అభాసుపాలైన టీడీపీ

11 Jan, 2020 04:39 IST|Sakshi

ఒంగోలులో విధి నిర్వహణలో హఠాన్మరణం చెందిన విలేకరి

ఈ ఘటనను రాజధాని వివాదానికి అనుకూలంగా మలుచుకునేందుకు స్కెచ్‌

హుటాహుటిన వచ్చిన లోకేశ్, కళా

తొక్కిసలాటలో మృతిచెందినట్లు లోకేశ్‌ షో

స్పందన లేకపోవడంతో అప్రదిష్టపాలు

తోపులాట కాదని స్పష్టంచేసిన తోటి రిపోర్టర్లు 

ఒంగోలు సబర్బన్‌: విధి నిర్వహణలో ఉన్న వీడియోగ్రాఫర్‌ కం రిపోర్టర్‌ హఠాన్మరణం చెందిన అంశాన్ని అమరావతి రాజధాని వివాదంలోకి లాగాలని టీడీపీ నాయకులు చేసిన పథక రచన ఆ పార్టీని, నాయకులను అభాసుపాల్జేసింది. సొంత పార్టీ నేతల నుంచే ఎలాంటి స్పందన లేకపోవడంతో వారు పర్యటనను మొక్కుబడిగా ముగించుకుని తిరుగుముఖం పట్టారు. వివరాల్లోకి వెళ్తే.. టీవీ లైవ్‌ ప్రోగ్రాం కోసం గురువారం వీడియో తీస్తున్న ఈటీవీ ఒంగోలు టౌన్‌ విలేకరి వీరగంధం సందీప్‌ (31) ఒక్కసారిగా కుప్పకూలి మృతిచెందాడు. ఈ ఘటన రాజధాని అమరావతి కోసం చేస్తున్న ర్యాలీలో చోటుచేసుకోవడంతో టీడీపీ తమ్ముళ్లు దీనిని తమ ఉద్యమానికి అనుకూలంగా మలుచుకుందామని స్కెచ్‌ వేశారు. ఇందులో భాగంగా ఆగమేఘాల మీద చినబాబు నారా లోకేశ్‌ను శుక్రవారం పిలిపించారు.

ఆయనతో పాటు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు కూడా వచ్చారు. రాజధాని ఉద్యమంలో భాగంగా తోపులాట, తొక్కిసలాటలో ఈ దుర్ఘటన జరిగిందని కలరింగ్‌ ఇచ్చేందుకు యత్నించారు. కానీ, సొంత పార్టీ నేతల నుంచే ఎలాంటి స్పందన లేకపోవటంతో విలేకరి స్వగ్రామం కొప్పోలు వెళ్లి అతనికి నివాళులర్పించారు. అక్కడ మీడియాతో లోకేశ్‌ మాట్లాడుతూ.. శాంతియుతంగా అమరావతి సాధన జేఏసీ ర్యాలీ నిర్వహిస్తుంటే పోలీసులకు, జేఏసీ ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగిందన్నారు. దీంతో విలేకరి సందీప్‌ ఊపిరాడక మృత్యువాత పడ్డారని చెప్పుకొచ్చారు.

ఈ అంశాన్ని లోకేశ్‌ రాజధాని వివాదంలోకి లాగడం చూసి స్థానికులు, టీడీపీ నేతలు ఒక్కసారిగా విస్మయానికి గురయ్యారు. కానీ, ఏ విధంగానూ జనస్పందన లేకపోవడంతో వారు అమరావతి సాధన సమితి దీక్షా శిబిరం వద్దకు చేరుకుని సీఎం వైఎస్‌ జగన్‌పై విమర్శలు చేసి తిరుగుముఖం పట్టారు. తొక్కిసలాటవల్ల కాదు.. సందీప్‌ గురువారం వీడియో తీస్తూనే కుప్పకూలిపోయాడని.. అక్కడ ఎలాంటి తోపులాట, తొక్కిసలాట జరగలేదని అదే కార్యక్రమం కవరేజీలో ఉన్న ఇతర మీడియా సహచర రిపోర్టర్లు స్పష్టంచేశారు. సమాచార సేకరణలో భాగంగా ఉదయం నుంచి పలు కార్యక్రమాలను కవర్‌ చేస్తూనే ఉన్నాడని, సాయంత్రం అమరావతి సాధన సమితి చేపట్టిన ర్యాలీని వీడియో తీస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్లు వారు చెప్పారు. వెంటనే తాము ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. కానీ, అప్పటికే సందీప్‌ మరణించినట్లు వైద్యులు నిర్ధారించారన్నారు.

మరిన్ని వార్తలు