యువర్‌ అటెన్షన్‌ ప్లీజ్‌.. మీ రైలు ఇప్పట్లో రాదు!

10 Jul, 2018 12:52 IST|Sakshi

ముందుకుసాగని శ్రీకాళహస్తి– నడికుడి రైల్వేలైను నిర్మాణ పనులు

భూసేకరణలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం

భూ సేకరణకు రూ. 1317 కోట్లకుగాను రూ. 300 కోట్లు విడుదల

జిల్లాలో మొదలుకాని సేకరణ

ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లోని మెట్ట ప్రాంత వాసుల దశాబ్దాలకల ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు. నడికుడి– శ్రీకాళహస్తి రైల్వే నిర్మాణ పనులు ముందుకుసాగడంలేదు. 308 కి.మీ. నిడివితో నూతనంగా నిర్మించే ఈ రైల్వే లైను ఇప్పటి వరకు కేవలం 30 కి.మీ మాత్రమే పూర్తికావడం గమనార్హం. భూసేకరణలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ పరిస్థితి నెలకొంది. 2019 మార్చి నాటికి పనులు పూర్తికావాల్సి ఉంది. నిర్ణీత గడువులో రైలు పట్టాలెక్కే ఆశలు కనిపించడం లేదు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే పనులు పూర్తికి మరో మూడు నాలుగేళ్లు జాప్యం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

ఉదయగిరి: గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడి నుంచి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి వరకు నూతన రైల్వే మార్గం నిర్మాణం కోసం నెల్లూరు, ప్రకాశం, గుంటూ రు జిల్లాల్లోని మెట్ట ప్రాంత ప్రజలు, ప్రజాప్రతినిధులు యాభై ఏళ్ల నుంచి పోరాటం సాగిస్తున్నారు. 2012లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న కె.రోశయ్య ఈ రైల్వేలైను నిర్మాణానికి అవసరమైన భూసేకరణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే విధంగా కేంద్రంతో ఒప్పందం కుదిర్చారు. ఆ తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎం అయ్యాక ఈ నూతన రైల్వేలైను నిర్మాణానికి పావులు కదిపారు.

భూసేకరణ ప్రక్రియ చేపట్టారు. తర్వాత 2014 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో  రాష్ట్రంలో టీడీపీ, కేంద్రంలో ఎన్‌డీఏ కొలువు తీరాయి. ప్రధాని మోదీ ఈ రైల్వే మార్గాన్ని 2019 మార్చి నాటికి పూర్తిచేయాలని సంకల్పించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేసి ఇవ్వటంలో తీవ్రజాప్యం చేసింది. దీంతో ఈ ప్రాజెక్ట్‌కు అవసరమైన నిధులను కేంద్రం సైతం మొక్కుబడిగా విడుదల చేసింది. దీంతో ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిడి పెరగడంతో 2017లో కేంద్రం ఈ పనులను వేగవంతం చేసేందుకు భూసేకరణ పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచింది. అయినా టీడీపీ ప్రభుత్వం భూసేకరణకు అవసరమైన నిధులు విడుదల చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తూ..అరకొర నిధులు విడుదల చేసి చేతులు దులుపుకుంది. దీంతో పనులు ముందుకు జరగక తీవ్ర జాప్యం జరుగుతోంది. 

భూసేకరణలో రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు
ఈ నూతన రైల్వేలైను నిర్మాణ మార్గానికి రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భూసేకరణ చేసి రైల్వే శాఖకు అప్పగించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో తీవ్ర జాప్యంచేస్తోంది. గుంటూరు జిల్లాలో రైల్వేలైన్‌కు అవసరమైన భూసేకరణ పూర్తి చేశారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మాత్రం వేగం మందగించింది. జిల్లాలో ఈ రైల్వేలైను వరికుంటపాడు మండలం నుంచి వెంకటగిరి వరకు 146 కి.మీ ఉంది. దీనికి 2,268 ఎకరాల భూమి అవసరం కాగా ఇందులో 1,590 ఎకరాలకు సంబంధించి రూ.100 కోట్లు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,317 కోట్లు భూసేకరణ కోసం విడుదల చేయాల్సి ఉంది. కానీ ఇంతవరకు కేవలం రూ.300 కోట్లు మాత్రమే విడుదల చేసింది. మూడేళ్లుగా నిధులు విడుదల చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది.  

