నిత్యం 45 వేల టన్నుల ఇసుక సరఫరా

23 Oct, 2019 04:19 IST|Sakshi

గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడి 

ఈ ఏడాది భారీ వర్షాలు కురవడం వల్లే కొన్నిచోట్ల ఇబ్బందులు 

నిర్మాణ పనులు నిలిచిపోకుండా ప్రత్యామ్నాయ చర్యలు 

పట్టా భూముల్లోని ఇసుకపై దృష్టి పెట్టాం 

నిర్మాణ రంగ సంఘాలకు ఇసుక అందిస్తున్నాం 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతిరోజూ 45 వేల టన్నుల ఇసుకను సరఫరా చేస్తున్నట్టు గనులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. భవన నిర్మాణ కార్మికుల ఉపాధి దెబ్బతినకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. మైనింగ్‌ శాఖ కార్యదర్శి రామ్‌ గోపాల్‌తో కలిసి ఆయన మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. కృష్ణా, గోదావరి నదుల్లో నెలల తరబడి వరద ప్రవాహం కొనసాగుతుండడం వల్ల ప్రధానమైన రీచ్‌ల నుంచి అనుకున్నంత ఇసుక సరఫరా జరగడం లేదని ప్రభుత్వం దృష్టికి వచ్చిందని చెప్పారు. దీన్ని అధిగమించేందుకు ప్రత్యామ్నాయ ఇసుక రీచ్‌లను గుర్తిస్తున్నామని అన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంకా ఏం చెప్పారంటే...

‘‘గత పదేళ్లుగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులకు భిన్నంగా ఈ ఏడాది రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా నదిలో 70 రోజులుగా, గోదావరిలో 40 రోజులుగా వరద కొనసాగుతుంది. నదుల్లో రీచ్‌లు వరదతో నిండిపోతే ఇసుకను తవ్వితీయడం ఎలా సాధ్యం? దీన్ని కూడా ప్రతిపక్షాలు రాజకీయం చేయడానికి వాడుకోవడం సమంజసం కాదు. రాష్ట్రంలో నూతన ఇసుక పాలసీ ప్రకటించిన తరువాత ప్రారంభంలో 5 వేల టన్నుల ఇసుక సరఫరాకు అవకాశం ఉండగా, దాన్ని ఇప్పుడు 45 వేల టన్నులకు పెంచగలిగాం. వరద ప్రవాహం వల్ల నదులు, వాగుల్లో ఇసుక తవ్వే అవకాశం లేకపోవడం వల్ల ప్రత్యామ్నాయంగా పట్టా భూముల్లో మేట వేసిన ఇసుకను సేకరిస్తున్నాం. ఇందుకోసం టన్నుకు రూ.100 చొప్పున చెల్లిస్తామని భూయజమానులతో ఒప్పందాలు చేసుకుంటున్నాం. ఇప్పటికే 82 మంది పట్టా భూముల యజమానులు ఇసుక తవ్వకాల కోసం ఒప్పందాలు చేసుకున్నారు. 10 పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలకు అనుమతి కూడా ఇచ్చాం. మరో 15 రోజుల్లో ఇసుక కొరత లేకుండా అడిగిన వారందరికీ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. 

‘క్రెడాయ్‌’కి 50 వేల టన్నుల ఇసుక అందించాం 
కొత్త ఇసుక పాలసీ అమల్లోకి వచ్చిన తర్వాత గత 30–40 రోజుల్లో ఇసుక కోరుతూ దరఖాస్తు చేసుకున్న వారికి 6 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక సరఫరా చేశాం. రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(క్రెడాయ్‌) ప్రతినిధులతో మాట్లాడి, వారి అవసరాలకు మరో 50 వేల టన్నుల ఇసుక అందించాం. నిర్మాణ రంగ సంఘాలతో సమావేశాలు నిర్వహించి, వారి అవసరాలు ఎంత, ఏ మేరకు ఇసుకను అందించాలి అనేదానిపై అవగాహనకు వచ్చాం. 

ఆదాయం పోయిందనే అక్కసుతోనే... 
నదుల్లోని ఇసుకను యథేచ్ఛగా దోచుకున్న తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడు అధికారం, ఆదాయం పోయిందనే అక్కసుతోనే ఇసుక లభ్యతపై రాజకీయం చేస్తున్నారు. సాధారణంగానే వర్షాకాలంలో భవన నిర్మాణ రంగంలో పనులు నెమ్మదిస్తాయి. నదుల్లోని ఇసుకను టీడీపీ నాయకులు విచ్చలవిడిగా దోచుకున్న ఫలితంగా కృష్ణా నదిలో ఇసుక గోతుల్లో ఓ బోటు మునిగి చాలామంది మరణించారు. ఇసుక దోపిడీపై గ్రీన్‌ ట్రిబ్యునల్‌ చంద్రబాబు ప్రభుత్వానికి ఏకంగా రూ.100 కోట్ల జరిమానా కూడా విధించింది. అలాంటి తప్పుడు విధానాలకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకం. 

ఎంశాండ్‌ యూనిట్లకు ప్రోత్సాహం 
రాష్ట్రంలో ఇసుకకు ప్రత్యామ్నాయంగా కంకర నుంచి తయారుచేసే ఎంశాండ్‌ యూనిట్లకు ప్రోత్సాహాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఉన్న మెటల్‌ క్వారీల్లో ఎంశాండ్‌ యూనిట్లు నెలకొల్పే వారికి పావలా వడ్డీకి రుణాలు అందించాలన్న ప్రతిపాదనను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిశీలిస్తున్నారు’’ అని మంత్రి వివరించారు.  

భవిష్యత్తులో ఇసుక కొరతే రాదు 
తాజా వరదల కారణంగా నదుల్లో దాదాపు 10 కోట్ల టన్నుల ఇసుక చేరింది. సాధారణంగా రాష్ట్రంలో ఏటా 2 కోట్ల టన్నుల ఇసుక మాత్రమే వినియోగిస్తున్నారు. అంటే మరో ఐదేళ్లకు సరిపడా ఇసుక నిల్వలు రాష్ట్రంలో ఉన్నాయి. రాష్ట్రంలో భవిష్యత్తులో ఇక ఇసుక కొరతే ఉండదు. మరో పదిహేను రోజుల్లో వరదలు తగ్గుముఖం పడతాయని భావిస్తున్నాం. వరద నీరు తగ్గగానే రీచ్‌ల నుంచి కావాల్సినంత ఇసుకను వినియోగదారులకు అందజేస్తాం. 

మరిన్ని వార్తలు