మృత్యు శకటాలు

29 Nov, 2015 03:16 IST|Sakshi
మృత్యు శకటాలు

పెరుగుతున్న ఆర్టీసీ ప్రమాదాలు
* ఈ ఏడాది ఇప్పటి వరకు 51మంది మృత్యువాత  
* పక్షవాతం నుంచి కోలుకోకుండానే విధుల్లోకి డ్రైవర్
 సాక్షి, సిటీబ్యూరో: ఆర్టీసీ బస్సులు మృత్యు శకటాలవుతున్నాయి. నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. ఈ ఏడాది వీటి కారణంగా 126 ప్రమాదాలు సంభవించాయి. నిర్లక్ష్యంగా బస్సులను నడిపిన ఆర్టీసీ డ్రైవర్లు 51 మంది అమాయకులను పొట్టన పెట్టుకున్నారు. ఈ పాపంలో అధికారులూ పరోక్షంగా పాలు పంచుకుంటున్నారు.

మూడు నెలలుగా పక్షవాతంతో బాధ పడుతున్న డ్రైవర్ ఆరోగ్య పరిస్థితిని ఏమాత్రం ఆరా తీయకుండానే బస్సు అప్పగించి ప్రమాదానికి కారణమయ్యారు.శనివారం నగరంలోని కవాడీగూడలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు విద్యార్థినులు ప్రాణాలు కోల్పోయారు. దోమలగూడలో కళాశాల వేడుకల్లో పాల్గొనేందుకు స్కూటీపై వెళుతున్న సుస్మిత శర్మ, నరీజాలను బస్సు ఢీకొనడంతో దుర్మరణం పాలయ్యారు.

చెంగిచెర్ల డిపో డ్రైవర్ సత్తయ్యకు అకస్మాత్తుగా  పక్షవాతం లక్షణాలు తిరగబెట్టడంతో బస్సును అదుపు చేయలేకపోయాడు. కాలుతో బ్రేకులను కూడా నొక్కలేని పరిస్థితుల్లో అమ్మాయిల మృతికి కారణమయ్యాడు. ఈ ఒక్క ఉదంతంలోనే కాదు. ఇటీవల కాలంలో అనేక ప్రమాదాల్లో ఆర్టీసీ నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కనిపిస్తున్నాయి.

ఏమాత్రం అనుభవం, శిక్షణ లేని డ్రైవర్లకు బస్సులను అప్పగించడంతో రహదారులపై యమదూతల్లా దూసుకొస్తున్నారు. రెండు రోజుల క్రితం బండ్లగూడ డిపో బస్సు ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో ఓ యువకుని బలి తీసుకున్న సంఘటన మరువక ముందే శనివారం మరో ఇద్దరు విద్యార్థినుల ప్రాణాలు గాలిలో కలిసిపోవడం అందరినీ కలచివేస్తోంది.
 
వరుసగా ప్రమాదాలు....
ఆర్టీసీ డ్రైవర్ల నిర్లక్ష్యానికి ఏటా  వందలాది మంది ప్రమాదాల బారిన పడుతున్నారు. పదుల సంఖ్యలో మృత్యువు పాలవుతున్నారు. ఇటీవల సికింద్రాబాద్ ప్యాట్నీ వద్ద ఓ మహిళ ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా మృత్యువాత పడింది. గత ఏడాది నాచారం ప్రాంతంలో ఆపకుండా ముందుకు దూకించిన ఘటనలో బస్సు దిగబోతూ ఓ వృద్ధురాలు కన్నుమూసింది.

గుంటూరుకు చెందిన అరుంధతి అనే మహిళ సికింద్రాబాద్‌లో ఆటో దిగి వెళ్తుండగా, బస్సును రివర్స్ తీసే క్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డ్రైవర్ ఆమె ప్రాణం పోవడానికి కారణమయ్యాడు. జూబ్లీహిల్స్‌లో కమలమ్మ అనే మహిళ రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బస్సు పొట్టన పెట్టుకుంది. ఆమె ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. రామంతాపూర్‌కు చెందిన క్యాటరర్ శ్రీనివాస్‌రెడ్డి వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొని చనిపోయాడు.

గుడికి వెళ్లి వస్తున్న భార్యాభర్తలు ద్విచక్ర వాహనంపై రోడ్డు దాటుతుండగా ఉప్పల్‌లో ఓ ఆర్టీసీ బస్సు వారి ప్రాణాలు బలిగొంది. గత రెండేళ్లలో మొత్తం 270 బస్సు ప్రమాదాలు జరుగగా... 101 మంది మృత్యువాత పడ్డారు. ఇలా పెద్ద ఎత్తున ప్రమాదాలు జరుగుతున్నా ఆర్టీసీ ఎలాంటి నివారణ చర్యలు చేపట్టకపోవడం ఆందోళనకు గురి చేస్తోంది.

సరైన శిక్షణ లేదు
* ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ జోన్‌లోని 28 డిపోల పరిధిలో 8 వేల మంది డ్రైవ ర్లు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో సగానికి పైగా గత 5 ఏళ్లలో కాంట్రాక్ట్ పద్ధతిలో చేరిన వాళ్లే.
* గతంలో లారీలు, డీసీఎంలు వంటి వాహనాలు నడుపుతూ ఆర్టీసీలో చేరిన వీరికి సరైన శిక్షణ ఉండడం లేదు. ప్రయాణికుల పట్ల, రహదారి నిబంధనలపై అవగాహన కల్పించడం లేదు. దీంతో నిర్లక్ష్యంగా బస్సులు నడుపుతున్నారు.
* ప్రమాదాలపై పోలీసులు కేసులు నమోదు చేసినా వ్యక్తిగతంగా డ్రైవర్ల విధి నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది లేకపోవడం వల్ల అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు.
* గత ఏడాది 6,346 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమో దు కాగా, ఈ ఏడాది  ఇప్పటి వరకు ఆ సంఖ్య 7,500 పైనే ఉండవచ్చునని పోలీసు వర్గాల అంచనా.
* మరోవైపు ఆర్టీసీ డ్రైవర్ అనుభవానికి సంబంధించిన అర్హతలను 5 ఏళ్ల నుంచి 3 ఏళ్లకు తగ్గించడం వల్ల పెద్ద సంఖ్యలో వచ్చి చేరారు. డ్రైవింగ్ లెసైన్సులను సైతం అక్రమంగా సొంతం చేసుకొని చేరిన వాళ్లే ఎక్కువ శాతం ఉన్నట్లు సమాచారం.
 
ఫిట్‌‘లెస్’ బస్సులు....

* మరోవైపు డొక్కు బస్సులు కూడా ప్రజల పాలిట మృత్యువుగా మారాయి. నగరంలో 3,850 బస్సులు ఉండగా, వాటిలో కనీసం 800 కాలం చెల్లినవే. ఇవితరచూ చెడిపోయి బ్రేక్‌డౌన్‌లకు గురవుతున్నాయి. అసలే సరైన శిక్షణ, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన లేని డ్రైవర్లు... ఆ పైన డొక్కు బస్సులు..వెరసి ప్రమాదాలకు దారి తీస్తున్నాయి.
* నగరంలో ఆర్టీసీ బస్సుల వల్లనే 11 శాతం రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు పోలీసులు చెబుతున్నారు.  
* సిగ్నల్ జంపింగ్, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకైతే లెక్కే లేదు.
 
నిరంతరం శిక్షణ
డ్రైవింగ్‌లో లోపాలు ఉన్నట్లు గుర్తించిన వారికి శిక్షణనిస్తాం. ప్రతి మంగళవారం అన్ని డిపోల నుంచి అలాంటి వ్యక్తులను ఎంపిక చేస్తాం. ఇది నిరంతర ప్రక్రియ. శనివారం ప్రమాదానికి కారణమైన డ్రైవర్ సత్తయ్య ఇప్పటి వరకు తన కేరీర్‌లో ఒక్క ప్రమాదానికి కూడా పాల్పడలేదు. ఆయనకు ఉత్తమ డ్రైవర్ అవార్డులు కూడా వచ్చాయి.     
- ఈడీ పురుషోత్తమ్ నాయక్

మరిన్ని వార్తలు