సీఎఫ్‌ఎంఎస్‌ మాయాజాలం

28 May, 2019 04:26 IST|Sakshi

ఒకే బిల్లుకు పలుమార్లు చెల్లింపులు

అక్రమాలకు నిలయంగా రాష్ట్ర సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ

ఆర్థిక శాఖ రెగ్యులర్‌ ఉద్యోగులకు కూడా తెలియకుండా మాయాజాలం

అవినీతి సీఈవో నుంచి సీఎఫ్‌ఎంఎస్‌ను బయట పడేయాలంటున్న ఉద్యోగులు

కొత్త ప్రభుత్వం తక్షణం దీనిపై దృష్టి సారించాలంటున్న ఆర్థిక శాఖ వర్గాలు

సాక్షి, అమరావతి: రాష్ట్ర సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్‌ఎంఎస్‌)లో కొత్త కొత్త అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. ఒకే బిల్లుకు పలుమార్లు చెల్లింపులు చేయడం దుమారం రేపుతోంది. తొలుత రూ.200 కోట్ల మేర మాత్రమే ఒకే బిల్లుకు పలుమార్లు చెల్లింపులు చేసినట్టు బయటపడింది. అయితే.. లోతుగా పరిశీలించగా పలు రంగాలకు చెందిన బిల్లులకు ఇలా ఏకంగా రూ.1800 కోట్ల మేర చెల్లింపులు సాగినట్లు సీఎఫ్‌ఎంస్‌ వర్గాలే చెబుతున్నాయి. ఒకసారి పేమెంట్‌ బటన్‌ నొక్కితే అత్యధికంగా 42సార్లు చెల్లింపులు జరిగినట్లు వివరిస్తున్నాయి. ఉదాహరణకు మత్య్స శాఖలో రూ.65 లక్షలకు గాను సుమారు 50 బిల్లులను పెడితే అవి 2000 బిల్లులుగా దాదాపు రూ.6 కోట్ల మేర అక్రమ చెల్లింపులు జరిగాయని అంటున్నాయి. ఈ మొత్తం పలువురు కాంట్రాక్టర్లకు చేరినట్లు ఆర్థిక శాఖ వర్గాలు కూడా చెబుతుండటం గమనార్హం. ఇలాంటి అక్రమ చెల్లింపులు జరిగి నెలలు కావస్తున్నా తిరిగి ఆ మొత్తం ఖజానాకు జమ కాలేదని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. పారదర్శకత కోసం వందల కోట్ల రూపాయల వ్యయం చేసి సీఎఫ్‌ఎంఎస్‌ను తీసుకొస్తే పారదర్శకతకు అర్థమే లేకుండా పోతోందని వాపోతున్నాయి. అక్కడ అసలు ఏమి జరుగుతోందో ఆర్థిక శాఖ రెగ్యులర్‌ ఉద్యోగులకు కూడా తెలియడం లేదని చెబుతున్నాయి. 

కమీషన్లు ఇచ్చినవారికే బిల్లుల చెల్లింపు
సీఎఫ్‌ఎంఎస్‌లో 65 మంది పనిచేయడానికి మాత్రమే అనుమతి ఉండగా ప్రస్తుతం 250 మంది పనిచేస్తున్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండా సీఈవో తనకు నచ్చినవారిని నియమించేసుకున్నారు. సీఎఫ్‌ఎంఎస్‌కు ఏడాదికి రూ.250 కోట్లు చొప్పున బడ్జెట్‌ కేటాయించారు. సీఎఫ్‌ఎంఎస్‌ ఏర్పాటై మూడేళ్లయినా ఆశించిన స్థాయిలో ఈ వ్యవస్థ పారదర్శకంగా పనిచేయడం లేదు. ఎన్నికల ముందు ఒక విధానం లేకుండా చంద్రబాబు చెప్పినవారికి, అలాగే కమీషన్లు ఇచ్చినవారికి మాత్రమే బిల్లులను చెల్లించారు. దీంతో గత ఆర్థిక సంవత్సరంలో వేల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్‌లో ఉండిపోయాయి. రాష్ట్ర ఖజానాను చంద్రబాబు సొంత ఖజానాగా వాడేసుకున్నారు. ఇందుకు సీఎఫ్‌ఎంఎస్‌ సీఈవోతోపాటు ఆర్థిక శాఖ కార్యదర్శులు సహకారం అందించారు.

ఒకే బిల్లులకు పలుమార్లు చెల్లింపులు జరగడం, ఆ మొత్తం ఇంకా ఖజానాకు వెనక్కు రాకపోవడం, పారదర్శకత లేకుండా అంతా గోప్యంగా ఉంచడంపై కొత్త ప్రభుత్వం దృష్టి సారించాలని ఆర్థిక శాఖ వర్గాలు కోరుతున్నాయి. సీఎఫ్‌ఎంఎస్‌ను ప్రైవేట్‌ వ్యక్తుల కబంధ హస్తాల నుంచి తొలగించి రెగ్యులర్‌ ఉద్యోగుల కిందకు తీసుకొస్తే తప్ప జవాబుదారీతనం, పారదర్శకత రాదని అంటున్నాయి. గత రెండేళ్ల సీఎఫ్‌ఎంఎస్‌ లావాదేవీలపై ప్రభుత్వం విచారణకు లేదా ఆడిట్‌కు ఆదేశించి, అక్రమాలను బయటకు తీసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కొత్త ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. సీఎఫ్‌ఎంఎస్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థ ‘సాప్‌’ పేరుతో కోట్ల రూపాయలను వ్యయం చేసిన సీఈవో.. ఇప్పుడు నిరుద్యోగులకు శిక్షణ పేరుతో మరిన్ని నిధులు కాజేసేందుకు ఎత్తుగడ వేశారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. సీఎఫ్‌ఎంఎస్‌ కారణంగా అన్ని శాఖలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నాయని సీనియర్‌ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. 

గోల్‌మాల్‌ జరిగిందంటున్న ఆర్థిక శాఖ
వందల కోట్ల రూపాయలు వ్యయం చేసినప్పటికీ సీఎఫ్‌ఎంఎస్‌ వ్యవస్థ పూర్తిస్థాయిలో అమల్లోకి రాలేదని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికీ గతంలో సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (సీజీజీ) రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ ఆధారంగానే ఆర్థిక లావాదేవీలు సాగుతున్నాయని అంటున్నాయి. అయితే.. ఎవరికి ఎంత చెల్లించింది తెలియకుండా గుట్టుగా ఉంచుతున్నారంటే ఇందులో ఏదో గోల్‌మాల్‌ జరిగినట్లు స్పష్టమవుతోందని చెబుతున్నాయి. సీఎఫ్‌ఎంఎస్‌ సీఈవోగా ప్రైవేట్‌ వ్యక్తిని నియమించడంతో ఆయన ఇష్టానుసారం తనకు కావాల్సిన వారిని కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులుగా నియమించుకున్నారని వివరిస్తున్నాయి. ఆర్థిక శాఖలో ఉన్నతాధికారి బలహీనతలను ఆసరాగా చేసుకుని సీఈవో ఇష్టారాజ్యంగా సీఎఫ్‌ఎంఎస్‌ను నడిపిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్థిక శాఖ రెగ్యులర్‌ ఉద్యోగులను కూడా పక్కన పెట్టేసి ప్రైవేట్‌ రాజ్యంగా సీఎఫ్‌ఎంఎస్‌ను కొనసాగిస్తున్నారని మండిపడుతున్నాయి.

మరిన్ని వార్తలు