ఆత్మహత్యలా?..హత్యలా?

10 Jul, 2015 01:30 IST|Sakshi

దుత్తలూరు :  మండలంలోని నర్రవాడ బైపాస్‌రోడ్డు సమీపంలోని చెన్నకేశవస్వామి ఆలయం వెనుక గుంతలో ఒకే కుటుంబానికి నలుగురు మృతిపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. 20 రోజుల క్రితం వీరు ఇంటి నుంచి వెళ్లారు. అయితే గురువారం గుంతలో నలుగురి మృతదేహాలు ఉండటాన్ని పశువుల కాపరులు గుర్తించడంతో వెలుగుచూసింది.
 
 అయితే ఇన్ని రోజులు వీరు ఎక్కడికి వెళ్లారు.. ఏం చేస్తున్నారో కూడా తెలియనట్టుగా కుటుంబ యజమాని ఉండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంఘటన స్థలంలో మృతదేహాలు సైతం ఒకరిపై ఒకరు పడి ఉండటం కూడా ఆత్మహత్యలా? హత్యలా? అనే అనుమానం తలెత్తుతోంది.
 
 ఉదయగిరి మండలం నేలటూరుకు చెందిన మేడేపల్లి వెంకటేశ్వర్లు (60), చెన్నమ్మ దంపతుల కుమార్తె పద్మకు దుత్తలూరు మండలం నర్రవాడ పంచాయతీ మజరా గుదేవారిపాళెంకు చెందిన మద్దిపాటి హరికృష్ణతో (మేడేపల్లి చెన్నమ్మ తమ్ముడు) 18 ఏళ్ల క్రితం వివాహమైంది.
 
  అప్పటి నుంచి హరికృష్ణ, మామ వెంకటేశ్వర్లుతో కలిసి గుంటూరులో వడ్డీ, స్టీల్ వ్యాపారం చేస్తున్నారు. వ్యాపారంలో నష్టాలు రావడంతో హరికృష్ణ స్వగ్రామం గుదేవారిపాళెంలో వ్యవసాయం చేసుకుందామని భార్య, మామకు చెప్పాడు. దీనికి వారిద్దరు నిరాకరించడంతో పదేళ్ల క్రితమే హరికృష్ణ వారిని గుంటూరులోనే వదిలేసి ఒక్కడే స్వగ్రామానికి వచ్చాడు. మామ వెంకటేశ్వర్లుకు వ్యాపారంలో మళ్లీ నష్టాలు రావడంతో నాలుగేళ్ల క్రితం కుమార్తె పద్మ (36), మనవరాలు శ్రావణసంధ్య(15), మనమడు శ్రావణ్‌కుమార్ (13)ను తీసుకుని గుదేవారిపాళెంలో వదిలి పెట్టాడు.
 
 వెంకటేశ్వర్లు బెంగళూరులో పని చేస్తూ అప్పుడప్పుడూ అల్లుడు, కూతురు దగ్గరికి  వచ్చేవాడు. ఆయన వచ్చిన ప్రతిసారి భార్యాభర్తల నడుమ తగాదా జరుగుతుండేది. పిల్లలకు మంచి చదువు కావాలని, ప్రైవేట్ పాఠశాలలో చేర్పించాలని వాదోపవాదాలు జరుగుతుండేవి. ఈ క్రమంలో వెంకటేశ్వర్లు తన కూతురు ఇంటికి వచ్చి నీ భర్త ఎటువంటి సంపాదన లేకుండా జులాయిగా తిరుగుతూ తాగుడుకు అలవాటు పడ్డాడు. నీ పిల్లల భవిష్యత్ ఏమిటని బాధపడేవాడు. తనతో పాటు పిల్లలను గుంటూరుకు పంపిస్తే ప్రైవేట్ పాఠశాలలో చదివిస్తానని తెలిపాడు. ఈ విషయం పద్మ తన భర్త హరికృష్ణకు చెబితే అతను నిరాకరించాడు. ఈ క్రమంలో 20 రోజుల క్రితం హరికృష్ణ పొలానికి వెళ్లగా వెంకటేశ్వర్లు వచ్చి కుమార్తె, మనమరాలు,మనమడును తీసుకుని గుంటూరుకు వెళ్తున్నామని చుట్టు పక్కల వారికి చెప్పి వెళ్లారు. అయితే హరికృష్ణ మిన్నకుండిపోయాడు. కాగా, గురువారం నర్రవాడ బైపాస్ ప్రాంతంలో గొర్రెల కాపరి గొర్రెలు మేపుతుండగా ఆ ప్రాంతం నుంచి భరించలేని దుర్వాసన వచ్చింది. కలియ చూడగా గుడి వెనుక ఉన్న చెన్నయ్యగుంతలో కుళ్లిన స్థితిలో ఉన్న నాలుగు శవాలను గమనించి స్థానికులకు సమాచారమందించాడు. ఈ విష యం దావనంలా వ్యాపించింది.
 
  అయితే మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కుళ్లి శిథిలం కావడంతో గుర్తుతెలియన మృతదేహాలుగా భావించారు. స్థానికులు మృతదేహాలను పరిశీలించి గుదేవారిపాళెంకు చెందినవారివిగా గుర్తించారు. సంఘటన స్థలంలో విషగుళికల ప్యాకెట్, కూల్‌డ్రింక్ ఖాళీ బాటిల్ ఉన్నాయి. దీన్ని బట్టి వీరు ఆత్మహత్య చేసుకుని ఉంటారని భావి స్తున్నా.. ఇన్ని రోజులుగా భార్యా బిడ్డలు కనిపించకపోయినా భర్త వారి ఆచూకీ కోసం ప్రయత్నించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 
  సమాచారం అందుకున్న ఉదయగిరి సీఐ శ్రీనివాసరావు, దుత్తలూరు ఎస్సై సైదులు సంఘటన స్థలాన్ని పరిశీలించి హరికృష్ణ వద్ద ఫిర్యాదు తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.   ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారులు మృతి చెందటం చూసి పలువురు చలించి పోయారు. శ్రావణ్‌కుమార్ ప్రస్తుతం నర్రవాడ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతుండగా, శ్రావణసంధ్య గత సంవత్సరం దుత్తలూరులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదివింది. ఈ సంవత్సరం కుటుంబ కలహాల నేపథ్యంలో ఎక్కడా చేరలేదని సమాచారం.
 

మరిన్ని వార్తలు