పెందుర్తిలో టీడీపీ నేత రాక్షసత్వం  | Sakshi
Sakshi News home page

పెందుర్తిలో టీడీపీ నేత రాక్షసత్వం 

Published Mon, Dec 11 2023 6:21 AM

Acid attack on married woman: ap - Sakshi

పెందుర్తి: విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో టీడీపీ నేతల దుశ్శాసన పర్వం కొనసాగుతోంది. చింతగట్ల పంచాయతీ నందవరపువానిపాలెంలో ఒంటరిగా నివసిస్తున్న ఓ మహిళపై పంచాయతీ టీడీపీ అధ్యక్షుడు చీపురపల్లి నరసింగరావు రాక్షసంగా దాడి చేయడంతో పాటు ఆమె వద్ద ఉన్న రూ.5 లక్షలు, బంగారు ఆభరణాలను తస్కరించాడు. తీవ్ర గాయాలతో దాదాపు నాలుగు రోజుల పాటు నిందితుడు, అతడి కుటుంబ సభ్యుల చేతిలో బందీగా ఉండి సక్రమంగా చికిత్స అందక నరకయాతన అనుభవించిన ఆ అభాగ్యురాలు.. తెగించి శనివారం పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వివరాలు.. బాధితురాలి కథనం ప్రకారం.. విజయనగరం జిల్లాకు చెందిన మహిళ భర్తతో విభేదాల కారణంగా విశాఖ గోపాలపట్నం ప్రాంతంలో బ్యుటీషియన్‌గా పనిచేసేది. మూడేళ్ల కిందట నందవరపునవానిపాలెంలో చింతగట్ల పంచాయతీ టీడీపీ అధ్యక్షుడుగా ఉన్న చీపురపల్లి నరసింగరావు వద్ద ఇంటి స్థలాన్ని కొని అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంది.

ఈ క్రమంలో ఇంటి స్థలం కొన్న చనువుతో ఆమె వద్దకు తరచూ నరసింగరావు వస్తూ ఆమెను లోబరుచుకున్నాడు. ఎంతో ప్రేమ నటిస్తూ ఆరి్థక అవసరాలు కూడా తీర్చుకునేవాడు. ఈ వ్యవహారంలో నరసింగరావు భార్య చిన్ని కూడా ‘నువ్వు లేకపోతే నా భర్త ఉండలేడు.. మీ ఇద్దరూ కలిసి ఉండండి’ అంటూ బాధితురాలిని ఒప్పించడం గమనార్హం. ఇలా సహజీవనం సాగిస్తున్న తరుణంలో నరసింగరావు ప్రవర్తనలో మార్పు రావడంతో అతడిని దూరం పెట్టింది.   

యాసిడ్‌తో దాడి చేసి.. 
నరసింగరావుకు ఆమె దూరంగా ఉండటంతో అతడు సహించలేకపోయాడు. ఆమె ఇంటికి వెళ్లి కొడుతూ ఉండేవాడు. అలా నరసింగరావు వేధిస్తూ ఉంటుంటే.. అతడి భార్య చిన్ని వచ్చి బాధితురాలికి సర్ది చెబుతూ ఉండేది. ఈ క్రమంలో ఈ నెల 7 మధ్యాహ్నం 2.30 సమయంలో నరసింగరావు ఆమెను తీవ్రంగా కొట్టాడు. ఆమె దుస్తులు చింపేసి యాసిడ్‌ను ఆమెపై చల్లాడు. దీంతో ఆమె ఛాతి భాగం కాలిపోయింది.

అంతటితో ఆగకుండా ఆమె పొత్తికడుపు, మెడపై పిడిగుద్దులు గుద్దుతూ పేట్రేగిపోయాడు. బాధితురాలు అపస్మారక స్థితికి వెళ్లిపోవడంతో ఆమె బీరువాలోని నగదు, బంగారు ఆభరణాలను దొంగిలించాడు. ఇంట్లో గొడవను గుర్తించిన స్థానికులు రావడంతో నిందితుడు నరసింగరావు గోడ దూకి పారిపోయినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అయితే బాధితురాలికి ఏదైనా అయితే తన మెడకు చుట్టుకుంటుందన్న భయంతో ఆమెను నరవలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించాడు.

తన భార్య, కుటుంబ సభ్యులను ఆమె వద్ద కాపాలా ఉంచి అరకొర చికిత్సను అందించాడు. ఈ నాలుగు రోజుల పాటు ఆమె ఎక్కడుందో ఆమె బంధువులకు కూడా తెలియనివ్వకుండా జాగ్రత్త పడ్డాడు. అయితే ఆస్పత్రి నుంచి బాధితురాలు బయటికొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మెరుగైన చికిత్స నిమిత్తం ఆమెను కేజీహెచ్‌కు తరలించినట్టు పోలీసులు చెప్పారు.

Advertisement
Advertisement