తెలంగాణ బిడ్డల త్యాగాలు పట్టవా?

22 Nov, 2013 03:38 IST|Sakshi

సాక్షి, కరీంనగర్ : రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేయడం కోసమే సోనియాగాంధీ తెలంగాణ ఇస్తానంటున్నారని, పన్నెండువందల మంది తెలంగాణ బిడ్డల త్యాగాల వల్లకాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. అమరుల త్యాగాలపై సోనియా ఎన్నడూ నోరు తెరవలేదని, పార్లమెంటులో బీజేపీ లోక్‌సభాపక్ష నేత సుష్మాస్వరాజ్ మాత్రమే ఇక్కడి బిడ్డల త్యాగాలను వివరించి కేంద్రం మెడలు వంచారని అన్నారు. 2009 డిసెంబర్ 9న తెలంగాణను ప్రకటించి వెన్నుపోటు పొడవడం వల్లనే వందలాది మంది ఆత్మత్యాగాలు చేశారన్నారు. తెలంగాణ బిడ్డల బలిదానాలకు కారణమయిన సోనియాగాంధీకి గుడి  కట్టేందుకు కాంగ్రెస్ నాయకులకు సిగ్గుందా అని ధ్వజమెత్తారు.
 
 కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ ఎడవల్లి విజయేందర్‌రెడ్డి బీజేపీలో చేరిన సందర్భంగా గురువారం కరీంనగర్ సర్కస్‌గ్రౌండ్‌లో నిర్వహించిన తెలంగాణ పోరు జాతర సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణకు బీజేపీ కట్టుబడి ఉందని, కాంగ్రెస్‌కు దమ్ము ధైర్యముంటే శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లుపెట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకుల ప్రేమంతా ఓట్లు, అధికారంపైనేనని, కానీ 2014లో రాజకీయ ప్రభంజనం వస్తుందని, అందులో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతోపాటు ప్రాంతీయ, ఉప ప్రాంతీయ పార్టీలన్నీ కొట్టుకుపోతాయని అన్నారు. కరీంనగర్ జిల్లా తెలంగాణ ఉద్యమానికి పెట్టనికోట అని, ఈ జిల్లాతో బీజేపీకి అవినాభావ సంబంధం ఉందని అన్నారు.
 
 ఇక్కడి ప్రజలు బీజేపీ ఎంపీని గెలిపించి చరిత్ర సృష్టించారని, పలు ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు బ్రహ్మరథం పట్టారని గుర్తుచేశారు. ఉద్యమాల పురిటిగడ్డ అయిన కరీంనగర్‌పై తమకు గౌరవం ఉందని, బీజేపీ అధికారంలోకి వచ్చాక జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని అన్నారు. సింగరేణి, చేనేత, వ్యవసాయ రంగాల అభివృద్ధిపై దృష్టి పెడతామని, కరువు వల్ల గల్ఫ్‌దేశాలకు వలస వెళ్లిన వారి సంక్షేమానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. నరేంద్రమోడీ కరీంనగర్ కు వస్తారని, 2014 ఎన్నికలకు ముందు గానీ, ఎన్నికల సందర్భంగా గానీ ఇక్కడకు వచ్చి మాట్లాడతారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని, ఉత్తర తెలంగాణ పూర్తిగా వెనుకబడిందని విమర్శించారు. అభివృద్ధికి మారుపేరు బీజేపీయేనని, వాజ్‌పేయి హయాంలో దేశం ప్రగతి సాధించిందని, ఇప్పుడు గుజరాత్‌లో మోడీ నాయకత్వంలో ప్రజలు అభివృద్ధి చూస్తున్నారని వివరించారు. గుజరాత్‌లో 24గంటల విద్యుత్ ఇస్తున్నారని, వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి జరుగుతుందని వివరించారు. మోడీ ప్రధాని కావడానికి, ఆయన నాయకత్వంలో తెలంగాణ పునర్నిర్మాణానికి కరీంనగర్ నుంచి ఎంపీలను ఎమ్మెల్యేలను గెలిపించాలని ఆయన కోరారు.

చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిని కావాలని కోరుకుంటున్నట్టు చెప్తున్నారని, ఆయన విభజనకు అనుకూలమయితే అదెలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. రాహుల్‌గాంధీకి ప్రధాని అయ్యే పస లేదని, ఆయనో పప్పుముద్దలాంటి వాడని ఆరోపించారు. ఈ సభలో బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి పొల్సాని మురళీధర్‌రావు, కేంద్ర మాజీ మంత్రి సిహెచ్.విద్యాసాగర్‌రావు, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షుడు మీస అర్జున్‌రావుతోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు