ప్రాణాలు తీసిన పిడుగులు

31 May, 2018 22:25 IST|Sakshi

పిడుగుపాటుకు రాష్ట్రంలో 10 మంది మృతి

పదుల సంఖ్యలో మృత్యువాతపడ్డ పశువులు

వచ్చే మూడ్రోజుల్లో కోస్తాంధ్రలో పిడుగులతో పాటు వర్షం

సాక్షి నెట్‌వర్క్‌: రోళ్లు పగిలే రోహిణి కార్తెలో పిడుగుల వాన ప్రజల్ని బెంబేలెత్తిస్తోంది. గురువారం రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో పాటు వర్షం, ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. పిడుగుపాటుకు రాష్ట్రంలో 10 మంది మరణించారు. పదుల సంఖ్యలో పశువులు కూడా మృత్యువాత పడ్డాయి. ఒక్క గుంటూరు జిల్లాలోనే ఏడుగురు మృతి చెందారు. జిల్లాలోని నరసరావుపేట మండలం దొండపాడు గ్రామంలో చిన్నపురెడ్డి శివారెడ్డి (60), అదే మండలంలోని పమిడిపర్రులో అనంత పెద్దబ్బాయి (30) పశువులు మేపుకుంటున్న సమయంలో పిడుగుపడటంతో ఇద్దరూ మృతిచెందారు.

20 గొర్రెలు చనిపోయాయి. పెదకూరపాడు మండలం క్రోసూరు మండలం 88 త్యాళ్లూరు గ్రామంలో కుంభా కోటేశ్వరమ్మ (60), సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల గ్రామంలో క్రోసూరి అశోక్‌ (21), ముప్పాళ్ల మండలం నార్నెపాడు గ్రామానికి చెందిన బొల్లయ్య (27), ఫిరంగిపురం మండలం యర్లగుంట్లపాడుకు చెందిన శివాలశెట్టి ప్రసాద్‌ (57), నాగార్జున సాగర్‌ డ్యాం దిగువన కొత్తబ్రిడ్జి సమీపంలో దుగ్యాల అంజయ్య(35) మృతిచెందారు. అనంతపురం జిల్లా అమరా పురం మండలం లోని కె.గొల్లహట్టికి చెందిన తిమ్మక్క(45) పిడుగుపాటుకు మృతి చెందింది.  

ప్రకాశం, తూర్పు జిల్లాల్లో ఇద్దరి మృతి
ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం గురిజేపల్లిలో పిడుగుపడి గొర్రెల కాపరి దారం పెద్దబ్బాయి (29) మృతిచెందగా, ముగ్గురికి గాయాలయ్యాయి. 20 గొర్రెలు మృతిచెందాయి. తూర్పు గోదావరి జిల్లా కరప మండలం వాకాడకు చెందిన రైతు దూడల సత్యనారాయణ (55) పిడుగుపాటుకు గురై మృతి చెందాడు.

చిత్తూరు జిల్లా సోమల మండలం కూకటి గొల్లపల్లెలో పిడుగుపాటుకు ముగ్గురు గాయపడ్డారు. విశాఖ ఏజెన్సీలోని పాడేరు మండలం మినుములూరు పంచాయతీ సంగోడి గ్రామంలో పశువుల మందపై పిడుగుపడడంతో తొమ్మిది ఎద్దులు మృతి చెందాయి.


వానలొస్తున్నాయ్‌!
సాక్షి, విశాఖపట్నం: మరో మూడు రోజుల్లో బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడబోతోందని, దాని ఫలితంగా జూన్‌ 3 నుంచి రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ గురువారం రాత్రి నివేదికలో వెల్లడించింది.

ఉపరితల ఆవర్తనంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడితే నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి వెంటనే ప్రవేశించే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ రిటైర్డ్‌ అధికారి రాళ్లపల్లి మురళీకృష్ణ ‘సాక్షి’కి చెప్పారు. రానున్న మూడు రోజుల్లో కోస్తాంధ్రలో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని, అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని ఐఎండీ తెలిపింది. రాయలసీమలోనూ అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురుస్తాయని పేర్కొంది. మరోవైపు రాష్ట్రంలో ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగుతోంది.

మరిన్ని వార్తలు