తప్పిన ప్రమాదం

27 Aug, 2014 03:00 IST|Sakshi

 బనగానపల్లె: శ్రీశైలం కుడి ప్రధాన కాలువ(ఎస్సార్బీసీ)కు బనగానపల్లె సమీపంలో మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో భారీ గండి పడింది. దీంతో 1500 క్యూసెక్కుల నీరు సోమలవాగులోకి చేరింది. ఒక్కసారిగా ఇంత నీరు రావడంతో సోమలవాగు పొంగి నంద్యాల- బనగానపల్లె రోడ్డులో కాజ్‌వేపైకి ఎక్కి ప్రవహించింది. తెల్లవారుజామున విజయవాడ నుంచి అనంతపురం వెళ్తున్న ఆర్టీసీ హైటెక్ బస్సు డ్రైవర్ వాగులో నుంచి వెళ్లవచ్చని భావించి, ముందుకు పోనిచ్చారు.

అయితే కొంత దూరం వెళ్లగానే ఇంజన్‌లోకి నీరు చేరడంతో బస్సు ఆగిపోయింది. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు ఆందోళన చెందారు. వెంటనే వెనుక వాగు బయటే ఉన్న బస్సులోని ప్రయాణికులు స్థానికులను అప్రమత్తం చేశారు. ట్రాక్టర్‌ను తెప్పించి, బస్సు వద్దకు పంపారు. బస్సులో ఉన్న 40 మంది ప్రయాణికులు బస్సు వెనుక అద్దం పగులగొట్టి ట్రాక్టర్‌లోకి దూకి సురక్షితంగా బయటపడ్డారు. సుమారు 4 గంటల పాటు వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. ప్రవాహం తగ్గిన తర్వాత వాహనాల రాకపోకలు కొనసాగాయి. కర్నూలు-వైఎస్సార్ కడప జిల్లాల్లోని 1.90 లక్షల ఎకరాలకు సాగునీరందించే ఎస్సార్బీసీకి గండి పడడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కాలువ గండి పూడ్చడానికి సుమారు నాలుగైదు రోజులు పడుతుందని అధికారులు చెబుతుండడంతో ఆయకట్టుకు సాగునీరందక ఇబ్బందిపడాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు.

 అదికారుల పరిశీలన
 గండి పడిన ప్రాంతాన్ని ఎస్సార్బీసీ సూపరింటెండెంట్ ఇంజనీర్ వెంకటరమణ, ఈఈ మక్బుల్ అహ్మద్, డీఈఈ కృష్ణమూర్తి,ఏఈ మస్తాన్‌తోపాటు నంద్యాల ఆర్డీవో నరసింహులు, తహశీల్దార్ శేషఫణి, ఏఎస్‌ఓ వెంకట్రామిరెడ్డి పరిశీలించారు. నాలుగైదు రోజుల్లో గండిని పూడ్చివేస్తామని ఎస్‌ఈ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు