టీడీపీలో చలో ముట్లూరు టెన్షన్‌..!

16 Oct, 2018 08:08 IST|Sakshi

రావెలపై దాడికి యత్నించిన వారిని అరెస్ట్‌ చేయని పోలీసులు

టీడీపీ ముఖ్యనేతల ఒత్తిడితో కేసు నీరుగారుస్తున్నారనే ఆరోపణలు

నేడు చలో ముట్లూరుకు పిలుపునిచ్చిన దళిత సంఘాలు

నేడు ముట్లూరుకు జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మెంబర్‌ రాములు రాక

తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్న మాజీ మంత్రి రావెల

సాక్షి, గుంటూరు:  ప్రత్తిపాడు టీడీపీ నేతల మధ్య వివాదం తారస్థాయికి చేరింది. ఎమ్మెల్యే రావెల, జిల్లాకు చెందిన ఓ మంత్రి అనుచరులు గ్రూపులుగా ఏర్పడి పరస్పరం ఘర్షణలకు దిగుతున్నారు. గత నెలలో వినాయకుని విగ్రహం వద్దకు వెళ్లిన ఎమ్మెల్యే రావెలపై మరో వర్గం దాడికి యత్నించిన విషయం తెలిసిందే. వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు ఓ మంత్రి ఒత్తిడితో అరెస్టు చేయకుండా వదిలేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దళిత ఎమ్మెల్యేపైన దాడి జరిగి నెలరోజులు కావస్తున్నా ఇంతవరకు నిందితులను అరెస్టు చేయకపోవడంపై దళిత సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి.

 ఇప్పటికే  జాతీయ ఎస్సీ,ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు అందడంతో విచారణ జరిపేందుకు కమిషన్‌ సభ్యుడు రాములు మంగళవారం ముట్లూరు గ్రామానికి రావాల్సి ఉంది. అయితే కేంద్ర హోం మంత్రి రాజ్‌నా«థ్‌ సింగ్‌ పర్యటన నేపథ్యంలో బుధవారానికి వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. దళిత సంఘాలు  మంగళవారం చలో ముట్లూరు కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పోలీసులు అర్బన్‌ జిల్లా పరిధిలో 30 పోలీసు యాక్ట్, వట్టిచెరుకూరు మండలంలో 144 సెక్షన్‌ పెట్టారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే... ప్రత్తిపాడు నియోజకవర్గం వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామంలో గత నెలలో వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహానికి పూజలు చేసేందుకు వెళ్లిన  మాజీ మంత్రి, ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబును ఆయన వ్యతిరేక వర్గీయులు అడ్డుకుని దాడికి యత్నించిన విషయం తెలిసిందే.

 దీనిపై రావెల పీఏ పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు, పలు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. అయితే కేసు నమోదు చేసి నెల కావస్తున్నా, నిందితుల్లో ఏ ఒక్కరినీ పోలీసులు అరెస్టు చేయకపోవడంపై ఎమ్మెల్యే రావెల వర్గీయులతో పాటు, దళిత సంఘాలు మండి పడుతున్నాయి. సాక్షాత్తు దళిత ఎమ్మెల్యేపై దాడి జరిగితేనే పరిస్థితి ఇలా ఉంటే ఇక సామాన్య దళితులకు రక్షణ ఎక్కడిదంటూ ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఇప్పటికే జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేయడం, వారు పోలీసు ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే. అయితే నిందితులను అరెస్టు చేయకుండా జిల్లాలోని ఓ మంత్రితో పాటు, కొందరు ముఖ్యనేతలు పోలీసులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 నిందితులను అరెస్టు చేసే వరకు న్యాయ పోరాటం చేస్తానని, అవసరమైతే రాజీనామాకైనా సిద్ధపడతానంటూ మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు హెచ్చరించిన విషయం తెలిసిందే. మరోవైపు  రెండో వర్గం సైతం ఎమ్మెల్యే రావెల తమపై అక్రమ కేసులు పెట్టించి వేధింపులకు గురిచేస్తున్నారంటూ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ఇంటి వద్ద ఆందోళనకు దిగిన విదితమే.  ఇలా ఇరువర్గాలు  ఒకరిపై ఒకరు దూషణలకు దిగుతుండటంతో  జిల్లా టీడీపీ నేతలు తలలు పట్టుకుని కూర్చున్నారు. 

చలో ముట్లూరు పిలుపుతో ఉద్రిక్తత
ఈ నేపథ్యంలో దళిత సంఘాల నేతలు మంగళవారం చలో ముట్లూరుకు పిలుపునివ్వడంతో ముట్లూరు గ్రామంతో పాటు, ప్రత్తిపాడు నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు చలో ముట్లూరుకు అనుమతులు లేవని, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

చలో ముట్లూరుకు అనుమతి లేదు
గుంటూరు: చలో ముట్లూరు కార్యక్రమానికి పోలీసుల నుంచి ఎవరూ అనుమతులు తీసుకోని నేపథ్యంలో ఆ కార్యక్రమానికి పోలీసు అనుమతులు లేవని అర్బన్‌ ఎస్పీ సీహెచ్‌ విజయారావు సోమవారం విలేకరులకు తెలిపారు. ఇప్పటికే అర్బన్‌ జిల్లాలో పోలీస్‌ యాక్ట్‌–30 అమల్లో ఉన్న నేపథ్యంలో ధర్నాలు, ర్యాలీలు, «నిరసన కార్యక్రమాలు నిర్వహించడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబును వినాయక చవితి వేడుకల్లో పాల్గొనడాన్ని అడ్డగించిన నేపథ్యంలో వెల్లువెత్తిన ఫిర్యాదులపై  మంగళవారం ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సభ్యుడు రాములు ముట్లూరులో పర్యటిస్తారని స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా కార్యక్రమాలు కొనసాగించడం, అలాంటి కార్యక్రమంలో పాల్గొనడం నేరమని తెలిపారు. ముట్లూరు గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. శాంతిభద్రతల దృష్ట్యా 144 సెక్షన్‌ అమలు చేస్తున్నామని వివరించారు. డివిజన్‌ స్థాయి బందోబస్తుతో పాటు స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ బలగాలను కూడా కేటాయిస్తున్నామని తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు.

టీడీపీ హయాంలో     దళితులకు రక్షణ లేదు
టీడీపీ ప్రభుత్వ హయాలలో దళితులకు రక్షణలేదు. దళితుల మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. సాక్షాత్తు అధికార పార్టీకి చెందిన దళిత ఎమ్మెల్యేపై దాడికి పాల్పడినవారిని ఇప్పటివరకు అరెస్టు చేయకపోవడం దురదృష్టకరం. ఎమ్మెల్యే రావెలపై దాడికి యత్నించి నెలరోజులు గడుస్తున్నా నేటికీ టీడీపీ జిల్లా అధ్యక్షుడు గాని, టీడీపీ పెద్దలు గాని ఆ విషయంపై స్పందించలేదు. అగ్రకుల అహంకారంతో దళితులను టీడీపీ పెద్దలు చిన్న చూపు చూస్తున్నారు. దళితులకు టీడీపీ ప్రభుత్వంలో రక్షణ లేదనడానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. ఈ విషయాలన్నింటిని ఎస్సీ కమిషన్‌ సభ్యుడికి వివరిస్తాం. 
–చార్వాక, అంటరానితనం నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు 

>
మరిన్ని వార్తలు