విసిగించిన జేసీ ప్రసంగం

5 Jul, 2018 09:14 IST|Sakshi
దీక్షా ప్రాంగణంలో ఆశీనులైన టీడీపీ నేతలు

సాక్షి,విశాఖపట్నం/తాటిచెట్లపాలెం/డాబాగార్డెన్స్‌: అంతన్నారు.. ఇంతన్నారు.. రైల్వే జోన్‌ కోసం చేపట్టే నిరసన దీక్షకు తమ పార్టీ ఎంపీలంతా వచ్చి వాలిపోతారన్నారు. నగరం, జిల్లా వ్యాప్తంగా ఏకంగా 35 వేల మంది జనం తరలి వచ్చేస్తారని ఊదరగొట్టారు. జనంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందని, ముందస్తు ఏర్పాట్లు చేయమని పోలీసులకు హుకుం జారీ చేశారు. తీరా ఏమయింది? అనుకున్న సంఖ్యలో కనీసం పదో వంతు జనం కూడా హాజరు కాలేదు. దాదాపు అరడజను మంది ఎంపీలూ డుమ్మా కొట్టారు. రైల్వే జోన్‌ రాదంటూ వెటకారపు వ్యాఖ్యల నేపథ్యంలో హడావుడిగా, అట్టహాసంగా చేపట్టిన నిరసన దీక్ష అరకొర జనంతో తుస్సుమంది. ఆ పార్టీ శ్రేణుల్లోనూ నైరాశ్యం నింపింది. ఉదయం తొమ్మిది గంటలకు దీక్ష ప్రారంభమయ్యే సమయం నుంచి దీక్ష ముగిసే దాకా (సాయంత్రం 5 గంటల వరకు) వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన, తెచ్చిన జనం పలచగానే కనిపించారు. దీంతో పలువురు ఎంపీలు, రాష్ట్ర మంత్రులు మాట్లాడే సమయానికి కుర్చీల్లో చాలావరకు ఖాళీ అయ్యాయి.

అయినప్పటికీ వాళ్లంతా వాటినుద్దేశించే ప్రసంగాలు కొనసాగించారు. ప్రధాన టెంట్‌తో పాటు దానికి ముందు మరో రెండు టెంట్లు వేశారు. వాటిల్లో కూర్చునే వారు కరవవ్వడంతో అక్కడ వేసిన కుర్చీలను ఒకదానిపై ఒకటి పేర్పించారు. కుర్చీల్లో కూర్చోవాలంటూ వేదికపై ఉన్న వారు పదే పదే మైకుల్లో అభ్యర్థించినా ఫలితం కనిపించలేదు. జనాన్ని భారీగా తరలించాలని పార్టీ శ్రేణులకు నేతలు ఆదేశాలిచ్చారు. దీంతో వారిని రప్పించడానికి వాహనాలూ సమకూర్చారు. అయినా దీక్షకు రావడానికి జనం ఆసక్తి చూపలేదని ఒక సీనియర్‌ నాయకుడు ‘సాక్షి’కి చెప్పారు. మరోవైపు విశాఖకు రైల్వే జోన్‌ ఆవశ్యకతపై విశాఖ పశ్చిమ, దక్షిణ ఎమ్మెల్యేలు గణబాబు, వాసుపల్లి గణేష్‌కుమార్‌లు మాత్రమే మాట్లాడారు. పలువురు ఎంపీలు, ఒకరిద్దరు మంత్రులు ప్రత్యేక హోదా, రాష్ట్రానికి నిధులు విడుదలలో కేంద్రం చూపుతున్న వివక్షను ప్రస్తావించారు. ప్రధాన అంశమైన రైల్వే జోన్‌ గురించి నామమాత్రంగానే ప్రసంగించారు.
 
విసిగించిన జేసీ ప్రసంగం
వివాదాస్పద నాయకునిగా పేరున్న అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ప్రసంగం సభికులను బాగా విసిగించింది. దాదాపు గంట (58 నిమిషాలు) సేపు సా...గిన ఆయన ప్రసంగమంతా ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని దూషించడానికి, సీఎం చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తడానికే సరిపోయింది. తన ప్రసంగంలో అభ్యంతరకర వ్యాఖ్యలుండడంతో పలువురు విస్తుపోయారు. ఇక మాజీ కేంద్రమంత్రి అశోక్‌ గజపతిరాజు చాలా క్లుప్తంగా, పొడిపొడిగా మాట్లాడి మూడు నిమిషాల్లో ముగించేశారు. ఇక ఒకరంటే ఒకరు పొసగని జిల్లా మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావులు దీక్ష ప్రారంభ సమయానికి వచ్చి ముఖం చూపించి వెళ్లిపోయారు. విప్లవవీరుడు అల్లూరి జయంతి వేడుకల్లో వేర్వేరు చోట్ల పాల్గొనడానికి హడావుడిగా నిష్క్రమించారు. సాయంత్రం 5 గంటలకు దీక్షలో పాల్గొన్న వారికి ఎమ్మెల్సీ ఎంవీవీఎస్‌ మూర్తి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. దీక్షా శిబిరంలో ఎంపీలతోపాటు ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్‌కుమార్, వెలగపూడి రామకృష్ణబాబు, పంచకర్ల రమేష్‌బా బు, బండారు సత్యనారాయణమూర్తి, పీలా గో విందు, పల్లా శ్రీనివాస్, గణబాబు, కేఎస్‌ఎన్‌ రా జు, జెడ్పీ చైర్‌పర్సన్‌ లాలం భవానీ పాల్గొన్నారు.

ఎండలోనే కార్యకర్తలు
దీక్షలో నేతలకీ అన్ని సౌకర్యాలు కల్పించారు. పెద్ద ఎత్తున వేదిక ఏర్పాటు చేశారు. అయితే కార్యకర్తలను మాత్రం విస్మరించారు. కుర్చీలైతే వేశారు..కానీ టెంట్లు వేయకపోవడంతో కార్యకర్తలు ఎండలో ఇమడలేక..నేతల ప్రసంగాలు వినలేక నెమ్మదిగా జారుకున్నారు.
 
ఉద్యోగులు.. విద్యార్థులకు కష్టాలు
అధికారం మాది.. పోలీసులు మావోళ్లు అన్నట్టుగా టీడీపీ నాయకులు వ్యవహరించారు. నడిరోడ్డుపై దీక్ష చేయడానికి ఎవరికీ అనుమతి ఇవ్వరు.కానీ టీడీపీ దీక్షకు పోలీసులు ఎలా అనుమతులిచ్చారో వారికే తెలియాలి. నిత్యం వేలాది వాహనాలతో రద్దీగా ఉండే మార్గంలో నడిరోడ్డుపై దీక్ష చేపడుతుంటే పోలీసులు రాచమర్యాదలు చేసినట్టు కనిపించింది. కాన్వెంట్‌ జంక్షన్‌ మీదుగా వెళ్లే వాహనచోదకులు ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు  ఇబ్బందులకు గురయ్యారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ నిలిచిపోయి అవస్థలు పడ్డారు. అంబులెన్స్‌లు కూడా ట్రాఫిక్‌లో చిక్కుకున్నాయి.

మరిన్ని వార్తలు