'కాంగ్రెస్ పార్టీని ఎదిరించినందుకే జగన్‌మోహన్‌రెడ్డిపై అణచివేత'

4 Jul, 2013 02:57 IST|Sakshi
'కాంగ్రెస్ పార్టీని ఎదిరించినందుకే జగన్‌మోహన్‌రెడ్డిపై అణచివేత'
మద్దతు ఉపసంహరించిన రాజకీయ పార్టీలపై కక్షసాధింపులో భాగంగా సీబీఐని వాడుకొని కేసులు పెట్టడం ద్వారా కాంగ్రెస్ పార్టీ వేధింపులకు గురి చేస్తోందని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుశీల్‌కుమార్ స్పష్టం చేశారు. ‘‘దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీల నేతలంతా సీబీఐ కేసులను ఎదుర్కొంటున్న వారే. అధికార పార్టీకి అనుకూలంగా మారాక సదరు నేతలపై కేసులు వీగిపోయిన తీరు అందరికీ తెలుసు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీని ఎదిరించినందుకే ఆయనపై అణచివేత మొదలైంది’’ అని వివరించారు. జగన్ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి సీసీ నంబర్ 9 (రెండోది-జగన్, సాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్‌పై) చార్జిషీట్‌లో దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్‌ను విచారణకు స్వీకరించరాదని కోరుతూ ఆడిటర్ వేణుంబాక విజయసాయిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు బుధవారం విచారించారు. ఈ సందర్భం గా సాయిరెడ్డిని కోర్టులో ప్రత్యక్షంగా హాజరు పరిచారు. ఆయన తరఫున సీనియర్ న్యాయవాది సుశీల్‌కుమార్ వాదనలు వినిపించారు. 
 
 జగన్ కంపెనీల్లో ముగ్గురు వ్యక్తుల పెట్టుబడులకు సంబంధించిన సీసీ నంబర్ చార్జిషీట్‌ను 2012 ఏప్రిల్ 23న కోర్టుకు సీబీఐ సమర్పించిందని తెలిపారు. దర్యాప్తులో కొత్తగా వెలుగుచూసిన అంశమేదీ లేకపోయినా దాదాపు 14 నెలల తర్వాత అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసిందని ఆరోపించారు. ‘‘ఓబీసీ బ్యాంక్ పార్ట్‌టైమ్ డెరైక్టర్‌గా సాయిరెడ్డి పని చేశారు గనుక ఆయన పబ్లిక్ సర్వెంట్ హోదాలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీబీఐ ఆరోపిస్తూ దాన్ని దాఖలు చేసింది. కానీ సాయిరెడ్డి బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకించిన ప్రతి సందర్భంలోనూ ఈ విషయాన్ని సీబీఐ తెలిపింది’’ అని గుర్తు చేశారు. బెయిల్ పిటిషన్లపై సీబీఐ దాఖలు చేసిన కౌంటర్లలోనూ ఈ విషయాన్ని పేర్కొనడాన్ని కోర్టుకు దృష్టికి తెచ్చారు. 2011 ఆగస్టు 17న ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీబీఐ, 300 గంటలపాటు సాయిరెడ్డిని ప్రశ్నించిందన్నారు. ఎఫ్‌ఐఆర్ నమోదుకు ముందే సీబీఐకి ఈ విషయం తెలుసని, ఇది సీబీఐ కేసు డైరీల్ని పరిశీలించినా తేలుతుందని చెప్పారు. సీబీఐ చెప్పే అబద్ధాలకు తమను బలిపశువులను చేస్తే ఎలా అని ప్రశ్నించారు. కేసు డైరీలను సమర్పించేలా సీబీఐని ఆదేశించాలని, దర్యాప్తు పూర్తయిందని గతంలో చెప్పారా, లేదా అన్నదానిపై అఫిడవిట్ దాఖలు చేసేలా దర్యాప్తు అధికారిని ఆదేశించాలని కోరారు.
 
