సెంట్రల్ ‘పవర్’కు విభజన షాక్

20 May, 2014 00:48 IST|Sakshi
సెంట్రల్ ‘పవర్’కు విభజన షాక్

కర్నూలు(రాజ్‌విహార్), న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్(సీపీడీసీఎల్)లో సమస్యలు తలెత్తనున్నాయి. ఆ సంస్థ పరిధిలోని కర్నూలు, అనంతపురం జిల్లాల ఉద్యోగుల పరిస్థితి అయోమయంలో పడింది. దీంతో సీనియారిటీ, పదోన్నతులు వంటివి అందుతాయోలేదోనని ఆందోళన మొదలైంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతో అన్ని ప్రభుత్వ శాఖలు రెండుగా చీలిపోనున్నాయి. ఈ క్రమంలోనే విద్యుత్ శాఖ కూడా వీడిపోనుంది.

 సమైక్య రాష్ట్రంలో ప్రస్తుతం నాలుగు విద్యుత్ పంపిణీ సంస్థలున్నాయి. అందులో హైదరాబాదు కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్(సీపీడీసీఎల్), తిరుపతి కేంద్రంగా సౌథ్రెన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎస్‌పీడీసీఎల్), వరంగల్ కేంద్రంగా నేషనల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్‌పీడీసీఎల్), విశాఖపట్నం కేంద్రంగా ఈస్ట్రెన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్(ఈపీడీసీఎల్) సంస్థలు తమ పరిధిలోని జిల్లాలకు విద్యుత్ సరఫరా చేస్తున్నాయి. జెన్‌కో ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను ట్రాన్స్‌కో కొలుగోలు చేసి ఈ నాలుగు పంపిణీ సంస్థలకు అందిస్తోంది.

 రాష్ట్ర వ్యాప్తంగా అవసరమయ్యే విద్యుత్‌లో 40 శాతానికి పైగా విద్యుత్ కేవలం సీపీడీసీఎల్ సంస్థే వినియోగిస్తుండగా మిగతా 60 శాతం విద్యుత్ మిగిలిన మూడు సంస్థలు పొందుతున్నాయి. అన్ని సంస్థల పరిస్థితి బాగానే ఉన్నా సీపీడీసీఎల్‌లోని సీమ జిల్లాల పరిస్థితి ఆందోళన కరంగా మారింది. అతిపెద్ద సంస్థ అయిన సీపీడీసీఎల్‌లో మొత్తం 11 ఆపరేషన్స్ సర్కిళ్లు (ఎస్‌ఈ స్థాయి హోదా కలిగినవి) ఉన్నాయి. ఇందులో హైదరాబాదు సెంట్రల్, సౌత్, నార్త్, రంగారెడ్డి నార్త్, సౌత్, ఈస్టు, మహబూబ్ నగర్, నల్గొండ, మెదక్ జిల్లాలతోపాటు రాయలసీమలోని కర్నూలు, అనంతపురం కూడా ఉన్నాయి.

అందులో కర్నూలు, అనంతపురం తప్ప మిగిలినవి తెలంగాణలోనివే. దీంతో రాష్ట్ర విభజన తర్వాత కర్నూలు, అనంతపురం సర్కిళ్లను సీపీడీసీఎల్ నుంచి విడగొట్టి తిరుపతి కేంద్రంగా ఉన్న ఎస్‌పీడీసీఎల్‌లో విలీనం చేయనున్నారు. ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంమైనా ఎన్నికలు, కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కావడంతో చర్యలు వేగవంతం అయ్యాయి. అపాయింటెడ్ డేట్ జూన్ 2వ తేదీ నుంచి అధికారాలు బదలాయించనున్నారు. దీంతో ఈ నెల వేతనాలు 24వ తేదీనే చెల్లించనున్నారు.

ఉద్యోగుల సీనియారిటీపై గందరగోళం
సీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాలను ఎస్‌పీడీసీఎల్‌లో కలపనుండడంతో ఈ జిల్లాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సర్వీసు సీనియారిటీ, పదోన్నతులు, ఇతర అంశాలపై గందరగోళం నెలకొంది. ప్రభుత్వం ఆప్షన్లు ఇస్తామని, సర్దుబాటు చేస్తామని చెబుతున్నా పూర్తి స్థాయి స్పష్టత కరువైంది. కర్నూలు జిల్లాలో మొత్తం 2 వేల మందికి పైగా ఉద్యోగులు, మరో 500 మంది కాంట్రాక్టు కార్మికులున్నారు.

వారిలో ఒక చీఫ్ జనరల్ మేనేజరుతోపాటు ఎస్‌ఈ, 9 మంది డీఈలతోపాటు ఏడీఈలు, ఏఈలు, సబ్ ఇంజినీర్లు మొత్తం 500 ఇంజినీరింగ్ అధికారులున్నారు. అనంతపురం జిల్లాలో మొత్తం 2500 మందికి పైగా ఉద్యోగులతోపాటు 600కి పైగా కాంట్రాక్టు కార్మికులున్నారు. ఎస్‌పీడీసీఎల్‌లో ప్రస్తుతం తిరుపతి (చిత్తూరు)తోపాటు కడప, నెల్లూరు, ప్రకాశం, కృష్ణ (విజయవాడ), గుంటూరు జిల్లాలు ఉన్నాయి. ఈ రెండు జిల్లాలను అందులో కలిపితే తమ సర్వీసు, సీనియారిటీ సమస్యలొస్తాయని ఆ సంస్థలోని ఉద్యోగులు సైతం ఆందోళనకు గురవుతున్నారు

. కాగా కర్నూలు, అనంతపురం, మహబూబ్‌నగర్ జిల్లాలను కలిపి జోన్ ఏర్పాటు చేసి చీఫ్ జనరల్ మేనేజరు(చీఫ్ ఇంజినీర్ స్థాయి అధికారి) నియమించారు. కర్నూలులోనే జోనల్ కార్యాలయాన్ని ఉంది. రెండు జిల్లాలను ఎస్‌పీడీసీఎల్‌కు బదలాయిస్తే ఇక్కడ ఉన్న సీజీఎం పోస్టు రద్దయ్యే ప్రమాదముంది. అధికారులు స్పందించి ఉద్యోగుల సీనియారిటీ, పదోన్నతుల విషయంలో సమస్యలు రాకుండా చర్యలు చేపట్టాలని విద్యుత్ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ ఎం.ఉమాపతి కోరుతున్నారు.

>
మరిన్ని వార్తలు