చెత్త ఇలా.. సర్వేక్షణ్‌ ర్యాంకు ఎలా?

24 Dec, 2018 12:14 IST|Sakshi
కేబీఎన్‌ కళాశాల సమీపంలో పేరుకుపోయిన చెత్తాచెదారం

విజయవాడలో అమలుకాని ప్రజారోగ్య చట్టం

సెగ్రిగేషన్‌కే పరిమితమవుతున్న వీఎంసీ

అసంపూర్తిగా స్ట్రాంవాటర్‌ పనులు

కఠినతరంగా స్వచ్ఛ సర్వేక్షణ్‌ – 2019

స్వచ్ఛ సర్వేక్షణ్‌ ర్యాంకుకు దేశంలోని నాలుగు వేల నగరాలతో పోటీ పడుతున్న విజయవాడ నగర పాలక సంస్థకు మరోసారి ర్యాంకు సాధించిపెట్టాలని అధికారులు తాపత్రయ పడుతున్నారు. అయితే క్షేత్రస్థాయి పరిశీలన తూతూమంత్రంగా మారింది. ఓడీఎఫ్‌ (ఓపెన్‌ డెఫికేషన్‌ ఫ్రీ–బహిరంగ మల, మూత్ర విసర్జన) రహిత నగరంగా తీర్చిదిద్దామని చెబుతున్న పాలకులు, అధికారులు వాటిని నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన నమ్మా టాయిలెట్లు, స్మార్ట్‌ టాయిలెట్ల నిర్వాహణ సక్రమంగా లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.  

పటమట(విజయవాడ తూర్పు): విజయవాడలో 2900 మంది కార్మికులు.. 380 డంబర్‌బిన్‌లు, 206 కంపోస్ట్‌ బిన్‌లు.. 58 భారీ వాహనాలు.. 10 చిన్నతరహా వాహనాలు.. ప్రతినిత్యం నగరపాలక సంస్థ పరిధిలోని ఆయా ప్రాంతాల్లో ఉత్పత్తయ్యే 550 మెట్రిక్‌ టన్నుల చెత్తను తరలించేందుకు.. కంపోస్ట్‌ చేసేందుకు 24 గంటలు పనిచేసే యంత్రాంగం.. స్వచ్చ భారత్‌ నినాదంతో చెత్త రహిత నగరంగా మార్చేందకు కార్పొరేషన్‌ ఉన్నతాధికారులు ప్రతినిత్యం క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నప్పటికీ పారిశుద్ధ్యం నిర్వహణ విధానంలో వెలితి కన్పిస్తూనే ఉంటుంది. నగరంలోని అత్యధికంగా జనాభా నివసించే ప్రాంతాలైన వాగుసెంటర్, అజిత్‌సింగ్‌నగర్, పాయకాపురం, డాబాకొట్ల సెంటర్, గుణదల, సీతారాంపురం, పటమట దర్శిపేట, రామలింగేశ్వరనగర్‌ తదితర ప్రాంతాల్లో ఎక్కడవేసిన చెత్త అక్కడే ఉంటోంది. డంపర్‌బిన్లు చెత్తతో నిండి రోడ్లపైకి, డ్రెయినేజీల్లోకి చెత్త వెళుతోందని స్థానికులు వాపోతున్నారు. కాల్వల వెంబడి టన్నుల కొద్ది చెత్త దర్శనమిస్తోంది.చాలా వరకు పారిశుద్ధ్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఉన్నతాధికారులు పరిశీలనకు వచ్చినప్పుడుమాత్రమే విధులు సక్రమంగా నిర్వహిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. 

సర్వేక్షణ్‌ సర్వే జరిగేదిలా..
స్వచ్ఛ సర్వేక్షణ్‌ ర్యాంకు సాధించడం వల్ల నగరానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు సమకూరతాయి.  2018 స్వచ్ఛ సర్వేక్షణ్‌ ర్యాంకులో విజయవాడ నగర పాలక సంస్థ 10 లక్షలకు పైగా జనాభా కలిగిన నగరాల విభాగంలో మొదటి ర్యాంకు సాధించింది. ఈ ర్యాంకును వచ్చే సంవత్సరంలో కూడా సాధించాలని అధికారులు చర్యలు చేపడుతున్నారు. మరో 15 రోజుల్లో సర్వే ప్రారంభం అవుతోంది.

ఈ సారి సర్వే కఠినతరం
గతంలో మాదిరిలా కాకండా ఈ సారి కఠినమైన మార్పులతో సర్వే జరగనుంది. గతంలో ర్యాంకు సాధనకు 4000 మార్కులు కాగా ఈ సారి 5000 మార్కులు నిర్ణయించారు. అత్యధికంగా సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్, ఓడీఎఫ్‌పై దృష్టి సారించనుంది. సర్వేక్షణ్‌ పరిశీలకులు నగరంలో పర్యటించి డైరెక్ట్‌ అబ్జర్వేషన్‌ ద్వారా 1250 మార్కులు, సర్వీస్‌ లెవల్‌ ప్రాసెస్‌కు 1250, ఓడీఎఫ్, ఓడీఎఫ్‌ ప్లస్, ఓడీఎఫ్‌ ప్లస్‌ప్లస్‌ 5 శాతం అంటే 250 మార్కులు ఈ కేటగిరీకి కేటాయించనున్నారు. స్టార్‌ రేటింగ్, సర్టిఫికేషన్‌కు 20 శాతం మార్కులు కేటాయించాల్సి ఉంది. వీటితోపాటు నగరంలోని మౌలిక వసతులు, సుందరీకరణ, రహదార్ల నిర్మాణం, పన్నుల చెల్లింపులు తదితర అంశాలు కూడా అంతర్గతంగా పరిశీలిస్తారు. వీటికితోడు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధుల వినియోగం, పథకాల అమలు తదితర అంశాలను కూడా పరిశీలనకు తీసుకుంటారు. పూర్తికాని స్ట్రామ్‌వాటర్‌ డ్రెయిన్‌ పనులుకేంద్ర ప్రభుత్వం అమృత్‌ పథకం కింద స్ట్రామ్‌వాటర్‌ డ్రెయిన్‌ పనులకు రూ. 440 కోట్ల నిధులను 2016లో కేటాయించి విడుదల చేసింది. ఇప్పటివరకు నగరంలో 150 కిలోమీటర్లు కూడా పూర్తవలేదు.దీనికితోడు 440 కిలోమీటర్ల దూరా నికి వీఎంసీ 300 కిలోమీటర్ల దూరం కుదించి నిధులను దుర్వినియోగం చేసిందనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈ ప్రభావం ర్యాంకుపై పడనుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  

పారిశుద్ధ్యం మెరుగుదలకు చర్యలు
నగరంలోని వివిధ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం మెరుగుదలకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి చోటా సెగ్రేషన్‌ విధానాన్ని అమలు చేస్తున్నాం. తడిచెత్త, పొడిచెత్త వేరుచేయని వారి నుంచి చెత్త సేకరణ చేయడంలేదు. పబ్లిక్‌ ప్రాంతాల్లో చెత్త వేస్తే వారి నుంచి అపరాధ రుసుం వసూలు చేస్తున్నాం. విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం.
– అర్జునరావు, సీఎంఓహెచ్‌

మరిన్ని వార్తలు