 సీబీఐ అబద్ధాలకోరు
 
 దర్యాప్తు పూర్తయ్యిందని చెప్పిన చార్జిషీట్‌కు అనుబంధ చార్జిషీట్ దాఖలు చేయడం కోర్టులను తప్పుదోవ పట్టించడమేనని సుశీల్‌కుమార్ తెలిపారు. ‘‘సీబీఐ అబద్ధాలకోరుగా మారింది. అబద్ధాలు చెబుతూ కోర్టులనూ మోసం చేస్తోంది. సీసీ నంబర్ 9వ చార్జిషీట్‌లో దర్యాప్తు పూర్తయిందా అని ఇదే కోర్టు న్యాయమూర్తి ప్రశ్నించినప్పుడు, పూర్తయిందని అప్పటి సీబీఐ డిప్యూటీ లీగల్ అడ్వైజర్ బళ్లా రవీంద్రనాథ్ నిర్ధారించారు. ఎలాంటి అనుబంధ చార్జిషీట్లూ దాఖలు చేయబోమని నిర్ధారించారు. అప్పుడు కోర్టు హాల్లోనే ఉన్న దర్యాప్తు అధికారి వెంకటేశ్‌ను సంప్రదించి మరీ ఆ మేరకు చెప్పారు’’ అని వివరించారు. ఆ రోజున సీబీఐ అలా చెప్పిందా లేదా స్పష్టం చేస్తూ అఫిడవిట్ దాఖలు చేసేలా దర్యాప్తు అధికారిని ఆదేశించాలని కోరారు. 
 
 అనుబంధ చార్జిషీట్ వేయబోమని...అభియోగాల నమోదు ప్రక్రియను ప్రారంభించాలని స్పష్టం చేసిన తర్వాత మళ్లీ వేయడం కోర్టుధిక్కరణ కిందకు వస్తుందని ఆయన తేల్చిచెప్పారు. దర్యాప్తులో కొత్త విషయాలేవీ లేనప్పుడు దాఖలు చేసే చార్జిషీట్లకు విలువుండదని పేర్కొన్నారు. ఈ మేరకు పలు కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను, లా కమిషన్ చేసిన సిఫార్సులను ప్రస్తావించారు. కోర్టులకు సీబీఐ చెబుతున్న మాటలకు, చేతలకు పొంతన లేదన్నారు. ఈ నేపథ్యంలో సీబీఐ అనుబంధ చార్జిషీట్‌ను విచారణకు స్వీకరించరాదని విజ్ఞప్తి చేశారు. ‘‘సీబీఐ తప్పుడు ప్రవర్తనను గర్హిస్తూ అనుబంధ చార్జిషీట్‌ను తిరస్కరించే అధికారం ఈ కోర్టుకు ఉంది. నిబంధనలకు విరుద్ధంగా సీబీఐ వ్యవహరిస్తున్నప్పుడు కోర్టులు జోక్యం చేసుకొని న్యాయం చేయవచ్చు. మాకిప్పుడు కోర్టులే న్యాయం చేయగలవు’’ అని నివేదించారు.
 
 నమ్మి మోసపోయాం...
 
 సీసీ నంబర్ 9లో అనుబంధ చార్జిషీట్లు ఉండవన్న సీబీఐ మాట నమ్మి తాము మోసపోయామని, డిశ్చార్జ్ పిటిషన్‌పై వాదనలు ప్రారంభించామని సుశీల్‌కుమార్ వివరించారు. ‘‘సీసీ నంబర్ 9 చార్జిషీట్‌లో పబ్లిక్ సర్వెంట్స్ ఎవరూ లేరని, ఆ చార్జిషీట్‌ను విచారించే పరిధి ఈ కోర్టుకు లేదని మేం వాదనలు విన్పించాకే సాయిరెడ్డిని పబ్లిక్ సర్వెంట్‌గా పేర్కొం టూ సీబీఐ అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 9 సాయిరెడ్డికి ఎట్టి పరిస్థితుల్లోనూ వర్తించదు. పలు కేసుల్లో సుప్రీంకోర్టు ఈ మేరకు ఇచ్చిన తీర్పులను ఈ కోర్టు దృష్టికి తెచ్చాం. దాంతో అప్రమత్తమైన సీబీఐ, సాయిరెడ్డి ఓబీసీ డెరైక్టర్ కాబట్టి పబ్లిక్ సర్వెంట్ హోదాలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ పీసీ యాక్టులోని సెక్షన్ 13 కింద కొత్తగా అభియోగాలు నమోదు చేయాలంటూ అనుబంధ చార్జిషీట్ వేసింది. 
 
