రాష్ట్రానికి చల్లటి కబురు!

1 Jun, 2019 04:32 IST|Sakshi

ఈ ఏడాది సంతృప్తికరంగా వర్షాలు 

సాక్షి, విశాఖపట్నం : ఈ ఏడాది రాష్ట్రంలో వర్షాలు ఎలా ఉంటాయోనని ఆందోళన చెందే రైతన్నలు, పాలకులు, ప్రజలకు సాంత్వన ఇచ్చే చల్లటి కబురు ఇది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజనులో సాధారణ వర్షాలు కురవనున్నాయి. దేశవ్యాప్తంగా జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు ప్రభావం చూపే ఈ రుతుపవనాల సీజనులో 96 శాతం వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తాజాగా శుక్రవారం అంచనా వేసింది. ముఖ్యంగా ఉత్తర, వాయవ్య భారత్‌ కంటే ఆంధ్రప్రదేశ్‌ సహా దక్షిణాది రాష్ట్రాల్లో వర్షపాతం బాగుంటుందని ప్రకటించింది. ప్రాంతాల వారీగా చూస్తే వాయవ్య భారతదేశంలో 94 శాతం, మధ్య భారతదేశంలో 100 శాతం, దక్షిణాది రాష్ట్రాల్లో 97 శాతం, ఈశాన్య రాష్ట్రాలో 91 శాతం వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. ప్రస్తుతం ఎల్‌నినో బలహీనంగా ఉండడంవల్ల కరువుకు ఆస్కారం ఉండబోదని తెలిపింది. 

జూన్‌ 6న కేరళకు నైరుతి..
మరోవైపు.. నైరుతి రుతుపవనాలు జూన్‌ 6వ తేదీ నాటికి కేరళను తాకే అవకాశాలున్నాయని ఐఎండీ పునరుద్ఘాటించింది. ఇప్పటికే ఈ రుతుపవనాలు అండమాన్, దక్షిణ బంగాళాఖాతంలోకి ప్రవేశించాయి. ఇవి క్రమంగా మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. ప్రస్తుతం మాల్దీవులు, కొమరిన్, నైరుతి–ఆగ్నేయ బంగాళాఖాతాల్లోకి ప్రవేశించాయి. ఇవి మరింతగా ముందుకు కదులుతూ రానున్న 48 గంటల్లో అరేబియా సముద్రం, మాల్దీవులు, నైరుతి–ఆగ్నేయ బంగాళాఖాతాల్లోకి విస్తరించనున్నాయి. క్రమంగా ఇవి బలపడుతూ జూన్‌ 6 నాటికల్లా కేరళను తాకుతాయని ఐఎండీ వివరించింది. కాగా, రానున్న రెండ్రోజులపాటు కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

>
మరిన్ని వార్తలు