గుంటూరు జిల్లాలో మాత్రమేసాగుతున్న పనులు
గుంటూరు జిల్లాలో ఈ రైల్వేలైను పనులు గతేడాది నుంచి సాగుతున్నాయి. మొదటి దశలో 32 కి.మీ రైల్వేమార్గం నిర్మించాలని సంకల్పించి రెండు ప్యాకేజీలుగా విభజించి కాంట్రాక్టర్లకు అప్పగించారు. ఈ ఏడాది చివరి నాటికి మొదటి దశ పనులు పూర్తిచేయాలని భావించినప్పటికీ రొంపిచర్ల ప్రాంతంలో భూసేకరణలో న్యాయ సమస్యలు తలెత్తాయి. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 33 రైల్వేస్టేషన్లు 57 మెట్ట ప్రాంత మండలాల ద్వారా ఈ రైల్వేలైను మార్గం నిర్మితమవుతుంది. 308 కి.మీ నిడివితో నూతనంగా నిర్మించే ఈ రైల్వే లైను ఇప్పటి వరకు కేవలం 30 కి.మీ మాత్రమే పూర్తికావడం విశేషం. అయితే నిర్ణీత గడువు 2019 మార్చి నాటికి ఈ పనులు పూర్తయ్యే సూచనలు కనిపించడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో అవసరమైన మేరకు నిధులు విడుదల చేసి భూసేకరణ పనులు పూర్తి చేస్తే కానీ 2022 నాటికి ఈ పనులు పూర్తి చేసే అవకాశం ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు.

జిల్లాలో పరిస్థితి ఇదీ!
ప్రస్తుతం జిల్లాలో ఈ నూతన రైల్వేలైన్‌ నిర్మాణానికి అవసరమైన భూమిని అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి రైతులకు అందజేయాల్సిన నష్టపరిహార నిధులు  ప్రభుత్వం విడుదల చేయలేదు. జిల్లాలో వరికుంటపాడు, కొండాపురం, కలిగిరి, వింజమూరు, ఏఎస్‌పేట, ఆత్మకూరు, చేజర్ల, పొదలకూరు, రాపూరు, డక్కిలి, వెంకటగిరి మండలాల్లో ఈ రైల్వేలైను నూతనంగా నిర్మితం కానుంది. ఇప్పటికే ఆయా మండలాల్లో రైల్వేమార్గం వెళ్లే గ్రామాల్లో రెవెన్యూ, రైల్వే అధికారులు గ్రామసభలు కూడా నిర్వహించారు. 

దశాబ్దాల కల నెరవేరేదెప్పుడు
ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని మెట్ట ప్రాంతవాసుల దశాబ్దాల కలగా ఉన్న ఈ నూతన రైల్వే నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణకు అవసరమైన నిధులు విడుదల చేయడంలో ఆలస్యం చేస్తుండడంతో ఈ పరిస్థితి తలెత్తింది. 2019లో ఈ ప్రాజెక్ట్‌ పూర్తికావాల్సి ఉన్నా ప్రస్తుత పనులు పరిశీలిస్తే 2022కు కూడా పూర్తయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ రైల్వేలైను నిర్మాణం కోసం మేకపాటి రాజమోహన్‌రెడ్డి నర్సరావుపేట, ఒంగోలు, నెల్లూరు ఎంపీగా కేంద్రంతో పోరాటం చేశారు. ఈ ప్రాజెక్ట్‌ పూర్తిచేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగా నత్తను తలపిస్తోంది. – మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి,మాజీ ఎమ్మెల్యే, ఉదయగిరి

నిధులు విడుదలైన వెంటనేభూసేకరణ పూర్తిచేస్తాం
ఈ రైల్వేలైను మార్గానికి అవసరమైన భూసేకరణ కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే భూములు కోల్పోయే రైతులకు నష్టపరిహారం అందజేసి భూమిని సేకరిస్తాం. త్వరలో నిధులు విడుదలయ్యే అవకాశముంది. వీలైనంత త్వరగా భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. –  భక్తవత్సలరెడ్డి, ఆర్డీఓ కావలి

మరిన్ని వార్తలు