చిన వెంకన్నపైనే ‘ముళ్ల’పూడి టార్గెట్ ఎందుకు!?

29 Nov, 2015 03:20 IST|Sakshi

జిల్లా పరిషత్ చైర్మన్, టీడీపీ నేత ముళ్లపూడి బాపిరాజు ఇటీవల కాలంలో చీటికీ మాటికీ ద్వారకా తిరుమల ఆలయ పాలకవర్గాన్ని, అధికారులను టార్గెట్ చేస్తుండటం చర్చనీయాంశమవుతోంది. జిల్లావ్యాప్తంగా ఎన్నో ఆలయాలు  ఉన్నప్పటికీ వాటి అభివృద్ధిపై కించిత్ దృష్టి సారించని జెడ్పీ చైర్మన్ కేవలం చినవెంకన్న ఆలయ వ్యవహారాలను రచ్చకీడుస్తుండటం వివాదాస్పదమవుతోంది. వాస్తవానికి ద్వారకాతిరుమల ఆలయం ఎన్నో దశాబ్దాలుగా ట్రస్టుబోర్డు పాలనలోనే నడుస్తోంది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు.. తొమ్మిదేళ్లు చంద్రబాబు సీఎంగా బాధ్యతలు నిర్వర్తించిన సమయంలోనూ ఇదే ట్రస్టుబోర్డు కొనసాగింది. ఇప్పుడు అదే పాలకవర్గంపై ఒంటెత్తు పోకడలతో విరుచుకుపడటం వెనుక బాపిరాజు ‘అసహనం’ చాలానే ఉంది.
 
 ఇటీవల ద్వారకాతిరుమలలో విర్డ్స్ ఆసుపత్రి భవనం ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకంపై తన పేరు వేయలేదని బాపిరాజు రచ్చ చేసిన సంగతి తెలి సిందే. ఆయన ఒత్తిళ్లతో ఆలయ పాలకవర్గం ఐదుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసింది. ఉద్యోగ సం ఘాల ఆందోళనలు వెల్లువెత్తడంతో వెనక్కి తగ్గిన పాలకవర్గం సస్పెన్షన్ ఎత్తివేసింది. దరిమిలా బాపిరాజు ‘అహం’ దెబ్బతింది. అప్పటినుంచి  ఆలయ వ్యవహారాలపై రగిలిపోతున్న ఆయన ఈనెల 22న జెడ్పీ సర్వసభ్య సమావేశంలో మరోసారి ఆలయ అధికారులపై విరుచుకుపడ్డారు. దేవస్థానం ఆదాయ, వ్యయాలపై పూర్తిస్థాయిలో జిల్లా పరిషత్‌కు సమాచారం కావాలంటూ తీర్మానం చేయించారు. మద్యం తాగుతున్నారు.. పేకాట ఆడుతున్నారంటూ ఆలయ ఉద్యోగులపై విరుచుకుపడ్డారు.
 
 మిగిలిన ఆలయాల ఊసు పట్టదా?
 జిల్లాలో దేవాదాయ శాఖకు చెందిన 64 ఆలయాలకు సంబంధించి 367.09 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది.  దీని నిమిత్తం మార్కెట్ విలువ ప్రకారం రూ.25 కోట్ల 75 లక్షల 86వేల 254లను దేవాదాయ శాఖకు చెల్లించాలి. కానీ కేవలం రూ.2కోట్ల 79లక్షల 35వేల 453 మాత్రమే చెల్లించింది. దీనిపై జిల్లా పరిషత్ చైర్మన్ హోదాలో ముళ్లపూడి బాపిరాజు సర్కారు నుంచి దేవాదాయ శాఖకు నిధులు అందించే దిశగా కనీస చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. జిల్లాలో రూ.25 లక్షలకు పైగా వార్షిక ఆదాయం వచ్చే ఆలయాలు 14, రూ.2లక్షల నుంచి రూ.25లక్షల లోపు ఆదాయం వచ్చే ఆలయాలు 52 ఉన్నాయి.
 
  వాటిలోనూ లెక్కకు మించిన సమస్యలున్నాయి. ఇక ధూపదీప నైవేద్యాలకు నోచుకోని ఆలయాలు 1,400 పైబడి ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా దేవాదాయ శాఖ పరిధిలోని 41 ఆలయాలకు సంబంధించిన భూముల్లో 206 ఎకరాలు కబ్జాదారుల చెరలో చిక్కుకున్నాయి. వీటిపై జిల్లాకే చెందిన.. ఇంకా చెప్పాలంటే సొంత నియోజకవర్గానికే చెందిన దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుతో చర్చించి చర్యలు తీసుకునే అవకాశముంది. ఇవేమీ పట్టించుకోకుండా ద్వారకాతిరుమల వ్యవహారాలపైనే ఆయన దృష్టి పెట్టడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పోనీ పక్కా సమాచారంతో ఆలయ వ్యవహారాల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలను బయటపెట్టినా బాపిరాజు ‘ఉక్రోషానికి’ అర్థముంటుంది. కానీ.. కేవలం ఆలయంపై పట్టుకోసం, అధికారులను, ఉద్యోగులను వెంటపడి వేధించడమే లక్ష్యంగా బాపిరాజు పావులు కదుపుతున్నారనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం.
 - జి.ఉమాకాంత్,
 సాక్షి ప్రతినిధి, ఏలూరు
 

మరిన్ని వార్తలు