 ఆయన ఓబీసీ డెరైక్టర్‌గా పని చేసిన విషయం సీబీఐకి రెండేళ్ల క్రితమే తెలుసు. మరి దాన్ని ఇన్ని రోజులు ఎందుకు దాయాల్సి వచ్చింది? కేవలం ఆయన్ను పబ్లిక్ సర్వెం ట్‌గా చేర్చి పీసీ యాక్టు వర్తింపజేసే కుట్రలో భాగంగానే అనుబంధ చార్జిషీట్ వేసింది. మేం మా వాదనలో బయట పెట్టిన వాటన్నింటినీ సరిచేసుకొని అనుబంధ చార్జిషీట్ వేసింది. మొదటి నుంచీ మా ఆందోళన కూడా ఇదే. దర్యాప్తు పూర్తయేదాకా తుది విచారణను ఆపకపోతే అన్యాయం జరిగే ప్రమాదముందన్న మా ఆందోళనే నిజమైంది’’ అని వాదించారు. ఈ నేపథ్యంలో జగన్ కేసులో దర్యాప్తు పూర్తయ్యేదాకా తుది విచారణ (ట్రయల్) ఆపాలని కోరారు.
 
 ఎన్నైనా వేస్తాం: సీబీఐ
 
 దర్యాప్తులో వెలుగుచూసిన అంశాల ఆధారంగా ఎన్ని అనుబంధ చార్జిషీట్లయినా దాఖలు చేసే అధికారం తమకుందని సీబీఐ తరఫున స్పెషల్ పీపీ సురేంద్ర వాదించారు. సాయిరెడ్డి ఓబీసీ డెరైక్టర్ అన్న విషయం మాత్రమే తెలుసని, ఇటీవల దర్యాప్తులో లభించిన అనేక డాక్యుమెంట్లను ఆధారంగా చేసుకొని అనుబంధ చార్జిషీట్ దాఖలు చేశామని చెప్పారు. సీసీ నంబర్ 8 చార్జిషీట్‌లో దర్యాప్తు పూర్తయిందని మాత్రమే తాము చెప్పాం తప్ప సీసీ 9 చార్జిషీట్‌లో కాదని తెలిపారు. అనుబంధ చార్జిషీట్‌ను విచారణకు స్వీకరించరాదని కోరే అధికారం నిందితులకు లేదన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి తన నిర్ణయాన్ని ఈ నెల 26కు వాయిదా వేశారు. అన్ని చార్జిషీట్లనూ కలిపి విచారించాలని కోరుతూ సీసీ 10 చార్జిషీట్‌లో జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ కూడా ఈ నెల 26కు వాయిదా పడింది. ఈ కేసులో తనను అక్రమంగా ఇరికించారని, చార్జిషీట్ నుంచి తన పేరును తొలగించాలని కోరుతూ సాయిరెడ్డితో పాటు ఇతర నిందితులు దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లపై కూడా విచారణ 26కు వాయిదా పడింది. వాన్‌పిక్ కేసు నిందితుడు మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈ నెల 10కి వాయిదా పడింది.
 
