ఎస్వీయూలో కలకలం

12 Dec, 2019 08:58 IST|Sakshi
ఎస్వీయూ పరిపాలన భవనం ఎదుట ఆందోళన చేస్తున్న విద్యార్థులు

వసతి గృహంలో ఏం జరుగుతోంది?

రాజీనామా చేసిన వార్డెన్, ప్రిన్సిపల్‌

సాక్షి, చిత్తూరు: ఎస్వీయూ ఇంజినీరింగ్‌ కళాశాల వసతి గృహంలో పనిచేస్తున్న టైం స్కేల్‌ ఉద్యోగి రామచంద్రయ్య ఆత్మహత్య క్యాంపస్‌లో కలకలం రేపుతోంది. ఈ సంఘటనతో విద్యార్థుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్, వార్డు వార్డెన్‌ పదవులకు రాజీనామా చేశారు. దీనిపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. ఈ సంఘటన క్యాంపస్‌లో సంచలనం రేపుతోంది. ఈ ఉద్యోగి తాను చనిపోయే ముందు తన చావుకు కారణాన్ని వీడియోలో రికార్డు చేసి పంపడం పలు ఆలోచనలకు రేకెత్తిస్తుంది. హాస్టల్‌ వార్డెన్, సూపరింటెండెంట్, మరో ఉద్యోగి తనను ఇబ్బందులకు గురిచేశారని వారిని నమ్మొద్దని, వసతి గృహం జాగ్రత్త అని విద్యార్థులకు తన వీడియో ద్వారా హెచ్చరించారు.

అసలేం జరుగుతోంది ?
ఎస్వీ ఇంజినీరింగ్‌ కళాశాల 2017లో వరుస వివాదాల్లో చిక్కుకుంది. గత ఏడాది జూన్‌లో రెగ్యులర్, డ్యూయల్‌ డిగ్రీ కోర్సు విద్యార్థుల మధ్య గొడవలు పెరగడంతో అప్పటి ప్రిన్సిపల్‌ పద్మనాభం తన పదవికి రాజీనామా చేశారు. ఈ దశలో ప్రిన్సిపల్‌గా ప్రదీప్‌కుమార్‌ బాధ్యతలు చేపట్టారు.  వార్డెన్‌గా పనిచేస్తూ వచ్చిన చెంగయ్యను తొలగించాలని కోరుతూ ఈఏడాది జూన్‌లో విద్యార్థులు ఆందోళన చేశారు.

దీంతో ఆయన్ను తొలగించి సత్యనారాయణ మూర్తిని వార్డెన్‌గా నియమించారు. అయితే ఈ దశలో వసతిగృహంలో అనేక అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో స్టోర్‌ ఇన్‌చార్జ్‌గా ఉన్న రామచంద్రయ్యను వేరే చోటికి బదిలీ చేశారు. ఇదిలా ఉంటే ఆయన ఆత్మహత్యకు పాల్పడే ముందు వసతి గృహంలో తనపై నిందలు మోపారని వార్డెన్‌ సూపరింటెండెంట్‌ మరో ఉద్యోగిని నమ్మొద్దంటూ తాను విడుదల చేసిన వీడియోలో హెచ్చరించారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు బుధవారం ఆందోళన చేయడంతో వార్డెన్‌తో పాటు ప్రిన్సిపల్, వైస్‌ ప్రిన్సిపాల్‌ తమ పదవులకు రాజీనామా చేశారు.

విద్యార్థుల ఆందోళన
ఎస్వీ యూనివర్సిటీ ఇంజనీరింగ్‌ కళాశాల అనుబంధ వసతి గృహంలో స్టోర్‌ ఇన్‌చార్జ్‌గా పనిచేస్తూ 10 రోజుల క్రితం అదే వసతి గృహంలో వేరే విధులకు బదిలీ అయిన టైంస్కేల్‌ ఉద్యోగి రామచంద్రయ్య(52) మృతిపట్ల ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులు భగ్గుమన్నారు. బుధవారం తరగతులు బహిష్కరించి పరిపాలన భవనం ఎదుట ఆందోళనకు దిగారు. తమతో ఆత్మీయంగా ఉంటూ సేవలు అందిస్తున్న ఉద్యోగి ఆత్మహత్య విద్యార్థులను ఎంతో కలతకు గురిచేసింది. దీంతో విద్యార్థులు పరిపాలనా భవనం ఎదుట బైఠాయించి ధర్నాచేశారు. వార్డెన్, ప్రిన్సిపాల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థుల ఆందోళనకు వైఎస్సార్‌ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్‌.రాజశేఖర్‌రెడ్డి , యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి బి. ఓబుల్‌ రెడ్డి మద్దతు ప్రకటించారు.

అధికారుల వేధింపుల వల్లే ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. ఎస్వీయూ ఇంజినీరింగ్‌ కళాశాల వసతి గృహంలో పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుంటోందని, దీనిపై విచారణ జరిపి కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు ప్రేమ్, సదాశివ, ముని, ప్రభు, మురళీకృష్ణ పాల్గొన్నారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో ప్రిన్సిపాల్‌ ప్రదీప్‌కుమార్, వైస్‌ ప్రిన్సిపాల్‌ నాగేంద్రప్రసాద్, వార్డెన్‌ సత్యనారాయణమూర్తి, తమ పదవులకు రాజీనామా చేశారు.

ఉద్యోగికి న్యాయం చేయాలి
ఎస్వీయూ ఇంజినీరింగ్‌ కళాశాల వసతి గృహంలో పనిచేస్తూ మృతిచెందిన టైంస్కేల్‌ ఉద్యోగి రామచంద్రయ్య కుటుంబానికి తగిన న్యాయం చేయాలని టైంస్కేల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సుబ్రమణ్యంరెడ్డి రిజిస్ట్రార్‌ను కోరారు. ఆయన కుటుంబ సభ్యులకు టైంస్కేల్‌ ఉద్యోగం ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. తమ అభ్యర్థనకు రిజిస్ట్రార్‌ సానుకూలంగా స్పందించినట్లు ఆయన చెప్పారు.

మరిన్ని వార్తలు