఉంది. ఆదివారం రాత్రి వర్షం పడటంతో హాస్టల్ వెనుకవైపున ఉన్న కేబుల్‌వైరులో రాత్రి ఒంటి గంట సమయంలో షార్ట్‌సర్క్యూట్ చోటుచేసుకోవడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి.
 
హాస్టల్ కింది వైపు నుంచి రెండో ఫ్లోర్ వరకు మంటలు వ్యాపించాయి. మంటలను చూసి విద్యార్థినులు తీవ్ర భయాందోళనకు గురై కేకలు వేశారు. పవర్ రూంలో ట్రిప్ కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే తీవ్ర భయాందోళనకు గురైన విద్యార్థినులు ఒక్కొక్కరుగా సృ్పహ తప్పి పడిపోయారు. వీరిలో 16 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. చీఫ్ వార్డన్ సుబ్బరాయుడు వారికి ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం రిమ్స్‌కు తరలించారు.
 
ఎటువంటి ప్రమాదం లేదని విద్యార్థినులు భయానికి లోనయ్యారని రిమ్స్ వైద్యులు ధైర్యం చెప్పి పంపారు. సోమవారం ఉదయం 5.30 గంటల సమయంలో విద్యార్థులను వైవీయూకు పంపించారు. అయితే మళ్లీ కొంత మంది విద్యార్థినులు అస్వస్థతకు గురికావడంతో వైవీయూ డిస్పెన్సరీలోనే స్థానిక ఆర్‌ఎంపీ వైద్యుడు రెడ్డిబాషా ఆధ్వర్యంలో విద్యార్థినులకు, సిబ్బందికి సెలైన్ బాటిల్స్ ఎక్కించారు. దీంతో విద్యార్థినులు మెల్లగా కోలుకున్నారు.
 
అధికారుల నిర్లక్ష్యంపై ఆందోళన..
రాత్రి ఒంటి గంట సమయంలో విద్యార్థినుల హాస్టల్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంటే ఉదయం వరకు వీసీ తదితర అధికారుల ఎవరూ అటు వైపు చూడలేదని విద్యార్థినులు ఆందోళనకు దిగారు. ఉదయం ప్రమాదం జరిగిన హాస్టల్ వద్దకు విచ్చేసిన వీసీ శ్యాంసుందర్ ఎటువంటి ప్రమాదం జరగలేదు కదా అనడంతో విద్యార్థి సంఘాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి.
 
వీసీ ఛాంబర్‌ను ముట్టడించిన విద్యార్థి సంఘాలు
అగ్రిప్రమాదం రాత్రి జరిగినప్పటికీ ఉదయం వరకు అధికారులు ప్రమాద సంఘటన స్థలానికి రాకపోవడం దారుణమంటూ విద్యార్థి సంఘాల నాయకులు విరుచుకుపడ్డారు. దీనికి తోడు ఎవరికీ ఏ ప్రమాదం జరగలేదు కదా.. అంటూ వ్యంగ్యంగా మాట్లాడటం తగదంటూ హాస్టల్ నుంచి వీసీ ఛాంబర్ వరకు ర్యాలీగా వచ్చి ధర్నా చేపట్టారు.
 
ఈ సందర్భంగా వైఎస్‌ఆర్ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా కన్వీనర్ బి. అమర్‌నాథ్‌రెడ్డి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు శివకుమార్, ఆర్‌ఎస్‌ఎఫ్ కో కన్వీనర్ దస్తగిరి మాట్లాడుతూ గతంలో కూడా విశ్వవిద్యాలయంలో పలు అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నా అధికారులు పట్టించుకోక పోవడంతో మళ్లీ ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు.  అనంతరం కొద్దిసేపు విశ్వవిద్యాలయ అధికారులకు, విద్యార్థి సంఘాల నాయకులకు వాగ్వాదం జరిగింది. పూర్తిస్థాయిలో పరిస్థితులను సమీక్షిస్తానని వీసీ హామీ ఇవ్వడంతో విద్యార్థి సంఘాలు ఆందోళన విరమించారు.
 
తరచూ చోటుచేసుకుంటున్న అగ్నిప్రమాదాలు..
యోగివేమన విశ్వవిద్యాలయంలో తరచూ అగ్నిప్రమాదాలు చోటుచేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. గతంలో విశ్వవిద్యాలయంలోని పలు కార్యాలయాల్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుని పలు రికార్డులు కాలి బూడిదయ్యాయి. అదే విధంగా కేంద్ర లైబ్రరీ వద్ద కూడా ఇటీవలే మంటలు  చెలరేగాయి. తాజాగా ఆదివారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో  భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. కేబుల్ వైర్లు ఉన్న చోట చెత్తా చెదారం వేయడంతో పాటు పలుమార్లు దానికి నిప్పు పెట్టడంతో కేబుల్‌వైర్లు కరిగి షార్ట్‌సర్క్యూట్  జరిగి ఉంటుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
 
సెంట్రల్ లైబ్రరీ వద్ద షార్ట్‌సర్క్యూట్..
ఓవైపు హాస్టల్‌లో జరిగిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో విద్యార్థులు, సిబ్బంది తీవ్ర ఆందోళనకు లోనవుతుండగా.. అదే సమయంలో సోమవారం ఉదయం తిరిగి సెంట్రల్ లైబ్రరీ భవనంలో కేబుల్‌వైర్లు షార్ట్‌సర్క్యూట్ అవడం విశేషం. దీంతో హుటాహుటిన సిబ్బంది వచ్చి మెయిన్ ఆఫ్ చేసి పెద్ద ప్రమాదం చోటుచేసుకోకుండా ఆపగలిగారు.

మరిన్ని వార్తలు