 కోర్టుకే నిస్సిగ్గుగా అబద్ధాలు!
 సీబీఐ రెండు నాల్కల ధోరణి
 
 సీబీఐ తన రెండు నాల్కల ధోరణిని మరోసారి నిరూపించుకుంది. సీసీ నంబర్ 9 చార్జిషీట్‌లో దర్యాప్తు పూర్తి కాలేదని తామెప్పుడూ చెప్పలేదంటూ ప్రత్యేక కోర్టు సాక్షిగా నిస్సిగ్గుగా అబద్ధం చెప్పింది. దర్యాప్తు పూర్తయిందని తాము చెప్పింది సీసీ నంబర్ 8 చార్జిషీట్‌లో మాత్రమేనని అడ్డంగా వాదించింది. నిజానికి సీసీ నంబర్ 8, 10 చార్జిషీట్లలో దర్యాప్తు పూర్తయిందని కోర్టుకు సీబీఐ ఇప్పటికే రాతపూర్వకంగా నివేదించింది. సీసీ నంబర్ 9లోనూ దర్యాప్తు పూర్తయిందని ఈ సందర్భంగానే కోర్టు ప్రశ్నించినప్పుడు అంగీకరించింది. పైగా ఇకపై ఎలాంటి అనుబంధ చార్జిషీట్లూ దాఖలు చేయబోమని సీబీఐ డిప్యూటీ లీగల్ అడ్వయిజర్ బళ్లా రవీంద్రనాథ్ జూన్ 5న స్పష్టం చేశారు. ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావుకు మౌఖికంగా ఇదే విషయాన్ని పేర్కొన్నారు. దాన్ని పత్రికలూ ప్రచురించాయి. సీబీఐ అలా చెప్పినందుకే, అన్ని చార్జిషీట్లనూ కలిపి విచారించాలన్న జగన్ పిటిషన్‌ను ప్రత్యేక కోర్టు కొట్టేసింది. కానీ 30 రోజుల్లోనే సీబీఐ మాట మార్చింది. ఎలాంటి అనుబంధ చార్జిషీట్లూ దాఖలు చేయబోమని కోర్టు ముందు అంగీకరించిన విషయాన్ని పక్కనబెట్టి మరీ సీసీ నంబర్ 9 చార్జిషీట్‌లో జూన్ 17న అనుబంధ చార్జిషీట్ దాఖలు వేసింది! ఇలా కోర్టులకే సీబీఐ అబద్ధాలు చెప్పడంపై న్యాయవాద వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.
 
  •  ఎదిరించినందుకే అణచివేత- సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుశీల్‌కుమార్
  •  సీబీఐ అబద్ధాలకోరు.. కోర్టునూ ధిక్కరించింది
  •  అబద్ధాలకు మమ్మల్ని బలి పశువుల్ని చేస్తారా?
  •  అధికార పార్టీకి మద్దతివ్వకుంటే కక్ష సాధిస్తారు
  •  మాట విన్నాక కేసులను నీరుగార్చడం అందరికీ తెలుసు
  •  ప్రధాన పార్టీల నేతలంతా సీబీఐ కేసులను ఎదుర్కొంటున్న వారే
  •  సీసీ 9లో దర్యాప్తుపై కోర్టు ఆరా తీస్తే, పూర్తయిందని చెప్పింది
  •  ఎలాంటి అనుబంధ చార్జిషీట్లూ ఉండబోవని స్పష్టం చేసింది
  •  దర్యాప్తు అధికారి సమక్షంలోనే దీన్ని డీఎల్‌ఏ నిర్ధారించారు
  •  అయినా అనుబంధ చార్జిషీట్ వేసిందన్న సుశీల్‌కుమార్
  •  దాన్ని విచారణకు స్వీకరించొద్దని కోర్టుకువిజ్ఞప్తి
  •  సాయిరెడ్డిని పబ్లిక్ సర్వెంట్‌గా చేర్చే కుట్రలో భాగమే
  •  ఆయన ఓబీసీ డెరైక్టర్‌గా చేశారని రెండేళ్ల క్రితమే తెలుసు
  •  జగన్ కేసులో దర్యాప్తు పూర్తయ్యేదాకా ట్రయల్ ఆపాలని విజ్ఞప్తి
  •  ఎన్ని అనుబంధ చార్జిషీట్లైనా వేసే అధికారం తమకుందన్న సీబీఐ
  •  8వ చార్జిషీట్‌లో మాత్రమే దర్యాప్తు పూర్తయిందని చెప్పామంటూ అబద్ధాలు
  •  వాదనలు పూర్తి... తీర్పు 26కు వాయిదా

 

మరిన్ని వార్తలు